విజయనగరం జిల్లాలో బొబ్బిలి రాజులకు దసరా వేళ ఒక సంప్రదాయం ఉంది. ఆయుధ పూజ సందర్భంగా తాము గతంలో వాడిన యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలను బయటకు తీసి పూజలు నిర్వహించడం. 18 శతాబ్దం వరకూ బొబ్బిలి ఒక రాజ్యంగా ఉంటూ వచ్చేది. నాడు రాజులు రాజ్యాలు, కత్తులు కటార్లతో ఆయుధాగారం గొప్ప సంపదగా వర్ధిల్లేది.
అనంతర కాలంలో రాజులు పోయినా రాజ్యాలు పోయినా ఆయుధాలు అలాగే ఉన్నాయి. బొబ్బిలి కోట నాటి రాజుల వైభవానికీ ప్రాభవానికీ ప్రతీకగా నిలిచి ఉంది. దసరా వేళ బొబ్బిలి కోటలో సందడి బాగా ఉంటుంది. బొబ్బిలి రాజ వంశీకులు ఆయుధాలను పూజించి తమ పూర్వీకులను తలచుకుంటారు. వారి ధైర్యాన్ని త్యాగాన్ని స్మరించుకుంటారు. వర్తమానంలో ప్రజాస్వామిక యుగంలో ఎన్నికలే అసలైన యుద్ధాలుగా మారాయి. మరో ఆరు నెలలలో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. బొబ్బిలి నుంచి రాజ వంశీకుడు బేబీ నాయన పోటీ చేయనున్నారు.
ఆయన టీడీపీ నుంచి రంగంలో ఉన్నారు. ఆయుధ పూజతో అసలైన ఎన్నికల యుద్ధానికి తెర తీస్తున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు ఉన్నారు. ఈసారి ఆయనకు టికెట్ కష్టమని ప్రచారం సాగుతోంది. బొబ్బిలి రాజుల మీద పోటీకి సమర్ధుడైన వారి కోసం అన్వేషణ సాగుతోంది.
బొబ్బిలి రాజులు ఆయుధాలు తీసి యుద్ధానికి సిద్ధం అంటూంటే వైసీపీ నుంచి మేము తయారు అని సమాధానం వస్తోంది. ఈసారి బొబ్బిలి యుద్ధం వేరే లెవెల్ అన్నట్లుగా ఉంటుంది అని స్థానికులు అంటున్నారు.