సంక్రాంతి బరిలో సైడ్ అయ్యే సినిమా ఏదైనా ఉందంటే, అది హనుమాన్ మాత్రమే అనిపించేది నిన్నటివరకు. ఎందుకంటే, గుంటూరు కారం తప్పుకోదు. సైంధవ్, ఫ్యామిలీ స్టార్ వెనక ఉన్న బ్యాకింగ్ కారణంగా ఆ సినిమాలు రావడం పక్కా. ఈగిల్ కూడా గ్యారెంటీ అనే విషయాన్ని మొన్ననే పీపుల్ మీడియా అధికారికంగా మరోసారి ప్రకటించింది.
అందరూ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్లే. ఒక్క హను-మాన్ నిర్మాత తప్ప. పైగా కొన్నిరోజులుగా సైలెంట్ అయింది ఈ సినిమా. దీంతో సంక్రాంతి నుంచి ఇది తప్పుకునే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. కానీ తగ్గేదేలేదంటూ పోస్టర్ రిలీజ్ చేశాడు ఈ సినిమా రైటర్ కమ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ.
సంక్రాంతి బరిలో బరాబర్ వచ్చి తీరతాం అన్నట్టు సింబాలిక్ గా హీరో మీసం మెలేసే పోస్టర్ ను విడుదల చేశాడు. జనవరి 12న థియేటర్లలోకి వస్తామంటూ డేట్ కూడా చెప్పాడు. సరిగ్గా గుంటూరుకారం రిలీజయ్యే రోజున, హను-మాన్ కూడా థియేటర్లలోకి వస్తుందన్నమాట.
మహేష్ మేనియా ముందు ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయనే చర్చను పక్కనపెడితే, మహేష్ మూవీ బరిలో ఉందని తెలిసి కూడా అదే తేదీని ప్రకటించిన ఈ యూనిట్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో ఒకేసారి రిలీజ్ అంటూ ప్రకటించేశారు.
తేజ సజ్జా స్టార్ హీరో కాదు, ఆ మాటకొస్తే ప్రశాంత్ వర్మ కూడా స్టార్ డైరక్టర్ కాదు. ఎటొచ్చి వీళ్ల ధైర్యం ఒక్కటే. హను-మాన్ టీజర్ పెద్ద హిట్టయింది. పాన్ ఇండియా లెవెల్లో క్లిక్ అయింది. అందుకే సంక్రాంతి పోస్టర్ వేసేశారు.
ఇది ధైర్యం అనుకుంటే, వీళ్లకు ఓ భయం కూడా ఉంది. ఈ సీజన్ మిస్సయితే మళ్లీ సినిమాకు ఫెస్టివ్ డేట్ లేదు. సంక్రాంతి ముందు రాలేరు, సంక్రాంతి తర్వాత కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ భారీగా డబ్బులు పెట్టేశారు. మరోవైపు వాయిదాల మీద వాయిదాలు అనే ముద్ర పడిపోయింది. అందుకే తాడోపేడో అన్నట్టున్నారు వీళ్లు.