Advertisement

Advertisement


Home > Articles - Chanakya

వినడు..కనడు..అతడే జగన్

వినడు..కనడు..అతడే జగన్

విజయం మాత్రమే కాదు ఓటమి కూడా ఒక్కోసారి స్వయం కృతమే. అతి ధీమా, లెక్కలేనితనం, అనుభవరాహిత్యం, మనను మించిన మొనగాడెవ్వడు అని అనుకోవడం లాంటి లక్షణాలు అవలీలగా అపజయాన్ని తీసుకొచ్చి నెత్తిన పెడతాయి. ఎదిగిన కొద్దీ ఒదగడం కాదు, ఎదగడానికి కూడా ఒదిగే వుండాలి..ఈ వైనం తెలియని వాడు వైఎస్ జగన్మోహన రెడ్డి. ఉడుకురక్తం, ఉరకలేసే వయసు, తనది అనుకున్నది తనకు అందకుండా పోయిందన్న ఉక్రోషం వెరసి అతగాడిని కష్టాల పాలు చేసాయి. వ్యాపార సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసాయి. జైలు గోడల మధ్య జీవితం గడిపేలా ప్రేరేపించాయి. ఒళ్లు హూనం అయ్యేలా జనం మధ్య తిరిగినా, ఆఖరికి మిగిలింది అపజయమే. అధికార పీఠం అల్లంత దూరంలో అందనంత తీరంలో మిగిలిపోయింది. అనుభవానికి, అత్యుత్సాహానికి నడుమ జరిగిన పోరులో, ఆఖరికి అంపశయ్య మీద పడుకోవాల్సి వచ్చింది. 

అధికారం అనేది అనూచానంగా వచ్చేది మాత్రమే కాదు, దాన్ని సాధించాలన్నా, నిలబెట్టుకోవాలన్నా, చాలా చాకచక్యం కావాలన్న గుణపాఠాన్ని జగన్ కు నేర్పాయి ఈ ఎన్నికలు. వ్యాపారాలను విజయవంతంగా నడిపినవాడికి యాజమాన్య సూత్రాలు వంటపట్టే వుండాలి. కానీ రాజకీయాలకు అవి అక్కర్లేదని పక్కన పేట్టేసినట్లున్నాడు జగన్. అందుకే టీమ్ లీడర్ షిప్ అన్న అసలుసిసలైన విజయసూత్రాన్ని పక్కనపెట్టి, అన్నీ తానే..అంతా తానే..అనే సింగిల్ పాయింట్ ఫార్ములాను నమ్ముకుని, చివరకు ఇలా మిగిలాడు.

***

విజయం ఒంటరిగా సాధించలేనంత అపురూపమైనది కాదు. కానీ విజయం తప్పని సరి అయినపుడు, తలపెట్టిన పని మందితో కూడిన వ్యవహారమైనపుడు కచ్చితంగా నలుగురి సాయం అవసరం. కొన్ని వ్యవహారాలు అనుభవంపైన కానీ తెలిసిరావు. కొందరు అభిమానంతో కానీ దగ్గరకారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ విషయాలు తెలిసినవాడు. ముఖ్యమంత్రి కావడానికి దశాబ్ధాల కాలానికి ముందే ఆయనకు రాష్ట్రం నలుమూలలా అభిమానించే స్నేహితులు వుండేవారు. వారికి ఆయన సాయాలు అందేవి. ఆ సహాయాలు ఎవరికీ తెలిసేవి కాదు..అందుకున్న వారికీ, చేసిన ఈయనకూ తప్ప. అప్పటికి వైఎస్ కు ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యం ఇంకా చాలా దూరంగానే వుంది. కేవలం ఒకరిద్దరికి సాయం చేసినంత మాత్రాన అది దగ్గరైపోదు. కానీ అది ఆయన వే ఆఫ్ లైఫ్. సాయం ఆయన నైజం. స్నేహం ఆయన స్వభావం. అందుకే కావచ్చు..కెవిపి ఆత్మగా మారాడు. 

జగన్ తొలి పరాజయం, కెవిపి దగ్గర లేకపోవడంతోనే ప్రారంభమైంది. మూడేళ్ల క్రితం అనుకుంటాను..ఓ వ్యాసానికి నేను పెట్టిన శీర్షిక, జగన్ కు సలహా దారులు కావలెను. అప్పటికే తప్పటడుగులు వేస్తున్న జగన్ వ్యవహారం చూసి రాసిన వ్యాసం అది. వైఎస్ అవినీతిలో కెవిపి పాత్ర సంగతి ఎలా వున్నా, సాధించిన విజయాల వెనక ఆయన మంత్రాంగం చాలా వుంది. ఈ సంగతి వైఎస్ ఇంటి బయట వున్నవారికి, రాష్ట్ర రాజకీయాలు పరిశీలించేవారికి అర్థమైనపుడు, ఆ ఇంట్లొ వుండే జగన్ కు ఎందుకు తెలియకుండా వుంటుంది? తెలిసీ ఎందుకు దూరం చేసుకున్నట్లు? లేదా ఆయన దూరమైనట్లా? అంటే ఇద్దరి నడుమ పొసగలేదన్నది స్పష్టం. ఈయన దారికి ఆయన రాకపోవడమో, ఆయన దారిలోకి ఈయన వెళ్లకపోవడమో. 

నటుడు రాజశేఖర్ ను ఓ సారి కలిసినపుడు, వైకాపాతో ఎందుకు పొసగలేదు అని అడిగాను. 'నేను మేకప్ తో రాకూడదు..జీన్స్ వేసుకోకూడదు..గాగుల్స్ పెట్టుకోకూడదు..ఇలాచాలా కండిషన్లు..అందుకే' అని చెప్పుకొచ్చారాయన. అంటే జగన్ ముందు రాజశేఖర్ స్పెషల్ గా కనిపించకూడదన్న థాట్ అందులో వ్యక్తమయింది. ఇలా జగన్ దూరం చేసుకున్న వారి జాబితా చిన్నదేమీ కాదు. అంటె వీరివల్ల ఒదిగేదేముంది అని ఎవరైనా అనొచ్చు. లాభం లేకున్నా, బయటకు వెళ్లి ఇలాంటి వాళ్ల మాటల వల్ల జరిగే జగన్ వ్యక్తిత్వ హననం ఇంతా అంతా కాదు. అది అలా అలా చాపకింద నీరులా చేరుతూనే వుంటుంది. ఒక్క కెవిపి సంగతి అలా వుంచితే, రాజశేఖర్ రెడ్డి అంటే ప్రాణం ఇచ్చేంత నాయకులు చాలా మంది జగన్ పక్షాన ఎందుకు చేరలేదు. కాంగ్రెస్ నుంచి ఎవరూ రాకపోవడం అంటూ లేదుగా..చాలా మంది వచ్చారు. అలాగే 'దేశం'నుంచి. మరి ఉండవల్లి, శతృచర్ల, బాలరాజు, ఇలా చాలా మంది అభిమానులు ఎందుకు రాలేదు. వారిని ఎందుకు జగన్ చేరదీయలేదు? వారి సంగతి జనానికి తెలుసు. మరి జగన్ సంగతి వారికి తెలియడం వలనా? 

ఇందంతా ఎందుకు చెప్పడం అంటే, వరదలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ కనిపించినా పట్టుకోవాల్సిందే.పనికి వస్తుందా,. రాదా అన్నది తరువాతి సంగతి.ఎన్నికలు అన్నాక రోడ్డెక్కి కనిపించి ప్రతి ఇంటా దూరి, ప్రతీ చోటా తిని, ప్రథి బుగ్గా నిమిరే యోచన వున్నవాడు, అవసరమైన వారిని కూడా చేరదీసి,ఓర్పుగా పని చేయించుకోవడం రాకపోతే ఎలా? 

ఆదిలోనే హంసపాదు

తోడుతూ తెలుగుదేశం నుంచి పార్టీలోకి తీసుకు వచ్చారు దాడి వీరభద్రరావును. దాంతో అక్కడ ఆగర్భ శతృవైన కొణతాల అలిగారు. దాంతో మళ్లీ అలాంటి ప్రయోగిం చేయలేదు జగన్. మరి బాబు పోయి పోయి, పరిటాల కుటుంబంతో భయంకరమైన వైరం వన్న జెసి వర్గాన్ని కూడా లోపలకు తెచ్చి ఎలా మేనేజ్ చేయగలిగారు. అయ్యన్నకు పడని గంటా వర్గాన్ని తీసుకువచ్చి, ఎలా నచ్చ చెప్పగలిగారు. ఆదికి ముందే జగన్ పదే పదే సర్వేల పేరిట తను నమ్మిన వారిని ఊళ్లపైకి తరిమారు. వాళ్లు టికెట్ మీకే అంటూ బోగస్ సర్వేలు చేసి, అక్కడ డబ్బులు తిని, జగన్ ను పక్కదారి పట్టించారు. దాంతో ఆయనకు తన మనుషులపైనే నమ్మకం పోయింది. సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా ఒకరేమిటి అందరూ జగన్ చేత కాస్త దూరం పెట్టబడ్డవారే. ఈ వ్యవహారం ఇలా సాగి సాగి, ఆఖరికి ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి జగన్ పక్కన అమ్మ, చెల్లి తప్ప మరెవరు కనిపించలేదు. కాదూ అంటే రిటైర్మెంట్ క్యాండిడేట్లు మైసూరా, లక్ష్మీపార్వతి వగైరాలు. 

ముంచిన నమ్మకం

జనం ఓట్లు వేయడానికి సిద్దంగా వున్నారు. వైఎస్ తనయుడిగా తనను ఆదరిస్తారు. ఎటొచ్చీ తాను చేయాల్సింది వారికి తగిన అభ్యర్థులను అక్కడ వుంచడమే ఇదీ జగన్ భావనగా కనిపించింది. అందుకు ఆయన తనను నమ్ముకున్న వారిని మందుగానే సిద్ధం చేసుకున్నారు. కానీ ప్రతి జిల్లాలోనూ రెండు మూడు కులాలు వుంటాయని, వాటికి నాయకులు వుంటారని వారిని కూడా చేరదీయాలనీ అనుకోలేదు. ఎన్నికల వేళ అన్ని వర్గాలకు టికెట్ లు ఇస్తే సరిపోతుందనుకున్నారు. ఉదాహరణకు వైకాపాకు హ్యాండిచ్చిన విజయనగరం జిల్లానే చూడండి..బొబ్బిలి వెలమలను మాత్రం నమ్ముకున్నాడు. వాళ్లు అక్కడ వైకాపా లీడర్లు అనే సరికి కాపులు హ్యాండిచ్చారు. అలాగే విశాఖ జిల్లాలో గవర్లు (దాడి, కొణతాల) లీడర్లు అనేసరికి అక్కడ కాపులు హ్యాండిచ్చారు.  పశ్చిమగోదావరి జిల్లాలో క్షత్రియులు ఏకతాటిపై తన అపజయానికి కృషి చేస్తున్నారని తెలిసినపుడు, ఎందుకు? ఏమిటి? ఎలా పరిష్కరించాలి అన్నది ఆలోచించాలి కదా? ఇలాంటి తప్పిదాలు జగన్ దగ్గర సవాలక్ష. వాటి ఫలితమే ఈ పరాజయం. ఎంతసేపూ జనం ఓట్లు వేయడానికి సిద్ధంగా వున్నారు. నన్ను చూసి వేస్తారు అనుకోవడమే కానీ, పోలింగ్ మేనేజ్ మెంట్ అనేది ఒకటి వుంటుందని గమనిస్తేగా? 

సలహాలకు దూరం

జగన్ కు సలహా చెప్పడం అంటేనే వైకాపాలో జరగని పని. ఇది అంతర్గత వర్గాలు చెప్పే సంగతి. ఆయన సలహాలు వినరు. కనీసం విన్నట్లు నటించరు. పోనీ తన తరపున సమస్యల పరిష్కారానికి ఎవరినీ పురమాయించరు. ఆఖరికి స్వంత సోదరినే రెండు పవర్ సెంటర్లు వద్దని చెప్పి, పక్కన వుంచారు. ఇలా అయితే ఎలా? మోడీ సైతం తన బలం తాను గుర్తించి, సల్మాన్, పవన్, రజనీ లాంటి వాళ్లను జట్టులోకి తెచ్చుకున్నారు. జగన్ మోడీ కన్నా ఎక్కువేమీ కాదు కదా? మరి జగన్ పార్టీకి బలం ఎక్కడ నుంచి వస్తుంది. ప్రత్యర్థిని చంపడానికి ఒక్క బులెట్ చాలు. మరి రివాల్వర్ లో ఆరు బులెట్ లకు స్థానం ఎందుకు? ఒకటి మిస్ ఫైర్ అయితే మరొకటి. మరి జగన్ తన పార్టీ సాధన సంపత్తిని ఆ విధంగా ఎందుకు పెంచుకోలేకపోయారు. 

ప్రచారాలకు పగ్గాలేవీ?

రుణమాఫీ పథకం..జనాలకు పడుతుంది అని తెలుసు కదా. వైఎస్ ఫ్రీ కరెంట్ అన్నపుడు బాబు ఎద్దేవా చేస్తే ఏం జరిగిందో తెలుసుకదా..మరి జగన్ ఎందుకు రుణమాఫీని ఎద్దేవా చేయాలి? అది సాధ్యం కాదు అని చెప్పాలి. విజయమ్మ గెలిస్తే విశాఖ కాస్తా కడప అయిపోతుందన్న ప్రచారం సాగిస్తే, దాన్ని ఎందుకు ఖండించలేకపోయారు. అనుభవం వుంటేనే అభివృద్ధి సాధ్యం అన్నపుడు ఎందుకు కాదని రుజువు చేయలేకపోయారు. ఎంత సేపూ సాక్షి..సాక్షి..సాక్షి..అందులో  రాసుకుంటే చాలు..టీవీలో చెప్పుకుంటే చాలు. అంతే కానీ జనాల్లోకి బలంగా బదులుచెప్పగల నాయకులేరీ. తిరుపతి కొండపైకి చెప్పులతో వెళ్లారని అంటే నిజమో కాదో, తప్పయితే క్షమించమనడమో ఏదో ఒకటి చేయాలి కదా.. దొంగ నోట్లు పంచారు.కల్తీ లిక్కర్ పంచారు..ఇదీ ప్రచారమే..కానీ ఖండన ఏదీ..పైసా పైసా కలిస్తే, పది పైసలు..పదీ పదీ కలిస్తే, వంద..కానీ ఏదీ పట్టని తనమైతే ఎలా? నన్ను చూసి ఓట్లేస్తారు..నేను చేయగలిగింది తిరగడం ఒక్కటే అనుకుంటే ఫలితం ఇలాగే వుంటుంది. అసలు పార్టీ కార్యాలయం, దానికో స్వరూపం, అక్కడి నుంచి ప్రకటనలు, ఖండనలు, ఇలాంటివి ఏమేరకు ఆర్గనైజ్ చేసారని. జగన్ దగ్గర ఎవరు? ఏ మేరకు అన్నిది  వారికే తెలియదు. పనులు పురమాయించేవారేరీ..చేసేవారేరీ?

మోడీ ప్రచారం

మోడీ ప్రచారం,పవన్ కళ్యాణ్ ప్రచారం తన విజయానికి అడ్డం పడతాయని జగన్ కు తెలియదా?  ఆ నష్ట నివారణకు చేసిందేమిటి? ప్రత్యేకంగా ఏమీ లేదు.మళ్లీ మామూలే,.,.ఊళ్లు పట్టుకు తిరగడమే. తెలియని వాడు మెట్లు ఎక్కి ఆయసపడతాడు.తెలిసన వాడు లిఫ్ట్ వాడుకుని సుఖపడతాడు. ఈ ఎన్నికల్లో జగన్, చంద్రబాబు చేసింది ఇదే. జగన్ కు తెలియదు..చెబితే వినరు..అసలు చెప్పే అవకాశం ఎవరికీ ఇవ్వరు. ఇచ్చి వుంటే, ఈ పరిస్థితి వచ్చి వుండేదే కాదేమో? పైగా మోడీ పట్ల ఓ సిద్దాంతం అన్నది వైకాపాకు లేనట్లే. జగన్ జైలులో వున్నపుడే భాజపా నుంచి రాయబారం వచ్చిందని వినికిడి. కాదన్నారు. ఓకె,. పోనీ నికార్సుగా మోడీకి వ్యతిరేకంగా వెళ్లారా..ఆ మాటలోనూ స్పష్టత లేదు. పొనీ యుపిఎ వైపు వెళ్లమని చెప్పగలిగారా అదీ లేదు. అంటే మీకు ముందు జాతీయ రాజకీయాలు ఎలా వుంటాయో, ఏ మలుపు తిరుగుతాయో అన్నదానిపై స్పష్టమైన అవగాహన లేదు. మరి అలాంటపుడు ప్రజలను ఎలా నమ్మించగలుగుతారు. 

పార్టీ నిలబడేనా?

జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు వెంట వున్నవారిలో, నేటికి మిగిలిన వారు ఎందరు? ఇప్పుడు ఈ అరవై, డెభ్భై మందిని జగన్ కాసుకోగలరా? మోడీకి జగన్ బలం అక్కరలేదు. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల నాటికి జగన్ అనే శక్తి వుండకూడదు. మరి ఈ రెండింటి నడుమ వ్యవహారాలను తట్టకుని జగన్ నిలదొక్కుకోగలడా? అలా వుండాలంటే మళ్లీ జగన్ కు మంచి సలహా దారుడు కావాలి. కెవిపి లాంటి తెలివైనవాడు..వైఎస్ లాంటి స్నేహశీలి..సుజనా చౌదరి లాంటి వ్యవహారకర్త..దొరికేనా?

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?