ఒక నియోజకవర్గానికి ఒక్కరే ఎమ్మెల్యే ఉంటారు. కానీ విశాఖ తూర్పు నియోజకవర్గానికి మాత్రం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి ముగ్గురూ వేరు వేరు అసెంబ్లీ సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ నివాసం ఉండేది మాత్రం తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్లలోనే అది కూడా దాదాపుగా కూత వేటు దూరంలోనే ముగ్గురు నివాసాలు ఉండడం గమనార్హం.
విశాఖ తూర్పు ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణ బాబు వరసగా నాలుగో సారి గెలిచారు. భీమిలీ నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తూర్పులోనే మరో వైపు ఉన్నారు. విశాఖ తూర్పులో రెండు సార్లు పోటీ చేసి గెలుపు పిలుపు అందుకోలేకపోయిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ తాజా ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి గెలిచి వచ్చారు. ఆయన జనసేన తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఈ ముగ్గురికీ తూర్పులో పట్టుంది. అలాగే ముగ్గురూ తూర్పులోని ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వారు, ఆ సామాజిక వర్గాలలో పలుకుబడి ఉన్న వారు. దాంతో ముగ్గురి ఎమ్మెల్యే వద్దకూ తూర్పు సమస్యల మీద ప్రజలు వస్తూండడం విశేషం. విశాఖ తూర్పులోనే ఉన్న ఏయూని కూడా తాజాగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు సందర్శించారు. ఏయూ ప్రక్షాళన తమ అజెండా అని స్పష్టం చేశారు.
ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలూ తూర్పుతోనే అనుసంధానం అయి రాజకీయ అనుబంధంతో పని చేస్తుండడం విశేషం అని అంటున్నారు. రానున్న రోజులలో విశాఖ తూర్పు నుంచి వంశీ క్రిష్ణ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో కూటమి హానీమూన్ పూర్తి అయితే కనుక హద్దులు రాజకీయ సరిహద్దుల విషయంలో అసలు విషయం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది అంటున్నారు.