ఆన్ లైన్ డేటింగ్ లోకి ఎందుకు తొంగి చూస్తున్నారు?

ప్ర‌పంచంలో చాలా దేశాల్లో ఆన్ లైన్ డేటింగ్ పాపుల‌ర్ కావొచ్చు. అయితే మ‌నిషిని మ‌నిషి అంత తేలిక‌గా న‌మ్మ‌డం కుద‌ర‌ని, ప్ర‌త్యేకించి ల‌వ్ ఎఫైర్స్ విష‌యంలో కట్ట‌డి, చాలా ర‌కాల లెక్క‌లు ఉన్న ఈ…

ప్ర‌పంచంలో చాలా దేశాల్లో ఆన్ లైన్ డేటింగ్ పాపుల‌ర్ కావొచ్చు. అయితే మ‌నిషిని మ‌నిషి అంత తేలిక‌గా న‌మ్మ‌డం కుద‌ర‌ని, ప్ర‌త్యేకించి ల‌వ్ ఎఫైర్స్ విష‌యంలో కట్ట‌డి, చాలా ర‌కాల లెక్క‌లు ఉన్న ఈ దేశంలో ఆన్ లైన్ డేటింగ్ ఇప్ప‌టికీ త‌క్కువే! ప‌దేళ్ల నుంచి ఫేస్ బుక్, ఆ త‌ర్వాత వాట్సాప్ వంటి వాటి ద్వారా ఆన్ లైన్ డేటింగ్ పెరిగినా, మ‌న దేశంలో ఇప్ప‌టికీ వీటిని న‌మ్మే వాళ్లు చాలా త‌క్కువ శాత‌మ‌నే చెప్పాలి. ఆ త‌ర్వాత డేటింగ్ కోస‌మే అంటూ బోలెడ‌న్ని యాప్స్ పుట్టుకొచ్చాయి. మీకు త‌గిన వారిని , మీరు కోరుకున్న త‌ర‌హా రిలేష‌న్ షిప్ ను అందిస్తామ‌నే అప్లికేష‌న్లు బోలెడ‌న్ని త‌యార‌య్యాయి. వీటిని ఈ మ‌ధ్య‌కాలంలో కొంద‌రు సెల‌బ్రిటీలు కూడా ప్ర‌మోట్ చేస్తున్నారు. వారిదేముంది డ‌బ్బిస్తే దేన్నైనా ప్ర‌మోట్ చేస్తారు!

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఇండియ‌న్స్ ఆన్ లైన్ డేటింగ్ హ్యాబిట్స్ గురించి జ‌రిగిన ఒక అధ్య‌య‌నం ఆస‌క్తిదాయ‌క‌మైన విష‌యాల‌ను చెబుతోంది. ఆన్ లైన్ డేటింగ్ వైపు ఇండియ‌న్స్ ఎందుకు తొంగి చూస్తున్నారు? ఎలాంటి స‌మ‌యంలో అటు వైపు చూస్తున్నారు? అంటే.. దానికి కొన్ని ఆస‌క్తిదాయ‌క‌మైన స‌మాధానాల‌ను వారి నుంచి తీసుకుంది ఈ అధ్య‌య‌నం.

దెబ్బ‌తిన్నామ‌నే భావ‌న‌తో!

ఇది విన‌డానికి వింత‌గా ఉన్నా.. పాపుల‌ర్ డేటింగ్ యాప్స్ లోకి వ‌స్తున్న వాళ్లు ఒక విధ‌మైన ఫ్ర‌స్ట్రేష‌న్స్ తోనే ఉంటార‌ట‌! అక్క‌డ‌కు రావ‌డ‌మే ఏదో రిలేష‌న్ షిప్ లో దెబ్బ‌తిన్న త‌ర్వాతే వ‌స్తున్నార‌నేది ఈ అధ్య‌య‌నం చెబుతున్న ముఖ్య‌మైన అంశం. రిలేష‌న్ షిప్ విష‌యంలో ఏ ద‌శ‌లో ఉన్న వారైనా.. త‌మ రియ‌ల్ లైఫ్ బంధంలో ఏదో ర‌కంగా ఇబ్బంది ప‌డ‌టం, దెబ్బ‌తిన్నామ‌నే భావ‌నో, మోస‌పోయామ‌నుకోవ‌డ‌మో.. ఇలా ఒక ర‌క‌మైన ఆలోచ‌న‌ల‌తో ఉన్న స‌మ‌యంలోనే ఆన్ లైన్ డేటింగ్ వైపు చూస్తున్నార‌ట! అంటే తెలిసిన వ్య‌క్తినో, చూసిన వారినో ప్రేమించి.. లేదా రిలేష‌న్ షిప్ లో ఉండి, దెబ్బ‌తిన్నామ‌నే భావ‌న క‌లిగిన‌ప్పుడు వారు ఆన్ లైన్ వైపు ఆశ‌గా చూస్తున్నార‌నేది ఈ అధ్య‌య‌నం ప్రాథ‌మికంగా చెబుతున్న అంశం.

వైవాహిక బంధం ఆనందంగా లేక‌పోవ‌డం!

వైవాహిక బంధంలో ఏదో ర‌క‌మైన వెలితితో ఆన్ లైన్ డేటింగ్ వైపు చూసేవారు కూడా చాలా మంది ఉన్నార‌ని ఈ అధ్య‌య‌నం చెబుతోంది. వారికి గ‌ల కార‌ణాలు ఏమిటంటే.. 33 శాతం మంది వైవాహిక జీవితంలో త‌మ‌కు ఎమోష‌న‌ల్ స‌పోర్ట్ ల‌భించ‌క‌పోవ‌డంతోనే ఆన్ లైన్ బంధాల కోసం వెదుక్కొన్న‌ట్టుగా చెప్పార‌ట‌! ఇక 41 శాతం మంది సెక్సువ‌ల్ శాటిస్ ఫ్యాక్ష‌న్ లేక‌పోవ‌డంతోనే ఆన్ లైన్ బంధం కోసం చూసిన‌ట్టుగా, లేదా చూస్తున్న‌ట్టుగా చెప్పార‌ట‌!

ఎక్స్ పెరిమెంట‌ల్!

ఈ యాప్స్ వైపు వెళ్లే వారిలో కొంద‌రు ఎక్స్ పెరిమెంట‌ల్ కోస‌మే వెళ్తార‌ట‌! సెక్సువ‌ల్ గా, ఎమోష‌న‌ల్ కొత్త‌ర‌కం అనుభ‌వాల కోస‌మే వీరు అటు వైపు చూస్తున్నార‌ని ఈ అధ్య‌య‌నం చెబుతోంది. వీరి శాతం 30కి పైనే అని ఈ అధ్య‌య‌నం చెబుతోంది. ఈ యాప్స్ లో ఉన్న వివాహితుల్లో ఎక్స్ పెరిమెంట‌ల్ లైఫ్ కోసం లాగిన్ అయ్యార‌ట‌! ఈ ఉద్దేశంలో యాప్స్ ను ఆశ్ర‌యిస్తున్న వారిలో మ‌హిళ‌ల శాత‌మే కాస్త ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం.

అయితే ఆన్ లైన్ డేటింగ్ ఏ ర‌కంగానూ న‌మ్మ‌క‌మైన‌ది కాద‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. అదో బూట‌క‌మైన అంశం. అక్క‌డ చెప్పేది, చూపించేది అంతా అబ‌ద్ధ‌మే. నిజంగానే జీవితంలో ఏ రిలేష‌న్ షిప్ లో దెబ్బ‌తిని ఉన్నా, లేదా వైవాహిక జీవితంలో గ‌తుకులు ఎదుర‌వుతున్నా… వాటిని ప‌రిష్క‌రించుకోవ‌డానికి స‌వ్య‌మైన మార్గాలు ఉన్నాయ‌ని ఈ అధ్య‌య‌నం సూచిస్తోంది. కూర్చుని మాట్లాడుకోవ‌డం, సెట్ కాక‌పోతే ఏ క‌పుల్ థెర‌పీనో తీసుకోవ‌డం,  నిజాయితీతో వ్య‌వ‌హ‌రించ‌డం, న‌మ్మ‌కాన్ని తిరిగి ప్రోదికొల్పుకోవ‌డం ఉత్త‌మ మార్గాలు!