టాలీవుడ్ నిర్మాతలు లీకులిచ్చుకుంటున్నారా?

ప్రతి పెద్ద సినిమా ముందు కాకపోయినా, దాదాపు చాలా పెద్ద సినిమాల విడుదలకు ముందు ఆ సినిమాల ప్రొడక్షన్ హౌస్‌ల మీద అయితే ఇన్ కమ్ టాక్స్, లేదా జీఎస్టీ, కాకుంటే టీడీఎస్ శాఖల…

ప్రతి పెద్ద సినిమా ముందు కాకపోయినా, దాదాపు చాలా పెద్ద సినిమాల విడుదలకు ముందు ఆ సినిమాల ప్రొడక్షన్ హౌస్‌ల మీద అయితే ఇన్ కమ్ టాక్స్, లేదా జీఎస్టీ, కాకుంటే టీడీఎస్ శాఖల దాడులు వుంటూ వుంటాయి. అసలే విడుదల టెన్షన్ లో వున్న నిర్మాతలు కిందా మీదా అయిపోతారు. ఇండస్ట్రీలో ఇది చాలా కామన్. కానీ ఇప్పుడు కొత్త గ్యాసిప్ వినిపిస్తోంది. నిర్మాతల్లో ఒకరంటే ఒకరికి సరిపడని వారు లీక్ లు అందివ్వడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

కిట్టనివాళ్లు కావాలనే సంబంధిత శాఖలకు లీక్ లు ఇస్తారని, దాంతోటే దాడులు మొదలవుతాయని, దాని వల్ల నిర్మాతలకు కీలకమైన ఒకటి రెండు రోజులు వృధా అయిపోతాయని ఇలా దాడులకు గురైన ఓ నిర్మాత అభిప్రాయపడ్డారు. కానీ జిఎస్టీ, టీడీఎస్ లాంటి దాడులు ఇలాంటి లీకుల వల్ల జరగవు అని, వాళ్లకు వున్న సమాచారం వల్లనే జరుగుతాయని మరో నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

కానీ ఈ క్లారిటీ సంగతి అలా వుంచితే, నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు కట్టే వ్యవహారాలు మాత్రం లీకుల వల్ల బలంగా ప్రభావితం అవుతున్నాయని, డిస్ట్రిబ్యూషన్ రంగం, నిర్మాణ రంగం బాగా దగ్గరయిపోవడం వల్ల, రెగ్యులర్ బయ్యర్లు అనే కాన్సెప్ట్ పెరగడం వల్ల సమాచారం ఇట్టే అటు ఇటు మారిపోతోందని, దాంతో లాస్ట్ మినిట్ లో డబ్బులు కట్టే దగ్గర చేతులు ఎత్తడం అన్నది పెరిగిపోతోందని టాక్ వినిపిస్తోంది.

రెగ్యులర్ బయ్యర్లు వున్నా కూడా ఇలాంటి పరిస్థితి వస్తోంది. కొన్ని ఏరియాల్లో రాను రాను బయ్యర్లు తగ్గిపోతున్నారు. కొన్ని ఏరియాల్లో ఎగ్జిబిషన్ రంగం ఒకటి రెండు చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇలాంటి చోట థియేటర్ అడ్వాన్స్ లు రావు. దాంతో అక్కడ సినిమాలు కొనడానికి ముందుకు వచ్చేవారు తగ్గిపోతున్నారు. మరో పక్క మరో చిత్రమైన పరిస్థితి ఏర్పడుతోంది. సినిమాలు కాంబినేషన్లు చూసి ఏ ఏరియాకు ఆ ఏరియా బయ్యర్లు ముందుకు వచ్చారు అనుకుందాం. మంచి రేటుకు సినిమా మార్కెట్ అయింది అన్న నిర్మాతల సంబరం ఎన్నాళ్లో మిగలడం లేదు.

సినిమా ఎడిటింగ్ టేబుల్ మీదకు, రీరికార్డింగ్ కు రాగానే టాక్ బయటకు వచ్చేస్తోంది. కొన్ని పెద్ద తలకాయలే తమ అపోనెంట్ జనాలను పడగొట్టడానికి టాక్ ను తెలివిగా కిందకు పంపేస్తున్నారనే గుసగుసలు కూడా వున్నాయి.. కొన్న బయ్యర్లు కూడా టాక్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో లాస్ట్ మినిట్ బేరాలు ఆడడం చేతులు ఎత్తేయడం మామూలైపోయింది. అరవై, ఢెబై కోట్లు బిజినెస్ చేసాం అని సంబరపడితే, నిర్మాతలకు కనీసం నాలుగైదుకోట్లు తేడా వచ్చేస్తోంది.

మొత్తం మీద టాలీవుడ్ లో తెరవెనుక ఓ చిత్రమైన వ్యవహారం నడుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ కలిసి దాగుడు మూతలు ఆడుతున్నారు. మెల్లగా నిర్మాణ రంగాన్ని మోనోపలీ చేయడానికి, అలాగే పంపిణీ రంగాన్ని నియంతృత్వంలోకి తీసుకోవడానికి పావులు కదుపుతున్నారు. దాని వల్ల కాంబినేషన్లు సినిమాలు తమకే సెట్ అవుతాయి. వచ్చిన నిర్మాతను వచ్చినట్లే జేబులు ఖాళీ చేయించి వెనక్కు పంపిస్తే ఓ పనైపోతుంది. అందుకోసం వివిధ రంగాలకు చెందిన కొంతమంది కలిసి తెరవెనుక సిండికేట్ లు గా ఫార్మ్ అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ సిండికేట్ ప్లానింగ్ తో తమ సినిమాలు పోటీ లేకుండా చేసుకోవడం, వేరే సినిమాలకు పోటీ వుండేలా చేయడం, టాక్ లీక్ చేయడం, ఇంకా.. ఇంకా… చాలా జరిగిపోతున్నాయని కొందరు నిర్మాతలే వాపోతున్నారు.