ఇండియా కూటమి ఐక్యత, సమష్టిగా అడుగులు వేయడంలో ఆమెకు ఏమాత్రం నమ్మకం ఉన్నదో గౌరవం ఉన్నదో ప్రజలకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే.. ఆమె ఇం.డి.యా కూటమికి అనుకూలంగా గళం విప్పుతారు.. అంతలోనే కూటమి ప్రయోజనాలను దెబ్బకొట్టేలా తమ పార్టీ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.
ఎన్నికల పర్వం పూర్తయిపోయి ఇండియా కూటమి దారుణంగా చతికిలపడిన తర్వాత.. ఇప్పుడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావులాగా.. శకునాలు పలుకుతున్నారు దీదీ!
కేంద్రంలో 293 మంది ఎంపీల బలంతో ప్రభుత్వం ఏర్పడబోతున్నది. మోడీ ఇంకా హ్యాట్రిక్ ప్రధానిగా ప్రమాణం చేయనేలేదు. అప్పుడే ఈ ప్రభుత్వం కూలిపోతుందంటూ.. మమతా బెనర్జీ శకునాలు పలుకుతున్నారు. ఎలా కూలిపోతుందని ఆమె భావిస్తున్నారో కూడా ఆమె లీకులు ఇస్తున్నారు.
ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ఇప్పుడు ముందుకు రాలేదేమో.. దాని అర్థం భవిష్యత్తులో ఆ ప్రయత్నం చేయదు- అని కాదు! అని మమతా దీదీ చెబుతున్నారు. అంటే ఎన్డీయే కూటమిని చీల్చడానికి ఇండియా కూటమి ప్రయత్నించే అవకాశం ఉన్నదని ఆమె తేల్చి చెబుతున్నారన్నమాట.
తెలంగాణలో కూడా ఇదే ప్రహసనం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తరువాత.. తొలిరోజు నుంచి ఈ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది అంటూ.. కేసీఆర్, ఆయన గులాబీ నాయకులు శకునాలు పలకడం ప్రారంభించారు.
పార్లమెంటు ఎన్నికల తర్వాత రాజకీయాలు మొత్తం మారుతాయంటూ శకునాలు పలికారు. నిజంగానే రాజకీయాలు మారాయి. భారత రాష్ట్ర సమితి తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లోఉన్నారని అనడం తప్ప.. ప్రభుత్వం కూలుతుందనే మాటలు గులాబీలనుంచి చాలా వచ్చాయి. చివరికి భంగపాటు తప్పలేదు.
అలాగే.. కేంద్రంలో మోడీ సర్కారు స్పష్టమైన మెజారిటీతో గద్దె ఎక్కుతుండగా.. ఒకవేళ ప్రధాని పదవి ఎరవేసి నితీశ్ ను అక్కడినుంచి లాక్కొచ్చినా సరే.. ఆ కూటమికి మెజారిటీ ఉంటుండగా.. దీదీ ఏ నమ్మకంతో కూలుతుందని అంటున్నారో ఆమెకే తెలియాలి.
మొత్తానికి కేసీఆర్ లాగా దీదీకి కూడా ఇలాంటి జోస్యం చెప్పినందుకు భంగపాటు తప్పదా అని పలువురు అనుకుంటున్నారు.