ఎమ్బీయస్‌ : విబి రాజేంద్రప్రసాద్‌ – 3

నిజానికి బెంగాలీ ఒరిజినల్‌కు వీళ్లు చాలా మెరుగులు దిద్దారు. గిరిజ పాత్రను చాలా బాగా తీర్చిదిద్దారు. బెంగాలీ ఒరిజినల్‌లో ఆ పాత్ర హాస్యనటి కాదు, హీరోయిన్‌తో సమానమైన అందం, ప్రతిభ వుంది. హీరో ఎవర్ని…

నిజానికి బెంగాలీ ఒరిజినల్‌కు వీళ్లు చాలా మెరుగులు దిద్దారు. గిరిజ పాత్రను చాలా బాగా తీర్చిదిద్దారు. బెంగాలీ ఒరిజినల్‌లో ఆ పాత్ర హాస్యనటి కాదు, హీరోయిన్‌తో సమానమైన అందం, ప్రతిభ వుంది. హీరో ఎవర్ని చేసుకున్నా ఫర్వాలేదని ప్రేక్షకుడు అనుకునేట్లా వుంది. తెలుగు సినిమాలో గిరిజ పాత్రను మొదట్లో పల్లెటూరి బైతుగా చూపించి, షరతు ప్రకారం యీ అమ్మాయిని చేసుకోవాల్సి వస్తోందే అని హీరోపై జాలి పడేట్లా తీర్చిదిద్దారు. తర్వాత గిరిజ పాత్రలో మార్పు చూపించి చాలా షేడ్స్‌ తీసుకుని వచ్చారు. గిరిజ ప్రియుడి కారెక్టరుని రేలంగికి యిచ్చి చాలా హాస్యం పుట్టించారు. ఒరిజినల్‌లో ఆ హాస్యం ఏమీ లేదు. ఆమెను అందగాడైన ఓ డాక్టరు మోహించి, కోర్కె తీర్చుకుందామని చూస్తాడు. జగ్గయ్య పాత్ర వెళ్లి కాపాడుతుంది. తెలుగులో గిరిజ పాత్ర వలన హాస్యంతో సహా వేరే డైమన్షన్లు వచ్చి చేరాయి. ''ఇదీ అసలు కథ''లో యివన్నీ నేను చెప్పినపుడు రాజేంద్రప్రసాద్‌గారు ఆనందించారు. ఆపాటికి ఆయనకు బెంగాలీ ఒరిజినల్‌, చేసిన మార్పులు గుర్తు లేవు.

పెద్దలు శంకలు పెట్టినా రాజేంద్రప్రసాద్‌ ధైర్యం చేసి ''ఆరాధన'' సినిమా పూర్తిచేసి విడుదల చేస్తే హిట్‌ అయింది. నీతి ఏమిటీ అంటే – ఏ సినిమా ఆడుతుందో, ఏది ఆడదో కొమ్ములు తిరిగిన నిర్మాతకూడా చెప్పలేడు! 

ఇంకో విషయం – 'ఓహోహో మావయ్యా' పాట మైసూరు జూలో తీశారు కదా, పాటలో చరణాలు కొన్ని జంతువుల మీద పర్టిక్యులర్‌గా వుంటాయి. అందుకని మైసూరు జూకి ఆరుద్రగారిని  ముందే పంపించి అక్కడ ఆ జంతువులు వున్నాయో లేదో లిస్టు రాసుకుని రమ్మన్నారు రాజేంద్రప్రసాద్‌. ఎందుకంటే తీరా రాసేసిందాకా వుండి అక్కడ అవి లేకపోతే ఏ ఆఫ్రికా అడవుల లైబ్రరీ షాట్లో కలపాల్సి వుంటుందని!

రాజేంద్రప్రసాద్‌కి నాగేశ్వరరావు ఇంత క్లోజ్‌ అయినప్పుడు నిర్మాతగా ఆయన సినిమారంగప్రవేశం కూడా నాగేశ్వరరావుతో జరగాలి కదా అని అనిపిస్తుంది కదూ! నిజానికి తన తొలిసినిమా ''అన్నపూర్ణ''లో నటించమని ఆయన్ని యీయన అడిగారు. కానీ అప్పటికి నాగేశ్వరరావు 2,3 సినిమాల్లో ఆల్‌రెడీ బుక్‌ అయివున్నారు. 'కావాలంటే నీ రెండో సినిమాలో వేస్తాను కానీ, ఇప్పటికి వదిలేయ్‌. జగ్గయ్యగారిని అడిగిచూడు' అన్నారు నాగేశ్వరరావు. 

జగ్గయ్యకి, రాజేంద్రప్రసాద్‌కి బంధుత్వం కూడా వుంది. వెళ్లి అడిగారు. ఆయన సరేనన్నారు. అలా జగపతి ఆర్ట్స్‌ వారి తొలి సినిమా 'అన్నపూర్ణ'లో జగ్గయ్య హీరో. అంతేకాదు, తర్వాతి జగపతి సినిమాల్లో చాలా వాటిల్లో నాగేశ్వరరావు హీరో అయితే జగ్గయ్యది పేరలెల్‌ హీరో లేదా విలన్‌ పాత్ర! 'ఆత్మబలం' లాటి సినిమాలో నాగేశ్వరరావుపాత్ర కంటె జగ్గయ్యపాత్రే ఎక్కువ గుర్తుండిపోతుంది. 

'అంతస్తులు'లో కూడా జగ్గయ్య విలన్‌ పాత్రలో అమోఘంగా రాణించారు. 'అంతస్తులు' అనగానే భానుమతి గుర్తుకు వస్తారు.  అసలా పాత్ర జమున వేయవలసివుంది. ముందులో ఒప్పుకున్నా 'నాగేశ్వరరావు అక్క పాత్రలో వేస్తే జనం మిమ్మల్ని చూడరని' కొందరు అనడంతో ఆవిడ వెనక్కి తగ్గారు. 

అప్పుడు భానుమతి దగ్గరకి వెళితే ఆవిడకు కథ నచ్చి, ఇంకో రెండు సినిమాలు వదులుకుని ఈ పాత్ర వేశారు. హైదరాబాదు వచ్చి షూటింగులో పాల్గొన్నారు. హోటల్లో రూమ్‌ బుక్‌ చేస్తే 'ఎందుకండీ సారథీ స్టూడియోలో రూములో వుంటాను లెండి' అన్నారు. 'దులపర బుల్లోడా' పాట షూటింగు ఏర్పాటు చేసుకుంటే ఆ ముందురోజు రాత్రి ఎలుకలు భానుమతి వేళ్లు కొరికాయట. దాంతో వీళ్లు భయపడిపోయారు. షూటింగు కాన్సిల్‌ చేద్దామా అనుకుంటే భానుమతి 'ఇవన్నీ చిన్న విషయాలు. షూటింగు పెట్టుకోండి. దుమ్ము దులిపేద్దాం' అని డెట్టాల్‌ రాసుకుని పాటకు డాన్సు చేసేశారు. ఆ పాట ఇప్పటికీ దుమ్ము దులుపుతూనే వుంది. 

రాజేంద్రప్రసాద్‌ ఇంకో సినిమాలో కూడా హీరోయిన్‌కు యాక్సిడెంటయ్యింది. ''ఆత్మబలం'' సినిమా తీసేటప్పుడు దానిలో హీరోయిన్‌ బి.సరోజాదేవి. బెంగుళూరులో వుండేవారు. షూటింగు కోసం హైదరాబాదు వచ్చేవారు. రెండు షెడ్యూల్స్‌ అయ్యాక ఆవిడకు వేరే సినిమాలో ఓ యాక్సిడెంటు అయింది. అప్పుడు ఆవిడ ఎల్వీ ప్రసాద్‌ తీస్తున్న హిందీ సినిమాలో నటిస్తూండేవారు. హిందీ సినిమా షూటింగులో సరోజాదేవితో ఓ దృశ్యం తీస్తున్నారు. ఈమె పాలకుండ నెత్తిమీద పెట్టుకుని వెళుతూంటే ఆకతాయి కుర్రాళ్లు నెత్తిమీద కుండని రాళ్లేసి కొడతారు. ఆ సీను షూట్‌ చేసేటప్పుడు పొరబాటున వాళ్లు వేసిన రాయి గురితప్పి కుండకు బదులు ఈవిడ ముఖానికి తగిలింది. రక్తం చిమ్మింది. ఆ గాయం మానాలంటే 15 రోజులు పడుతుందన్నారు.

ఇవతల రాజేంద్రప్రసాద్‌ షెడ్యూల్‌ పెట్టుకున్నారు. ఆవిడ మళ్లీ ఎప్పుడు డేట్స్‌ యిస్తే అప్పుడు షూటింగు పెట్టుకుందామని చెప్పడానికి బెంగుళూరు వెళితే వాళ్లు యింట్లోకి రానివ్వలేదు. సరోజాదేవి తల్లి ఈయన్ని చూసి కూడా లోపలకి రమ్మనలేదు. గూర్కా గేటు తీయడు. నిర్మాతల కష్టాలు యిలా వుంటాయన్నమాట! ఎవరి షూటింగులోనో దెబ్బ తగిలింది. ఈయన సినిమా కాదు, ఈయన పొరబాటు కాదు. మరి ఈయనమీద కోపం ఎందుకో తెలియదు. సినిమా నిర్మాత అంటే డబ్బిచ్చి దణ్ణాలు పెట్టాలి అంటారు ఇదే కాబోసు!

అప్పుడు ఈయన ఎల్‌.వి.ప్రసాద్‌ అబ్బాయి ఆనంద్‌ దగ్గరకి వెళ్లి మొరపెట్టుకుంటే ఆయన తీసుకెళ్లి రాజీ కుదిర్చాడు. నెల్లాళ్ల తర్వాత 15 రోజులు డేట్స్‌ యిస్తామనీ, ఆ టైములోనే షూటింగు పూర్తి చేసుకోవాలని సరోజాదేవి తల్లి ఆంక్షలు విధించింది. పైగా షూటింగు మద్రాసులోనే జరగాలట, హైదరాబాదు రారుట. ఇక్కడ చిక్కు వచ్చిపడింది. 

నాగేశ్వరరావుగారి కండిషన్‌ ప్రకారం షూటింగు హైదరాబాదులోనే జరగాలి. తెలుగు చిత్రపరిశ్రమంతా ఆంధ్రాకు తరలి రావాలనే ఉద్దేశంతో తన నిర్మాతలకు ఆయన  పెట్టిన కండిషను అది. మద్రాసులో షూటింగు అంటే ఆయన ఒప్పుకోడు. ఇవతల ఈవిడ చూస్తే మద్రాసులోనే షూటింగని పట్టుబడుతోంది. ఏం చేయాలి?

రాజేంద్రప్రసాద్‌ నాగేశ్వరరావుగారి వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పుకొచ్చారు. నాగేశ్వరరావుగారు అంతా విని 'నాకు కావలసినది నిర్మాత క్షేమం. నా నిబంధన సడలించుకుంటున్నాను. మద్రాసులోనే షూట్‌ చేద్దాం.' అన్నారు. అంతేకాదు, పగలు హీరోయిన్‌చేత వర్క్‌ చేయించి, రాత్రి ఆయన వర్క్‌ చేసేవారు. 15 రోజుల్లోగా సరోజాదేవి వర్క్‌ పూర్తి కావాలని ఆయన అలా సహకరించారు. 

ఏమాట కామాట చెప్పుకోవాలి, వాళ్లమ్మ మాట ఎలా వున్నా సరోజాదేవి కూడా చాలా సహకరించింది. 'చిటపట చినుకులు' పాట చిత్రీకరించేటప్పుడు తలకు గుడ్డ కట్టుకుని మరీ నటించింది. హిందీసినిమాలో తగిలిన గాయం కనబడకుండా, వర్షంలో తడిసి మరింత జ్వరం తెచ్చుకోకుండా అది ఉపయోగపడింది.  (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2015)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2