ఏపీలో కొత్త పార్టీ రాబోతోంది. దానిని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్థాపించనున్నారు. విశాఖలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ సంచలన ప్రకటన చేశారు. ఏపీ రాజకీయాల్లో కొత్త ఒరవడి రావాలని జేడీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
నవతరం యువతరం ఎక్కువగా రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించాలని అన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న తపన నిజాయతీ ఉన్న వారికే తమ పార్టీలో అవకాశం కల్పిస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు. యువతతోనే రాజకీయాల ధోరణి పూర్తిగా మారుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పోటీ చేస్తున్న బర్రెలక్క విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బర్రెలక్క లాంటి వారు యువతకు స్పూర్తి అని ఆమె గెలవాలని కోరుతూ తాను ప్రచారం చేసినట్లుగా జేడీ అంటున్నారు.
జేడీ ప్రారంభించబోయే కొత్త పార్టీ రూపురేఖలు ఎలా ఉంటాయో తెలియాల్సి ఉంది. 2018 ప్రాంతంలో సీబీఐలో కీలక పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసి బయటకు వచ్చిన జేడీ అప్పట్లోనే కొత్త పార్టీ ఆలోచన చేశారు. జనధ్వని పేరుతో పార్టీ పెడతారు అని ఊహాగానాలు వినిపించాయి.
చివరికి ఆయన జనసేన ద్వారా విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి దాదాపుగా మూడు లక్షలకు చేరువలో ఓట్లు సంపాదించారు. తాను విశాఖ నుంచే మరోసారి ఎంపీగా పోటీ చేస్తానని జేడీ క్లారిటీ ఇచ్చారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోవడం లేదని కొత్త పార్టీ అని ఆయన చెబుతున్నారు.
ఏపీ రాజకీయాల్లో పుట్టుకుని వస్తున్న జేడీ పార్టీ వల్ల సమీకరణలు ఎలా మారుతాయో. పొత్తులతో వస్తారో లేక ఒంటరిగా అన్ని సీట్లకు పోటీకి దిగుతారో అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. సమయం తక్కువగా ఉన్నందువల్ల జేడీ కొత్త పార్టీ తరఫున తాను మాత్రమే పోటీ చేస్తారా అని కూడా చర్చ జరుగుతోంది.