తన పార్టీ ఘోర పరాజయం పొందడానికి పాలనలో లోపాలే కారణమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్ముతున్నారో, లేదో తెలియని పరిస్థితి. ఈవీఎంలలో ఏదో మాయ చేసి కూటమి గెలుపొందిందని ఆయన తరచూ అంటున్న సంగతి తెలిసిందే. దీంతో జగన్ మారుతారా? లేదా? అనే అనుమానం వైసీపీ శ్రేణుల్లో వుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఓటమిపై హుందాగా మాట్లాడారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఇలా మాట్లాడితే ఎంత బాగుండు అని వైసీపీ కార్యకర్తలు, నాయకులు అంటున్నారు. ఇవాళ కాకాణి మీడియాతో మాట్లాడుతూ తమ పాలనలో జరిగిన లోపాల్ని గుర్తించి సమీక్షించుకుంటామన్నారు. వైసీపీ కార్యకర్తలకు అండగా వుంటామన్నారు. రాష్ట్రంలో విధ్వంసపాలనకు తెరలేపారని ఆయన ఘాటు విమర్శలు చేశారు. మంచి పరిపాలన అందిస్తారనే నమ్మకంతో కూటమికి ప్రజలు పట్టం కట్టారన్నారు.
ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ పాలన సాగిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు పింఛన్ తప్ప, మరే పథకం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడ్డం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకూ ప్రజల పక్షాన పోరాడుతామన్నారు.
ఇదిలా వుండగా తమ ప్రభుత్వ హయాంలో లోపాల్ని సవరించుకుంటామని వైఎస్ జగన్ నుంచి రావాలని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నారు. ఆ మాట అంటేనే జగన్‌లో మార్పు వచ్చినట్టు అని వైసీపీ కార్యకర్తలు, నాయకుల భావన. అయితే జగన్ శకుని పాచికలు, లక్షల కోట్లు సంక్షేమ పథకాలకు లబ్ధి కలిగించామని, ఆ ఓట్లు అన్నీ ఏమయ్యాయంటూ ఓడిపోయిన తన అభ్యర్థుల ఎదుట ఆయన వాపోతున్నారు. ఇంతే తప్ప, తన పాలనలో లోపాలున్నాయని ఇంత వరకూ జగన్ ఒక్కసారి కూడా అనకపోవడం గమనార్హం.