చంద్రబాబు నాయుడుకు మాత్రమే కాదు.. ఆయన మంత్రివర్గ సహచరులు అందరికీ కూడా.. ‘జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ముంచేసి వెళ్ళాడు’ అని చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది వారికి దైనందిన కార్యక్రమం అన్నమాట. ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే.. ఓసారి జగన్ స్మరించు కోకుంటే వారికి గడవదు.
పరీక్షలో మొదట ఓం రాసినట్టుగా, ప్రతి కార్యక్రమంలో ముందు కాసేపు జగన్ ను తిట్టి.. తరవాత మిగిలిన పనిలోకి వెళతారు. ఈ క్రమంలో.. ఇప్పుడు పయ్యావుల కేశవ్ వంతు వచ్చింది.
కాస్త బద్దకించిన ఒక కోయిల.. మామిడి సీజను గడిచిపోయిన తరువాత కూసినట్టుగా పయ్యావుల కేశవ్ చాలా ఆలస్యంగా వచ్చి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కొన్ని ఫైల్స్ పై సంతకాలు చేశారు. జగన్ ను నిందించడానికి.. ఆయన పన్నుల అంశాన్ని ఎంచుకున్నారు.
జగన్ పన్నులు విపరీతంగా పెంచారని.. దానివల్ల అందరూ పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ కార్లు కొంటున్నారని.. పొరుగు రాష్ట్రాలకు వెళ్లి పెట్రోలు కొట్టించు కుంటున్నారని చెప్పారు. దీని వల్ల రాష్ట్రంలో వ్యాపారాలు దెబ్బ తీస్తున్నాయి అని.. వ్యాపారుల మీద సానుభూతి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన పన్నులు కూడా లాస్ అవుతున్నాం అన్నారు.
పయ్యావుల మాటలు విన్నవారికి.. సారు ఇప్పుడు పన్నులు తగ్గిస్తారేమో అనే ఆశ పుడుతోంది. పొరుగు రాష్ట్రాల కంటే తక్కువ ధరకు ఏపీలో పెట్రోలు దొరికే వాతావరణం కల్పిస్తారేమో అని ఆశిస్తున్నారు. పెట్రోలు మాత్రమే కాకుండా ఇతర పన్నులు కూడా తగ్గిస్తారని ఎదురుచూస్తున్నారు. అలా చేయకపోతే.. పన్నుల గురించి పయ్యావుల మాటలు అన్నీ ఆషాఢభూతి డైలాగులే అని ప్రజలు అనుకుంటారు.