ఏం పీకుతావు జగన్ అని చంద్రబాబు, లోకేశ్ తదితర టీడీపీ నేతలు పదేపదే ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమను ఏం పీకారో లోతుగా ఆలోచిస్తే జైలు బయట ఉన్న లోకేశ్‌కు అర్థమవుతుంది. కనీసం తమ నాయకుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకుని 2024 ఎన్నికలకు వెళ్లలేని దయనీయ స్థితి టీడీపీది. ఇంత కంటే టీడీపీని ఏం పీకాలని అనుకుంటున్నారో టీడీపీ నేతలు చెప్పాలి.
బహుశా తనకు, టీడీపీకి ఇలాంటి దుర్భర స్థితి ఒకటి వస్తుందని చంద్రబాబు కలలో కూడా ఊహించి వుండరేమో! రాజమండ్రిలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం పవన్, లోకేశ్ మీడియాతో మాట్లాడారు. కూటమి సీఎం అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు లోకేశ్ తత్తర పడ్డారు. పవన్ మొహంలో చిద్విలాసం కనిపించింది.
రాష్ట్ర ప్రజల కోసం, భవిష్యత్ కోసమో తప్ప, పదవులు, సీట్లు ముఖ్యం కాదని పవన్, లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఔనన్నా, కాదన్నా ఏపీలో టీడీపీకి 40 శాతం ఓటు బ్యాంక్ వుంది. ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వస్తామనే ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో వుంది. అలాంటి పార్టీ తమ నాయకుడు చంద్రబాబునాయుడే సీఎం అభ్యర్థి అని చెప్పుకోడానికి వీల్లేని దయనీయ స్థితిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కల్పించడం చర్చనీయాంశమైంది.
పదేళ్ల క్రితం జనసేన అనే పార్టీని స్థాపించి, రెండు చోట్ల నిలిచి, కనీసం ఒక చోట కూడా గెలవలేని పవన్‌కల్యాణ్ మద్దతు కోసం చంద్రబాబు సీఎం అభ్యర్థిగా చెప్పుకోలేకపోవడం టీడీపీకి సిగ్గుచేటు. ఇలాగైతే టీడీపీ శ్రేణులు జనంలోకి వెళ్లి ఏమని చెబుతాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం వుంది. పవన్‌కల్యాణే దయతలచి ఆంధ్రప్రదేశ్‌కు అనుభవం ఉన్న నాయకత్వం కావాలనే కామెంట్స్‌తో టీడీపీ శ్రేణుల్లో కొద్దోగొప్పో సీఎం పదవిపై ఆశలు చిగురింపజేశారు.
పవన్‌కల్యాణ్ నుంచి ఆ మాటలు కూడా రాకపోతే చంద్రబాబు, టీడీపీ భవిష్యత్ గోవిందా గోవిందా అని చెప్పక తప్పదు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా టీడీపీ ప్రచారం చేసుకోలేకపోతే, రాజకీయంగా, అలాగే పార్టీ పరంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఆ నష్టం ఏంటో భవిష్యత్ తప్పక చెబుతుంది. జనసేన లేకపోతే, తమకు భవిష్యత్ లేదనే రీతిలో పవన్‌కల్యాణ్ ముందు టీడీపీ మోకరిల్లినట్టుగా వుంది. అందుకే టీడీపీ-జనసేన కూటమి సీఎం అభ్యర్థిపై లోకేశ్ నోటిని పవన్ కట్టేశారు. అదేదైనా వుంటే, తాను చెబుతా తప్ప, టీడీపీ నేతలు కాదన్నట్టుగా పవన్ వైఖరి వుంది.
అయితే టీడీపీ వాదన మరోలా వుంది. కూటమి సీఎం అభ్యర్థి చంద్రబాబు అని చెబితే, జనసేన శ్రేణులు టీడీపీ పల్లకీ మోయడానికి తామెందుకు పని చేస్తామంటాయని, అందుకే పవన్ వ్యూహాత్మకంగా నడుచుకుంటున్నారని చెబుతున్నారు. లాజిక్ కోసం ఇవన్నీ బాగుంటాయే తప్ప, రానున్న రోజుల్లో రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించగలరు? చంద్రబాబును సీఎం చేయకుండా వుంటే, టీడీపీని శాశ్వతంగా ఫినీష్ చేయొచ్చనే ఎత్తుగడతో బీజేపీ కీలకంగా పావులు కదిపి, పవన్‌ను ఆ సీటులో కూచోపెడితే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఇప్పటికీ తాను ఎన్డీఏలోనే ఉన్నానని నిన్నటి సమావేశంలో కూడా పవన్ ప్రకటించడాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. సీఎం పదవి ఎవరికీ చేదు కాదు. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు రాజకీయాల్లో చెల్లుబాటు కాదు. కూటమి సీఎం అభ్యర్థిగా చంద్రబాబు పేరును అధికారికంగా ప్రకటించకపోవడం టీడీపీ ఆత్మహత్యాసదృశ్యమే. సమన్వయ కమిటీ మొదటి సమావేశం అనంతరం సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై దాటివేతతో… టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోడానికి సిద్ధపడాల్సిందే.
చంద్రబాబు అరెస్ట్, ఇంతకాలం జైల్లో వుంటారని ఎవరైనా ఊహించారా? ఇప్పుడు జరిగిన తర్వాత నోరెళ్లబెట్టడం టీడీపీ నేతల వంతైంది. ఒకవేళ రేపు కూటమి అధికారంలోకి వచ్చినా, ఏం జరుగుతుందో ఎవరు ఊహించగలరు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో సీఎం జగన్ రాజకీయంగా సక్సెస్ అయ్యారు. తన ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబునాయుడిని కనీసం సీఎం అభ్యర్థి కూడా కాకుండా చేయగలిగారు. జగన్ ఏం పీకారనో, ఏం పీకుతారనో ప్రశ్నంచే వాళ్లకు… ఇంత కంటే ఏం సమాధానం కావాలి?