చంద్రబాబు నాయుడు మాటలను విని తెలంగాణ పార్టీ కార్యకర్తలు నవ్వుకుంటున్నారు. రాష్ట్ర విభజనకు ముందు విభజన గురించి అభిప్రాయం చెప్పమంటే… స్పష్టంగా ఏమీ తేల్చకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ నాకు రెండు కళ్లు.. అనే మాయమాటలు చెబుతూ వచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఆ మాటలతోనే.. ఆయన తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సమాధి కట్టేశారు. ఇప్పటికీ ఆయన అదే మాట వల్లిస్తుండడం పట్ల పార్టీ శ్రేణులు నవ్వుకుంటున్నారు. ‘తమరి రెండు కళ్లు సల్లగుండ.. ఆ మాటల్ని కట్టిపెట్టండి బాబూ’ అని అంటున్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం చేపడతానని చంద్రబాబునాయుడు చాలా ఘనంగా సెలవిస్తున్నారు. అయితే ఆయన ఈ మాటలు చెప్పడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో అనేక సార్లు ఇలాగే చెప్పారు. విభజనకు ముందు ఇదే మాట చెబుతూ వచ్చారు.
విభజన తర్వాత.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా సమాధి అయిపోవడానికి ప్రధాన కారణం ఈ రెండు కళ్ల సిద్ధాంతమే. సమాధి అయిపోయిన తర్వాత చంద్రబాబునాయుడు తాను హైదరాబాదు వచ్చి పార్టీ ఆఫీసులో కాసేపు కూర్చున్న ప్రతి సందర్భంలోనూ పునర్నిర్మాణం అనే పాట పాడుతూ వచ్చారు.
పాపం.. కాసాని జ్ఞానేశ్వర్ ను రాష్ట్ర అధ్యక్షుడు చేసినప్పుడు.. ఆయన ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయించారు. ఆ సభ చూసి మురిసిపోయిన చంద్రబాబు.. వచ్చిన జనం మొత్తం తన బలమే అని భ్రమపడ్డారు. తెలంగాణలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తా అని ప్రగల్భాలు పలికారు. వేర్వేరు సందర్భాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టి.. తెలంగాణ తెలుగుదేశాన్ని మళ్లీ ఉద్ధరించేస్తానని, నెలకు ఓసారి ఉండవిల్లి నుంచి కార్యకర్తల వీడియో కాన్ఫరెన్సులు పెడతానని.. అప్పుడప్పుడూ వచ్చి పార్టీ ఆఫీసులో కీలక కార్యకర్తల సమావేశాలు పెడతానని బోలెడు మాటలు చెప్పారు. అవేవీ కార్యరూపంలోకి రాలేదు.
ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే కబుర్లు చెబుతున్నారు. తెలంగాణ పార్టీ పునర్నిర్మాణం చేస్తానని అంటున్నారు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో తన శిష్యుడు కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉండగా.. వారిని విమర్శించేలా, బిజెపి సారథ్యంలోని కూటమిలో భాగస్వామిగా ఉంటూ.. వారికి ప్రత్యామ్నాయంగా తెలంగాణలో ఎదిగేలా తెలుగుదేశాన్ని పునర్నిర్మాణం చేయగల సత్తా చంద్రబాబుకు ఉన్నదా? అనేది పెద్ద సంశయం.
ఆయన ఎన్ని మాటలు చెప్పినా.. ఆయన వచ్చినప్పుడు బ్యానర్లు తోరణాలు కట్టి, ఊరేగింపుకు జనం వస్తారు గానీ.. పార్టీ పునర్నిర్మాణం అంటే తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు.