Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: మోసగాళ్లకు మోసగాడు

సినిమా రివ్యూ: మోసగాళ్లకు మోసగాడు

రివ్యూ: మోసగాళ్లకు మోసగాడు
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: లక్ష్మీ నరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: సుధీర్‌ బాబు, నందిని రాయ్‌, జయప్రకాష్‌రెడ్డి, అభిమన్యు సింగ్‌, పంకజ్‌ కేసరి, ప్రవీణ్‌, చంద్రమోహన్‌, సప్తగిరి, ఫిష్‌ వెంకట్‌, దువ్వాసి మోహన్‌ తదితరులు
మాటలు: ప్రసాద్‌ వర్మ
సంగీతం: మణికాంత్‌ ఖాద్రి
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: యు. సాయిప్రకాష్‌
నిర్మాత: చక్రి చిగురుపాటి
రచన, దర్శకత్వం: బోస్‌ నెల్లూరి
విడుదల తేదీ: మే 22, 2015

‘చెడు చేసేవాడు ఆలోచించాలి... మంచి చేసేవాడు చేసుకుంటూ పోవాలంతే’ ఈ థీమ్‌ మీదే ‘మోసగాళ్లకు మోసగాడు’ బేస్‌ అయింది. ‘కొత్తదనం అందించాలంటే ఆలోచించాలి... కామెడీ చేసి పాస్‌ అయిపోవాలంటే చేసుకుంటూ పోవాలంతే’ అనే ఇంప్రెషన్‌ని ఈ సినిమా ట్రీట్‌మెంట్‌ కలిగించింది. యువ దర్శకుడు క్రైమ్‌ కామెడీ జోనర్‌ని ఎంచుకున్నప్పుడు... అది ‘స్వామిరారా’లాంటి ఫ్రెష్‌ అప్పీల్‌ ఉన్న సినిమాకి సీక్వెల్‌ అనే ప్రచారం జరిగినప్పుడు ఈ చిత్రం నుంచి కూడా కొత్తదనం ఆశించడం ప్రేక్షకుడి తప్పు అవదు. కొత్తగా తెర మీదకి వచ్చిన దర్శకులకి రెండు మార్గాలుంటాయి. ఒకటి కొత్త ఆలోచనలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి ఆకట్టేసుకోవడం... రెండు కమర్షియల్‌ సూత్రాలని, కామెడీని నమ్ముకుని సేఫ్‌గా గట్టెక్కేయాలనుకోవడం. 

బోస్‌ నెల్లూరి మొదటి చిత్రం ‘డి.కె. బోస్‌’ ఇంకా రిలీజ్‌ కాలేదు. మొదటి సినిమాకి అతనెలాంటి కథాంశాన్ని ఎంచుకున్నాడో, దానిని ఎలా తీసాడో మనకి తెలీదు. ఈ రెండవ ప్రయత్నంలో మాత్రం బోస్‌ పైన చెప్పిన రెండు పడవల్లోను కాలు పెట్టాలని చూసాడు. విగ్రహాల చోరీ, హీరో ఏమో దొంగ అనేది మినహాయిస్తే దీనికీ, స్వామిరారాకీ లింకు లేదు. కానీ మంచికో, చెడుకో దానికి సీక్వెల్‌ అనే ప్రచారమైతే జరిగిపోయింది. కాబట్టి వద్దన్నా రెండిటి మధ్య పోలికలు వస్తాయి. దానికంటే ఇది బెటరా కాదా, బాగుందా లేదా అనే ప్రశ్నలూ తలెత్తుతాయి. ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని వైవిధ్యభరితంగా రూపొందించే స్కోప్‌ ఉంది. స్వామిరారా ప్యాట్రన్‌లో కాకపోయినా... అదే కాన్సెప్ట్‌ని ఆసక్తికరంగా డీల్‌ చేసి ఉత్కంఠ కలిగించడానికి ఆస్కారముంది. కానీ బోస్‌ నెల్లూరి తన కథని కొత్తగా చెప్పడం కంటే కామెడీతో నింపడం సేఫ్‌ అని భావించినట్టున్నాడు. 

కామెడీ కోసం ఇందులో చేయని ప్రయత్నం లేదు. ప్రతి సీన్‌లోను కామెడీని ‘ఇరికించే’ ప్రయత్నం ప్రస్పుటంగా కనిపించింది. కామెడీ అవసరమైన చోట పండితే ఎంత హాయిగా నవ్విస్తుందో, అవసరం లేని చోట పడితే అంతగా ఇరిటేట్‌ చేస్తుంది. ప్రథమార్థంలో అవసరం అయిన కామెడీ కంటే అక్కర్లేదనిపించినదే ఎక్కువై ‘మోసగాళ్లకు మోసగాడు’ ఒకింత నిరాశ పరుస్తుంది. పెళ్లి కోసమని హీరోయిన్‌ చేసే ప్రయత్నాలు, ఆమెకి దొరికే డాక్టర్‌ వరుడు వగైరా ప్రయత్నాలతో పాటు జయప్రకాష్‌రెడ్డి చుట్టూ జరిగే కామెడీ కూడా అంతగా నవ్వించదు. 

ద్వితీయార్థంలో విగ్రహం చుట్టూ కథ నడుస్తూ ఉత్కంఠ ఉంటుందేమో అని ఆశిస్తే, అక్కడ కూడా కామెడీకే ప్రాధాన్యమివ్వడంతో ‘మోసగాళ్లకు మోసగాడు’ శ్రీను వైట్ల ఫార్ములాలోకి షిఫ్ట్‌ అవుతుంది. హీరో, విలన్స్‌ అంతా ఒకే ఇంట్లో చేరి కామెడీ చేయడమనేది ఇప్పటికీ బోర్‌ కొట్టించనట్టయితే బోస్‌ చేసిన ఈ ఎటెంప్ట్‌ ఇంకోసారి నవ్వించే అవకాశముంది. ఫిష్‌ వెంకట్‌ పెళ్లి ప్రహసనం, అక్కడికి చొరబడి సప్తగిరి అందించే వినోదం మాస్‌ ఆడియన్స్‌ని టార్గెట్‌ చేసినట్టుంది. వీలయినంత కామెడీ పెట్టి కమర్షియల్‌గా పాస్‌ చేయించడానికి చేసిన ప్రయత్నం క్లయిమాక్స్‌లో పతాక స్థాయికి చేరింది. ఈ తంతు మొత్తం ఒక వర్గం ప్రేక్షకులని ఆకట్టుకునే ఛాన్స్‌ అయితే ఉంది. ‘మోసగాళ్లకు మోసగాడు’ అనే టైటిల్‌ని బట్టి ఇందులో ఎత్తులకి పై ఎత్తులు వేసే హీరోని ఆశిస్తే నిరాశ తప్పదు. స్వామిరారా మార్కు కొత్తదనం కానీ, కొత్త దర్శకుడి సినిమాలో ఉండే ఫ్రెష్‌నెస్‌ కానీ లేని ఈ చిత్రంలో కామెడీనే డ్రైవింగ్‌ సీట్‌ తీసుకుంది. కాసిని నవ్వించే సన్నివేశాలుంటే పైసా వసూల్‌ అనుకునే వారికి ఈ చిత్రం తృప్తినిస్తుంది. 

హుషారైన పాత్రలో సుధీర్‌బాబు ఫర్వాలేదనిపిస్తాడు. తన గత చిత్రాలతో పోలిస్తే నటుడిగా బెటరయ్యాడు. డాన్సుల్లో ఇంతకుముందే తన టాలెంట్‌ చూపించిన సుధీర్‌ ఇందులో కూడా మంచి డాన్స్‌లు చేసాడు. నందిని రాయ్‌ క్యారెక్టర్‌ని ఇన్నోసెంట్‌గా చూపిస్తూ కామెడీ పండించాలని చూసారు కానీ అదేమంత వర్కవుట్‌ కాలేదు. ఆమె నటన కూడా అంతంత మాత్రమే అనిపిస్తుంది. పంకజ్‌ కేసరి అందరి కంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. పోలీస్‌ క్యారెక్టర్‌లో అతని నటన చాలా బాగుంది. అభిమన్యుసింగ్‌ ఇంటర్నేషనల్‌ స్మగ్లర్‌ పాత్రలో బిలీవబుల్‌గా కనిపించాడు. జయప్రకాష్‌రెడ్డి కామెడీ పరంగా ఈ చిత్రానికి పిల్లర్‌గా నిలిచాడు. తన మార్కు కామెడీతో పలు సందర్భాల్లో నవ్వించాడు. అతని వెంట ఉండే పాత్రల్లో ఫిష్‌ వెంకట్‌, దువ్వాసి కూడా తలో చెయ్యి వేసారు. సుధీర్‌ స్నేహితుడిగా ప్రవీణ్‌, నిజాయతీపరుడైన టీచర్‌గా చంద్రమోహన్‌ బాగా చేసారు. క్లయిమాక్స్‌లో ఎంటర్‌ అయ్యే సప్తగిరి కామెడీ పరంగా ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.

బోస్‌ నెల్లూరి ఈ చిత్రాన్ని తనకున్న వనరులతో డీసెంట్‌గా తెరకెక్కించాడు. దర్శకుడిగా అన్ని శాఖలతో పని చేయించుకుని, డీసెంట్‌ ప్రోడక్ట్‌ ఇవ్వగలిగే సామర్ధ్యం అతనికుంది. కమర్షియల్‌ ఫార్ములాని కాకుండా కొత్తదనాన్ని నమ్ముకుని ఉంటే దర్శకుడిగా ఫస్ట్‌ ఇంప్రెషన్‌ బాగా వేసే అవకాశముండేది. ప్రసాద్‌వర్మ సంభాషణలు ఫర్వాలేదనిపిస్తాయి. పాటలు ఆకట్టుకోలేదు కానీ నేపథ్య సంగీతం బానే ఉంది. లిమిటెడ్‌ బడ్జెట్‌లో తీయడం వల్ల ఆ ఎఫెక్ట్‌ క్వాలిటీ పరంగా కనిపించింది. కాలక్షేపానికి పనికొచ్చే కొన్ని కామెడీ సీన్లు మినహా ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రంలో చెప్పుకోతగ్గ విశేషాలు లేవు. కేవలం కామెడీ కోసమైతే ఒకసారి వీక్షించవచ్చు. కొత్తదనం ఆశిస్తే నిరాశ తప్పదు.

బోటమ్‌ లైన్‌: ఇంట్రెస్టింగ్‌ సెటప్‌.. రొటీన్‌ ట్రీట్‌మెంట్‌!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?