లోకేష్.. ఇది న్యాయవ్యవస్థపై బురదచల్లుడు కాదా?

జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెడుతున్నాననే భ్రమలో రెచ్చిపోయి మాట్లాడుతున్న తెలుగుదేశం చినబాబు నారా లోకేష్ ఏకంగా న్యాయవ్యవస్థల మీదనే బురద చల్లుతున్నారు. న్యాయవ్యవస్థలు లంచాలకు లోబడి పనిచేస్తున్నాయని, నిర్ణయాలు తీసుకుంటున్నాయనే అర్థం వచ్చేలాగా లోకేష్…

జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెడుతున్నాననే భ్రమలో రెచ్చిపోయి మాట్లాడుతున్న తెలుగుదేశం చినబాబు నారా లోకేష్ ఏకంగా న్యాయవ్యవస్థల మీదనే బురద చల్లుతున్నారు. న్యాయవ్యవస్థలు లంచాలకు లోబడి పనిచేస్తున్నాయని, నిర్ణయాలు తీసుకుంటున్నాయనే అర్థం వచ్చేలాగా లోకేష్ ట్వీట్ చేశారు. న్యాయవ్యవస్థలోని కీలక వ్యక్తులు, న్యాయమూర్తులు ఈ ట్వీట్ ను గమనిస్తే గనుక, లోకేష్ అజ్ఞానాన్ని మన్నించి వదిలేయకుండా సీరియస్ గా తీసుకుంటే గనుక.. ఆయనకు చుక్కలు కనిపిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎంపీ రఘురామక్రిష్ణ రాజు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. వైసీపీ తరఫున జగన్ దయతో టికెట్ దక్కించుకుని ఎంపీగా గెలిచిన రఘురామక్రిష్ణ రాజు.. తెలుగుదేశంతో లాలూచీ పడినట్టుగా నిత్యం ఆ పార్టీ వారిని కీర్తిస్తూ, ప్రభుత్వాన్ని నిందిస్తూ మాట్లాడుతూ ఉండడం, అర్థం పర్థంలేని కేసులు నడుపుతూ ఉండడం కొత్త సంగతి కానే కాదు. 

ఆ క్రమంలో భాగంగానే ఆయన తాజాగా.. జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలనే కేసు కూడా వేశారు. హైకోర్టులో పిటిషన్ పడిన తర్వాత.. కోర్టు చాలా సహజంగా ప్రతి వాదులు అందరికీ సమన్లు పంపేసింది. జగన్ కు కూడా నోటీసులు వెళ్లాయి.

కేవలం నోటీసులు మాత్రమే సర్వ్ అయ్యాయి.. అక్కడికే చినబాబు నారా లోకేష్ మురిసిపోతున్నట్టుగా కనిపిస్తోంది. బయట మాట్లాడడానికి భయపడే నారా లోకేష్ రఘురామ పిటిషన్ ను సమర్థిస్తూ, ఉటంకిస్తూ..  ‘కోర్టు నోటీసులతో జగన్ పని అయిపోయింది. అవినీతి చక్రవర్తి జగన్ ఇక 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకోవాలి’ అని ట్వీట్ చేశారు. 

అంటే జగన్ మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. కేవలం నోటీసులతో పని అయిపోయినట్టు కాదు. అయినా ఏదో అజ్ఞానం కొద్దీ పసిబిడ్డ అనేశాడులే అని సరిపెట్టుకోవచ్చు. కానీ.. జగన్మోహన్ రెడ్డి పదేళ్లుగా కేసుల్ని మేనేజ్ చేస్తూ వచ్చారని కూడా తన ట్వీట్ లో కామెంట్ చేశారు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? న్యాయమూర్తులకు లంచాలు ఇచ్చి, న్యాయవ్యవస్థలను ప్రలోభపరచారనేనా? అనే సందేహాలు జప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి. ఎక్స్ లో లోకేష్ వ్యాఖ్యలు.. జగన్ ను నిందించినట్టు కాదు కదా.. న్యాయవ్యవస్థను నిందించినట్లుగా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.

న్యాయమూర్తులకు, న్యాయవ్యవస్థకు లంచాలను, దురుద్దేశాలను ఆపాదిస్తూ బహిరంగంగా మాట్లాడడం, నిందలు వేయడం పెద్ద నేరం అవుతుంది. ఈ ట్వీట్ ను న్యాయవ్యవస్థ సీరియస్ గా తీసుకుంటే గనుక.. జగన్ పట్టించుకోవాల్సిన అవసరం లేకుండానే.. నారా లోకేష్ ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వస్తుందని పలువురు అనుకుంటున్నారు.