సినిమా రివ్యూ: సైజ్‌ జీరో

రివ్యూ: సైజ్‌ జీరో రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: పివిపి సినిమా తారాగణం: అనుష్క, ఆర్య, సోనాల్‌ చౌహాన్‌, ఊర్వశి, ప్రకాష్‌రాజ్‌, అలీ, గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మానందం, అడివి శేష్‌ తదితరులు రచన: కనిక కోవెలమూడి…

రివ్యూ: సైజ్‌ జీరో
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: పివిపి సినిమా
తారాగణం: అనుష్క, ఆర్య, సోనాల్‌ చౌహాన్‌, ఊర్వశి, ప్రకాష్‌రాజ్‌, అలీ, గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మానందం, అడివి శేష్‌ తదితరులు
రచన: కనిక కోవెలమూడి
సంభాషణలు: కిరణ్‌
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
కూర్పు: ప్రవీణ్‌ పూడి
ఛాయాగ్రహణం: నిరవ్‌ షా
నిర్మాత: పరమ్‌ వి. పొట్లూరి
దర్శకత్వం: ప్రకాష్‌ రావు కోవెలమూడి
విడుదల తేదీ: నవంబరు 27, 2015

లావుపాటి కథానాయకులని, కథానాయికలని పెట్టి సినిమాలు తీయడమనేది కొత్తేమీ కాదు. రాజేంద్రప్రసాద్‌ కొబ్బరిబోండాం చేస్తే, మొన్నీమధ్య అల్లరి నరేష్‌ 'లడ్డుబాబు'గా కనిపించాడు. కితకితలు, వినాయకుడు తదితర సినిమాలు కూడా ఉన్నాయి. అనుష్కలాంటి ఒక టాప్‌ క్లాస్‌, గ్లామరస్‌ నటి ఇలాంటి డీ గ్లామరైజ్డ్‌ రోల్‌ చేయడం మాత్రం ఇంతకుముందు జరగలేదు. క్యారెక్టర్‌ కోసమని పదిహేడు కిలోల బరువు పెరిగిన అనుష్క తన డెడికేషన్‌ ఏంటనేది చూపించింది. పాత్రలోకి 'పరకాయ' ప్రవేశం చేయడమంటారు కదా… అనుష్క ఈ సినిమాకోసం 'ఊబకాయ' ప్రవేశం చేసేసింది. నటిగా అనుష్క ఇంతవరకు చాలానే ఛాలెంజింగ్‌ క్యారెక్టర్స్‌ చేసింది కానీ ఇది అన్నిటికంటే ఒక మెట్టు పైనే ఉంటుంది. కేవలం నటిస్తే కాదు.. ఆ బరువు బాధ్యతలు మోస్తే తప్ప పాత్ర క్లిక్‌ అవదని బరువు పెరిగిన అనుష్క 'స్వీటీ' పాత్రని చాలానే ప్రేమించినట్టుంది. అందుకేనేమో అరుంధతి సినిమాలో అయినా ఆమె పర్‌ఫార్మెన్స్‌లో 'రాంగ్‌ నోట్స్‌' ఉన్నాయేమో కానీ 'సైజ్‌ జీరో'లో మాత్రం సింగిల్‌ రాంగ్‌ నోట్‌ లేని పర్‌ఫెక్ట్‌ పర్‌ఫార్మెన్స్‌తో తన వరకు ఈ సినిమాకి పూర్తి న్యాయం చేసింది. 

తెలుగు సినీ దర్శకుల్లో పాతిక పైగా సినిమాలు తీసిన వారిలో అత్యధిక విజయశాతం ఉన్న దర్శకుడిగా చరిత్ర సృష్టించిన రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ రావు 'అనగనగా ఓ ధీరుడు'తో నిరాశ పరిచాడు. ఆ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని చేసిన 'సైజ్‌ జీరో'తో బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడని అనుకుంటే… సగం వరకు బౌన్స్‌ అయి, తిరిగి బ్యాక్‌కెళ్లిపోయాడు! ఫస్ట్‌ హాఫ్‌ వరకు ఈ చిత్రాన్ని ఎలాంటి హిక్‌అప్స్‌ లేకుండా నడిపించిన ప్రకాష్‌రావు సెకండ్‌ హాఫ్‌ని మాత్రం అగమ్య గోచరం చేసేసాడు. సైజ్‌ జీరో స్లిమ్మింగ్‌ క్లినిక్‌లో అనుష్క అడుగు పెట్టింది లగాయతు… గాలిపోతున్న బుడగ మాదిరిగా తయారైంది సినిమా. అసలు కథే చప్పగా సాగిపోతూ ఉంటే కొసరుగా తగిలించిన ప్రేమకథలోకి అడివి శేష్‌ ప్రవేశించి కథనాన్ని మరింత పలచగా మార్చేసాడు. సెక్లింగ్‌ ద్వారా ఫండ్‌ రైజింగ్‌ అనే కాన్సెప్టే చిరాగ్గా ఉంటే దానిని ఒక అరగంట పాటు సాగదీసి, అక్కడో రెండు సాంగులేసి 'సైజ్‌ జీరో' నిజంగా జీరోని చేసేసారు. అసలు కథ కొలిక్కి వచ్చినా కానీ ప్రేమకథని ముగించడానికి మరో ఎంగేజ్‌మెంట్‌ ఎపిసోడ్‌ తీసుకుని పడ్డదంతా వృధా ప్రయాసేనని చెప్పాలి. 

లావుగా ఉన్నవాళ్ల మీద చీప్‌ జోకులేస్తూ నవ్వించే ప్రయత్నాలు లేకపోవడం మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోతగ్గ విషయం. అలాంటీ చీప్‌ హ్యూమర్‌ కాకుండా కొన్ని జెన్యూన్‌ ఫన్నీ మూమెంట్స్‌తో ఈ చిత్రం ప్రథమార్ధం సరదాగా సాగిపోతుంది. 'చీనీ కమ్‌', 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' తదితర బాలీవుడ్‌ చిత్రాల మాదిరి ఫక్తు మల్టీప్లెక్స్‌ సినిమాగా క్లాసీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సైజ్‌ జీరో ఫస్ట్‌ హాఫ్‌ని డీల్‌ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే ద్వితీయార్ధంలో కనీసం ఫస్ట్‌ హాఫ్‌లోని పదో వంతు వినోదమైనా లేదు కదా అనవసరమైన విషయాలపైకి ఫోకస్‌ మళ్లించి, అసలు క్యారెక్టర్‌ని పక్కన పడేసి కథని పూర్తిగా పక్కదోవ పట్టించారు. ఒక పాయింట్‌కి వచ్చేసరికి ఇంటర్వెల్‌ తర్వాత ఇంటికి పోకుండా మళ్లీ థియేటర్‌లోకి ఎందుకొచ్చామనే భావన కలుగుతుంది. ఆ ఫిట్‌నెస్‌ సైకిల్స్‌ అంటూ పివిపి స్పోర్ట్స్‌ సరంజామాతో దీనినో యాడ్‌ ఫిలింగా తయారు చేసారు. 

అనుష్క అద్భుతంగా చేసింది. తన కెరీర్‌లో స్వీటీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఊర్వశి ఆమె తల్లి పాత్రలో యాప్ట్‌గా ఉంది. ఆమె సహజ నటన అలరిస్తుంది. స్వీటీ తమ్ముడిగా భరత్‌ బాగానే నవ్వించాడు. ఆర్య క్యారెక్టర్‌ని సరిగా ఎస్టాబ్లిష్‌ చేయకపోవడంతో అతను హీరో అయినా కానీ సైడ్‌ యాక్టర్‌లా అనిపిస్తాడు. సోనాల్‌ చౌహాన్‌ తన క్యారెక్టర్‌ పర్పస్‌కి తగ్గట్టు సెట్‌ అయింది. గొల్లపూడి మారుతీరావు, ప్రకాష్‌రాజ్‌, అలీ తమ వంతు సహకారం అందించారు. అడివి శేష్‌ ఓకే. బ్రహ్మానందం ట్రాక్‌ వల్ల అస్సలు ఉపయోగం లేకపోయింది. కిరణ్‌ సంభాషణలు మొదట్లో బాగున్నాయి. కీరవాణి పాటల్లో మెల్లమెల్లగా తప్ప చెప్పుకోతగ్గది లేదు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ అన్నీ బాగానే కుదిరాయి. 

అనుష్క ఒళ్లు 'పెంచి' కష్టపడ్డ ఈ చిత్రం తనకి మాత్రమే గుర్తుండేది కాకుండా చూసిన వాళ్లకీ గుర్తుండిపోయే సినిమా అయితే బాగుండేది. స్లిమ్మింగ్‌ క్లినిక్స్‌ని నమ్ముకుంటే జరిగే నష్టాలని తెలియజేస్తూ, బరువు తగ్గడానికి ఆహార నియమాలు పాటించాలని, వ్యాయామాలు చేయాలని బోధించే డాక్యుమెంటరీ మాదిరిగా తయారైన ఈ చిత్రాన్ని బాక్సాఫీస్‌ వద్ద మోసే బరువు కూడా అనుష్కే భరించాలి. వినోదంతో అలరించాల్సిన సినిమా కాస్తా 'బోరుబావి'గా (ఆర్య బోరింగ్‌ అని చెప్పడానికి అనుష్క వాడే మాట) తయారైందంటే దానికి దర్శక, రచయితల్నే నిందించాలి. 

బోటమ్‌ లైన్‌: సెకండ్‌ హాఫ్‌ 'జీరో'!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri