ఆ షాపు పక్కనుంచి వెళ్తే ఘుమఘుమలు రోడ్డు మీదకు వస్తాయి. ఎవరైనా అటు ఎట్రాక్ట్ అవ్వాల్సిందే. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో టాప్-5 స్వీట్ షాపుల లిస్ట్ తీస్తే అందులో ఇది కూడా ఒకటి. అదే ఎమరాల్డ్ స్వీట్స్. ఇందిరా పార్క్ కు పక్కనే ఆనుకొని ఉన్న ఈ షాపులో స్వీట్స్ తో పాటు, ఆర్గానిక్ ఉత్పత్తులతో చేసిన ఆహార పదార్థాలు కూడా అమ్ముతారు.
అంతా లొట్టలేసుకొని తింటారు. అయితే అలా తినేవాళ్లెవ్వరూ కిచెన్ లోకి వెళ్లి ఉండరు. వెళ్తే అలా తినరు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎమరాల్డ్ కిచెన్ లోకి వెళ్లారు. అక్కడ దారుణమైన పరిస్థితులు చూసి అవాక్కయ్యారు.
కిచెన్ లోని దుర్గంధ భరిత వాతావరణంలో రుచికరమైన స్వీట్స్ తయారు చేస్తున్నారు. రోజుల తరబడి ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీరుతో వాటిని తయారు చేస్తున్నారు. దేనిపై లేబుల్స్ లేవు, ఎక్స్ పైరీ డేట్ దేవుడికే తెలియాలి.
కిచెన్ లో ఎక్కడ చూసినా బొద్దింకలు కనిపించాయి. రసాయనాలు మిక్స్ చేసిన 60 కేజీల బెల్లం గుర్తించారు. మిఠాయిల్లో వాడే ఏ సరుకుపై లేబుల్స్ లేవు.
దీనికితోడు కిచెన్ లో అంతా లుంగీలు, నిక్కర్లు వేసుకొని పని చేస్తున్నారు. ఎవ్వరికీ డ్రెస్ కోడ్ లేదు, మెడికల్ సర్టిఫికేట్లు లేవు. జంట నగరాల్లో చాలా ఫేమస్ అయిన ఇలాంటి స్వీట్ షాపులోనే పరిస్థితి ఇలా ఉందంటే, మిగతా షాపుల పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చు.