జ‌నంలోకి వెళ్లేందుకు జ‌గ‌న్ త‌హ‌త‌హ‌

వైసీపీకి అసెంబ్లీలో క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌లేదు. కేవ‌లం 11 మంది మాత్ర‌మే ఆ పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో అసెంబ్లీకి వెళ్ల‌డానికి మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏ మాత్రం…

వైసీపీకి అసెంబ్లీలో క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌లేదు. కేవ‌లం 11 మంది మాత్ర‌మే ఆ పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో అసెంబ్లీకి వెళ్ల‌డానికి మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏ మాత్రం సిద్ధంగా లేరు. అందుకే త‌న‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాలంటూ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడికి ఆయ‌న లేఖ రాసారు. అటు వైపు నుంచి సానుకూల సంకేతాలు రాక‌పోవ‌డంతో జ‌గ‌న్ రిలాక్ష్ అయ్యారు.

చంద్ర‌బాబు స‌ర్కార్ చేసే త‌ప్పుల కోసం జ‌గ‌న్ ఎదురు చూస్తున్నారు. అందుకే జ‌గ‌న్ ప‌దేప‌దే శిశుపాలుడి త‌ప్పుల్ని గుర్తు చేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్ సంక్షేమ ప‌థ‌కాలు, అలాగే వాటికి అద‌నంగా మ‌రికొన్నింటిని చేర్చి కూట‌మి ప్ర‌క‌టించిన ఉమ్మడి మేనిఫెస్టో అమ‌లుపై వైఎస్ జ‌గ‌న్ దృష్టి సారించారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా ఈ ప‌థ‌కాల అమ‌లు సాధ్యం కాద‌ని జ‌గ‌న్ న‌మ్మ‌కం.

కూట‌మి పెద్ద‌లు సంక్షేమ ప‌థ‌కాల‌పై నోరెత్త‌క‌పోవ‌డంతో జ‌గ‌న్ న‌మ్మ‌కం త్వ‌ర‌లో నిజ‌మ‌వుతుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. కూట‌మి హామీలు అమ‌లు చేసేందుకు ఆరు నెల‌లు లేదా ఏడాది స‌మ‌యం ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఇదే అభిప్రాయంతో వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీలు, మాజీ ప్ర‌జాప్ర‌తినిధులున్నారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌లేద‌నే అభిప్రాయం జ‌నంలో క‌లిగిన త‌ర్వాతే, వాళ్ల చెంత‌కు వెళితే ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

అందుకే ఆ స‌మ‌యం ఎప్పుడెప్పుడు వ‌స్తుందా? జ‌నంలోకి ఎప్పుడు వెళ్దామా? అని జ‌గ‌న్ త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్టు వైసీపీ సీనియ‌ర్ నేత‌లు చెబుతున్నారు. ఎటూ అసెంబ్లీకి వెళ్లే ప‌రిస్థితి లేదు. దీంతో నిత్యం ప్ర‌జ‌ల్లో వుండ‌డానికే జ‌గ‌న్ మొగ్గు చూపుతున్నారు. ఇటీవ‌ల పులివెందుల‌లో జ‌గ‌న్ మూడు రోజుల ప‌ర్య‌ట‌న సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. జ‌గ‌న్‌ను ఓదార్చ‌డానికి, ఆయ‌న‌తో ఆవేద‌న పంచుకోడానికి జ‌నం వెల్లువెత్తారు. జ‌నం తండోప‌తండాలుగా ఓడిపోయాక ఇంత త‌క్కువ స‌మ‌యంలో వ‌స్తార‌ని జ‌గ‌న్ కూడా ఊహించ‌లేదు. పులివెందుల ప‌ర్య‌ట‌న జ‌నంలోకి వెళ్లాల‌నే జ‌గ‌న్‌ నిర్ణ‌యాన్ని దృఢ ప‌రిచింది. ఆ స‌మ‌యం కోసం జ‌గ‌న్ ఎదురు చూస్తున్నారు.