జనసేనాని పవన్‌కల్యాణ్ టికెట్లపై ఆశలు వదులుకోవాలని తన పార్టీ నాయకులకు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీతో పొత్తు, తొక్కాతోలు అని పవన్‌కల్యాణ్ చెబుతున్న భారీ డైలాగ్‌ల వెనుకు అసలు ఉద్దేశం అది కాదనే టాక్ వినిపిస్తోంది. రాజకీయంగా భవిష్యత్ లేని పవన్‌కల్యాణ్ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారనే నమ్మకం ఎవరికీ లేదు.
కేవలం టీడీపీ భవిష్యత్ కోసం ఆయన తిప్పలు పడుతున్నారనేది బహిరంగ రహస్యమే. తాజాగా ఆయన కామెంట్స్‌ను ఎల్లో మీడియా హైలెట్ చేయడాన్ని చూస్తే, రాజకీయ ప్రయోజనం ఎవరికో అర్థం చేసుకోవచ్చు. విశాఖలో పవన్‌కల్యాణ్‌ను కొందరు టీడీపీ నేతలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో ఆయన కీలక కామెంట్స్ చేశారట! ఆ వ్యాఖ్యలేవో తెలుసుకుందాం.
“లక్షల మంది యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రెండు పార్టీలు కలిసి నడవాల్సిన అవసరం ఉంది. ప్రజలూ అదే కోరుకుంటున్నారు. ఈ సమయంలో పదవులు ముఖ్యం కానే కాదు. ప్రజల భవిష్యత్తే ముఖ్యం. వారి జీవితాలు నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది”
పవన్‌కల్యాణ్‌ను టీడీపీ, ఎల్లో మీడియా ఎంత బాగా ఇరికించిందో అర్థం చేసుకోడానికి ఈ కామెంట్స్ చాలు. పదవులు ముఖ్యం కాదు అంటే… అది జనసేనకు మాత్రమే అనేది టీడీపీ భావన. టీడీపీకి మాత్రం పదవులు, అధికారం కావాలి. పవన్ మాదిరిగానే చంద్రబాబు తనకు పదవులు, అధికారం ముఖ్యం కావని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తే ప్రధానమని అన్నట్టు రాయగలరా? రాయలేరు. ఎందుకంటే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు పదవులే ముఖ్యం.
పవన్‌తో టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ ఇది. కేవలం టీడీపీ పల్లకీ మోసే నాయకుడిగా పవన్‌ను చివరికి చంద్రబాబు తయారు చేస్తారు. తెలంగాణలో బీజేపీ ఇచ్చినన్ని సీట్లతో సరిపెట్టుకున్నట్టుగా, రేపు రానున్న ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన సీట్లే మహాభాగ్యమనుకుని కళ్లకద్దుకునేలా పవన్‌ను మానసికంగా సన్నద్ధం చేస్తారు. అందులో భాగంగానే రాష్ట్ర భవిష్యత్, పదవులు ముఖ్యం కాదు లాంటి డైలాగ్‌లు పవన్ చెప్పినట్టు టీడీపీ నేతలు చెప్పడం, ఎల్లో పత్రికలు ప్రచురించడాన్ని అర్థం చేసుకోవాలి. సీట్లపై ఆశలు వదుకోవాలని జనసేన నేతలకు ఈ కామెంట్స్ పరోక్ష హెచ్చరిక కూడా.