దాసరి అడిగితే ఏ హీరో అయినా ఓకె అంటారా?

ఏ హీరో అయినా సరే, దాసరి నిర్మాతగా వుంటానంటే ఓకె అనేస్తారన్నది ఆయన అభిమానుల మాట. అయితే ఇదెంత వరకు సరైన వాదన అన్నది ఆలోచించాలి. దాసరి ఇవ్వాళ కొత్తగా నిర్మాత అవతారం ఎత్తలేదు.…

ఏ హీరో అయినా సరే, దాసరి నిర్మాతగా వుంటానంటే ఓకె అనేస్తారన్నది ఆయన అభిమానుల మాట. అయితే ఇదెంత వరకు సరైన వాదన అన్నది ఆలోచించాలి. దాసరి ఇవ్వాళ కొత్తగా నిర్మాత అవతారం ఎత్తలేదు. అందునా గడిచిన మూడు నాలుగేళ్లలో ఆయన పంపిణీ దారుగా చాలా కీలకంగా వున్నారు. పెద్ద పెద్ద సినిమాలన్నీ కొన్నారు. విజయవంతంగా పంపిణీ చేసారు. 

అంతే కానీ పెద్ద హీరోలతో సినిమా చేయాలని మాత్రం ఎప్పుడూ అనుకున్నట్లు లేదు. బాలకృష్ణ హీరోగా ఆయన రూపొందించిన పరమ వీర చక్ర సినిమాను కూడా ఆయన నిర్మించలేదు. సి కళ్యాణ్ నిర్మాత. సినిమా రంగంలో పెద్దరికం వేరు. వ్యాపారం వేరు. పెద్ద పెద్ద సినిమాలు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన, దాసరి పెద్ద హీరోలతో సినిమాలు నిర్మించాలని ఎందుకు అనుకుని వుండరు? అది కూడా వ్యాపారమే కదా..ఏ పెద్ద హీరో అయినా తను అడిగిన వెంటనే డేట్లు ఇస్తాడనుకుంటే దాసరి ఇప్పటికి కనీసం ఒక్కసినిమా అయినా తీసి వుండాలి కదా? 

పెద్దరికం, మర్యాద, గౌరవం వేరు, సినిమాలు, వ్యాపారం వేరు. సినిమా రంగంలో ఆ హద్దులు, గీతలు ఎప్పుడూ వుంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వడానికి సై అన్నారంటే దాని వెనుక మరేదో బలమైన కారణం వుండి వుండాలి. అందునా తన అన్న చిరంజీవిని పరోక్షంగా విమర్శిస్తూ సినిమా తీసిన దర్శకుడికి పవన్ డేట్లు ఇవ్వడం అంటే ఆలోచించాల్సిందే. అంతే కాదు మొన్నటికి మొన్న రామ్ చరణ్ ను పరోక్షంగా ఎక్స్ ప్రెషన్ లెస్ ఫేస్ అన్నది ఈ దాసరి గారే కదా..గోవిందుడు అందరి వాడే సందర్భంలో.. డబ్బులున్న ప్రతిఒక్కరికీ హీరోలు డేట్లు ఇచ్చేయరు. సవాలక్ష ఈక్వేషన్లు ఇక్కడ కీలక పాత్ర వహిస్తాయి. 

ఇక్కడ పవన్ డేట్లు దాసరికి దొరికాయా..లేదా దాసరి లాంటి నిర్మాత పవన్ దొరికాడా అన్నదానికి అభిమానులే సరైన సమాధానం చెప్పగలరు..అభిమానులంటే ఇక్కడ పవన్ అభిమానులు..దాసరి అభిమానులు కాదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ వున్నది పవన్ కే కానీ, దాసరి గారికి కాదు కదా..ఇలా అంటే కాస్త కష్టంగానే వుంటుంది. కానీ నిజం నిష్టూరంగానే వుంటుంది.. ఎర్రబస్సు ఈ సంగతి కాస్త స్పష్టంగానే చెప్పింది.