చిత్రం: విడుదల-2
రేటింగ్: 2.25/5
తారాగణం: విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, కిషోర్, గౌతం వసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, ఇళవరసు, అనురాగ్ కాశ్యప్ తదితరులు
కెమెరా: వేల్ రాజ్
ఎడిటింగ్: రామర్
సంగీతం: ఇళయరాజా
నిర్మాత: ఎల్రెడ్ కుమార్, వెట్రిమారన్
దర్శకత్వం: వెట్రిమారన్
విడుదల: 20 డిసెంబర్ 2024
పోయినేడాది వచ్చిన విడుదల-1 కి ఇది కొనసాగింపు. ఆ చిత్రం సూరి నటనతోనూ, పోలీస్ అకృత్యాలతో కూడిన కథనంతోనూ కట్టిపారేసింది. అందులో విజయ్ సేతుపతి పాత్ర పెద్దేమీ లేదు. ఆ నటుడి విశ్వరూపం రెండవ భాగంలోనే చూడాలన్నట్టుగా ముగిసింది. ఇంతకీ ఈ సెకండ్ పార్ట్ ఎలా ఉందో చూద్దాం.
పెరుమాళ్ (విజయ్ సేతుపతి) ని కొమరేష్ (సూరి) ఇచ్చిన ఆధారాలను వాడుకుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు కథ నడుస్తూనే మధ్యమధ్యలో పెరుమాళ్ ఫ్లాష్ బ్యాక్ సీన్లతో కథనం సాగుతుంది. తాను పనిచేసే ఫ్యాక్టరీ యజమాని కూతురు (మంజు వారియర్) తో పెరుమాళ్ కి గతంలో ప్రేమాయణం నడుస్తుంది. ఆమె అభ్యుదయభావాలున్న వ్యక్తి. పెరుమాళ్ కొన్నాళ్లు టీచర్ గా కూడా పనిచేస్తాడు. వెనుకబడిన బడుగు వర్గాల పిల్లలకి చదువు చెప్తుంతాడు. వారి పక్షాన ఉండి, కులవివక్ష చూపి హింసించే జమిందార్లతో పోరాడతాడు. పర్యవసానంగా అతను ఒక తిరుగుబాటుదారుడుగా మారి పోలీసులకి శత్రువవుతాడు. అందుకే అతనిని అరెస్ట్ చేసారు. అక్కడి నుంచి ఏమౌతుంది అనేది తక్కిన కథ.
తొలి భాగానికి, ఈ మలి భాగానికి అనుభూతి పంచే విషయంలో చాలా తేడా ఉంది. తొలిభాగంలో సూరి పాత్ర చిత్రణ మనసుకి హత్తుకుంటుంది. అమాయకత్వం, నిబద్ధత, నిజాయితీ, అలసటలేనితనం.. ఈ లక్షణాలన్నీ ప్రేక్షకుల్ని ఆ పాత్రతో ట్రావెల్ చేసేలా చేసాయి. కానీ ఇందులో ఆ ఎంగేజ్మెంట్ లేదు. అసలు సూరి పాత్ర ఇందులో చాలా చిన్నది. మొత్తం విజయ్ సేతుపతి మీదే నడుస్తుంది.
ధనికులైన జమిందార్లు, అణగారిన బడుగుజనాల మధ్యన పోరు. ఎన్నో సార్లు చూసేసిన తమిళ రొట్టకొట్టుడు కథాంశమిది. వెనుకబడ్డ కులాలలోని సాహసం, వీరత్వం, ధైర్యం, తిరుగుబాటు.. ఇవే తెర మీద చూపించే ప్రయత్నం జరిగింది. కానీ కళ్లు చెమర్చేలాగ, మనసుకి పట్టుకునేలాగ “జైభీం” తరహాలో అస్సలు తెరకెక్కలేదు. ఎంతసేపూ కథ అక్కడక్కడే ఉన్న ఫీలింగొస్తుంది. ముందుకు కదులుతున్నట్టు అనిపించదు.
తమిళ సినిమాల్లో తరచూ కనిపించే దళితవాదం, చాలా సార్లు చూసేసిన ఎర్రజెండా భావజాలం తెర మీద సన్నివేశాలుగా కదిలాయి తప్ప మనసుని పట్టి గుంజలేకపోయాయి.
విజయ్ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పడానికేమీ లేదు. ఏ సినిమాలో చూసినా ఒకలాగే ఉంటాడు. తాను పోషించే పాత్రలో ఒదిగిపోతాడు. ఇక్కడా అంతే. కథలో, కథనంలో పట్టుంటే సేతుపతి పనితనానికి ఫలితముంటుంది తప్ప లేకపోతే మూస ధోరణి నటనే అనిపిస్తుంది.
మంజు వారియర్ ఓకే. అభ్యుదయవాదానికి చెందిన పాత్ర అని తెలుస్తుంది తప్ప ఆ పాత్రని హత్తుకునేలా అయితే రాసుకోలేదు.
సూరి కాసేపు కనిపిస్తాడు. క్లైమాక్సులో తన ఉనికి చాటే క్లోజింగ్ సీన్ ఒకటుంది.
అనురాగ్ కాశ్యప్ ది అతిధి పాత్రే. కిషోర్ పాత్ర కూడా పెద్ద చెప్పుకోదగ్గ రీతిలో లేదు. మిగిలిన క్యారెక్టర్స్ లో విడుదల-1 లో ఉన్నవి కొన్ని యథాతధంగా కొనసాగాయి.
కెమెరా డిపార్ట్మెంట్ బాగా పని చేసింది. ఎడిటింగ్ షార్ప్ గా ఉండాల్సింది. రెండు గంటల నలభై రెండు నిమిషాల చిత్రాన్ని ఈ కథనంతో భరించడం కష్టమనిపిస్తుంది. చాలా వరకు ట్రిం చేసే అవకాశముంది కూడా.
ఇళయరాజా నేపథ్యసంగీతం ఓకే. పాటల్లో “….ఎక్కువ జాతి తక్కువ జాతి ఎక్కడ ఈ నీతి..” అనే పాట బాగుంది. ఓవరాల్ గా అద్భుతం అనలేం కానీ, సరిపెట్టుకోదగ్గ సంగీతం వినిపించింది.
డైలాగుల్లో డబ్బింగ్ ఫ్లావర్ గట్టిగా కొట్టింది. సహజత్వం లేకుండా బుకిష్ గా ఉన్నట్టున్నాయి మాటలు. పైగా ఎక్కడా గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా లొడలొడమంటూ డైలాగులే డైలాగులు, లేదా వాయిస్ ఓవర్లు. అవి కూడా క్రిస్ప్ గా లేకుండా పొడుగ్గా…! ఒక లైన్ మైండికి ఎక్కే లోపు ఇంకో లైన్ వచ్చేస్తుంటుంది. ఒరిజినల్ రైటింగులోనే ఈ లోపముంది. ఆ లోపాన్ని డబ్బింగులో కూడా కొనసాగించక తప్పలేదు.
చివరిగా చెప్పేదేంటంటే..ఎక్కడా సస్పెన్స్ కానీ, థ్రిల్ మొమెంట్ కానీ లేని చిత్రమిది. ఉన్నత-నిమ్న వర్గాల మధ్య పోరు, తిరుగుబాటు అనే బీటెన్ ట్రాక్ కి చెందిన నెరేషన్ తో నిండిపోయిన సినిమా ఇది. ఎక్కడో అక్కడ ఏదో మలుపో, మెరుపో ఉంటుందని ఆశించి చూస్తూ, చివరికి నీరసంగా నిట్టూర్చేలా చేసిన కథ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే హాల్లోంచి బయటికొస్తుంటే జైల్లోంచి విడుదలైన ఫీలింగుని ఇచ్చిన చిత్రం ఈ “విడుదల”.
బాటం లైన్: హత్తుకోని కథ
ఐతే థియేటర్లో చూడాల్సిన అవసరం లేదు
నేను విడుదల 1 కూడా చూడలేదు
chudu
bn
రివ్యూ ఎవరు రాసారో తెలీదు కానీ, ఇళయరాజా గారి నేపధ్యసంగీతం ఒకేనా ? ఈ తరం డిజిటల్ రణగొణ కర్ణబేరులు విఛ్ఛిన్నం అయ్యే నేపథ్యసంగీతానికి అలవాటుపడ్డ బాపతు కాబోలు, పూర్తి స్త్యాయు సింఫనితో , అద్భుతమైన బ్రాస్ సెక్షన్ తో ఎక్కడ కూడా ఒవర్ థ బోర్డ్ లేకుండా వున్న సంగీతం , ఇక్కడ పాటల గురించి కాదు కేవలం నెపధ్యసంగీతం మాత్రమే చాలా చాలా బావుంది, రివ్యూయర్ గారికి బొత్తిగా నేపధ్యసంగీతం మీద అవగాహన లేనట్టు వుంది