ఆదాయం ఉన్నచోట అవినీతి తప్పనిసరి. పవిత్ర ఆలయాల వద్దైనా సరే, ఆదాయం వుంటే చాలు అవినీతి గద్దలు వాలిపోతాయి. తిరుమలలో దళారి వ్యవస్థ ఉండడానికి ప్రధాన కారణం… అక్కడ పెద్దమొత్తంలో ఆదాయం వుండడమే. ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చే క్రమంలో కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం విశేషం.
సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు ఆదాయ వనరులు, అవినీతి తిమింగలాలు ఎక్కడెక్కడ వుంటాయో తెలియదా? ఆయనకు అన్నీ తెలుసు. కాకపోతే తానేమో మంచి ఉద్దేశంతో ఉచిత ఇసుక పథకాన్ని తీసుకొచ్చానని, కిందిస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారనే సంకేతాల్ని పంపడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉచిత ఇసుకపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఆయన గ్రహించారు. దీన్ని అడ్డుకట్ట వేయడం కూడా సాధ్యం కాదని ఆయన గ్రహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.
“అక్రమాలు, అవినీతికి అవకాశం లేకుండా, సామాన్యులకు ఇసుక అందుబాటులో వుంచేందుకే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చాం. ఇసుక విషయంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దు. అలాగే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దు. ఇసుక అవసరాలకే తప్ప అమ్మకానికి కాదు. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల్లో ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది”
ఈ వాక్యాలు చదివిని వారికి ఏమనిపిస్తుంది? బాబు మంచి పరిపాలకుడని, ఆయనకు తెలియకుండా ముఖ్యంగా టీడీపీ, అక్కడక్కడ జనసేన నాయకులు ఇసుకను ఇష్టానుసారం బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారనే భావన కలుగుతుంది. చంద్రబాబు అనుకూల మీడియా ముఖ్యమంత్రి కామెంట్స్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం వెనుక మతలబు ఇదే.
రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకపై టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్టు దోచుకుంటున్నారు. దీన్ని అడ్డుకోవడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ప్రకృతి వనరుల్ని దోచుకుంటే తప్ప ఇతరత్రా ఆదాయ మార్గాలు లేవు. పాలకులు ఎంత మొత్తుకున్నా అధికారి నాయకులు ఈ పని చేస్తూనే వుంటారు. అయితే ముఖ్యమంత్రిగా తాను వార్నింగ్ ఇస్తున్నట్టు కనిపించాలి, మరోవైపు నాయకులకు సంపాదించుకునే మార్గాలను చూపాలనే రీతిలో పాలన వుంటుంది. అందరికీ అన్నీ తెలుసు. ఏమీ తెలియనట్టు నటించడమే రాజకీయం అంటే.