హోం మంత్రి అనిత అధికారుల మీద హాట్ కామెంట్స్ చేశారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమం కోసం వంగలపూడి అనిత తన సొంత నియోజకవర్గం పాయకరావుపేటకు వచ్చారు. ఎస్ రాయవరం మండలం పెదగుమ్మలూరు గ్రామంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
అయితే ఈ కార్యక్రమానికి ఎంపీడీవో, ఎమ్మార్వోలు గైర్ హాజర్ కావడం పట్ల హోం మంత్రి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అధికారులు సభకు రాకపోవడమేంటి అని ఆమె ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే పాల్గొన్న కార్యక్రమం అయినా అధికారులు రావాలి, అలాంటిది హోం మంత్రి వచ్చినా రాకుండా ఉంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ అయిదేళ్ల పాలనలో మగ్గిపోయిన అధికారులను బయటకు రప్పించడం పెద్ద కష్టమేమీ కాదని ఆమె అన్నారు. అధికారులకు రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు. అధికారులు వస్తేనే కదా ప్రజల సమస్యలు వినతులు వారికి తెలియచేసేది అని ఆమె అన్నారు.
చాలా మంది అధికారులు తీరు ఇంకా మార్చుకోవాల్సి ఉందని ఆమె హెచ్చరించారు. పాలన మారుతోంది. ప్రభుత్వం మారిన వేళ అధికారులు కూడా ఆ దిశగానే సాగాలని అనిత సూచించారు. లేకపోతే తాము చేతగాని వారమని అనుకోవద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏ అధికారి నిర్లక్ష్యంగా ఉన్నా కూడా సహించే ప్రసక్తే లేదని అనిత స్పష్టం చేశారు. హోం మంత్రి చేసిన ఈ కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి.