గడిచిన 24 గంటలుగా ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే ఇకపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందనే ప్రచారం జోరుగా సాగింది.
అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమే. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని ట్రాయ్ తాజాగా ప్రకటించింది. ఇది పూర్తిగా అసత్య ప్రచారమని, ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలామంది 2 లేదా అంతకంటే ఎక్కువ సిమ్ కార్డులు వాడుతున్నారు. వ్యక్తిగతంగా ఒకటి, ఆఫీస్ లేదా వ్యాపార అవసరాల కోసం ఇంకోటి వాడుతున్నారు. ఇలాంటి వాళ్లంతా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని భయపడ్డారు. కానీ ఈ ప్రచారంలో నిజం లేదని ట్రాయ్ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం నడుస్తున్న విధానం ప్రకారం, రీచార్జి మాత్రం చేసుకుంటే సరిపోతుందని, అదనపు సిమ్ కార్డుకు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని టెలికం రెగ్యులేటరీ సంస్థ – ట్రాయ్ స్పష్టం చేసింది. నిజానికి ఈ విధానం ఇప్పటికే పలు దేశాల్లో అమల్లో ఉంది. అందుకే దీన్ని ఇండియాలో కూడా అమలు చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని ట్రాయ్ స్పష్టం చేసింది.
ఒకప్పుడు సిమ్ కార్డు కోసం వినియోగదారుడు డబ్బు చెల్లించాల్సి వచ్చేది. ఆ తర్వాత టెలికం కంపెనీల మధ్య పోటీ కారణంగా ఉచితంగా సిమ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉచితంగానే డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. కాబట్టి అదనపు సిమ్ పై అదనపు రుసుం లాంటి విధానం ఇప్పట్లో సరైనది కాదని ట్రాయ్ అభిప్రాయపడింది.