“శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం”. ఇప్పుడు భారతదేశవ్యాప్తంగా ఇదే హెడ్లైన్. ఎందుకంటే ఆ చిన్న దేశం మన పక్కనే ఉంది, మనం 2.5 బిలియన్ డాలర్లు ఆర్థిక సాయంగా అప్పు కూడా ఇచ్చాం.
అక్కడ ఆర్థిక సంక్షోభానికి కారణాలు అనేకం. వాటిల్లో కొన్ని.
– ఎగుమతులు చేయగలిగే సామర్ధ్యం లేకపోవడం
– ఆహారం నుంచి అన్ని అవసరాలకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం
– దేశవ్యాప్త సేంద్రీయ సాగుబడి పేరుతో పూర్తిగా ఎరువుల్ని, పెస్టిసైడ్స్ ని దేశంలోకి దిగుమతి కాకుండా నిషేధించడం. పర్యవసానంగా ఆహారోత్పత్తి పడిపోయి “అన్నమో రావణాసురా” అని నినాదం చేయడం.
– కరోనా కాలంలో టూరిజం ఆగిపోయి దేశ ప్రధాన వనరుకి ఆటంకం కలగడం
– ఎల్.టీ.టీ.ఈ అంతరించిపోయినప్పటి నుంచి మొన్నటి వరకు విదేశాల నుంచి, ఐ.ఎం.ఎఫ్ నుంచి తెచ్చుకున్న అప్పుతో రోడ్లు, భవనాలు వంటి ప్రాధమిక వసతులకి ఎక్కువగా ఖర్చుపెట్టేయడం. మిగిలిన దానిని ప్రజాసంక్షేమానికి ఇవ్వడం.
– లోకల్ ఇంఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి విదేశాల మీద ఆధారపడడం, దానివల్ల ఖర్చు రూపంలో డబ్బు విదేశాలకు తరలిపోవడం.
– దేశంలో యువత అధికశాతంలో విదేశాలకు వలసపోవడం. మధ్యవయస్సు వాళ్లు, వయోవృద్ధులే జనాభాలో అధికశాతం ఉండడం.
– రాజపక్స కుటుంబ పాలనలో రాచరికం పద్ధతిలో రాజ్యాంగాన్ని మార్చేయడం, ఇష్టానుసారం పాలించడం.
ఈ మొత్తం లిస్టులో సంక్షేమ పథకాల కింద పంచిన డబ్బుని ఏ విధంగా చూడాలో ఒక్కసారి చూద్దాం.
పేదలకి పంచిన డబ్బు విదేశాలు తరలిపోదు. అక్కడక్కడే తిరుగుతుంటుంది. చేతులు మారడం, అందులో కొంత తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది.
ఇది చెప్పడానికి ఆర్థికశాస్త్ర నిపుణులు అవసరం లేదు. కామన్ సెన్స్ చాలు.
కనుక పైన లిస్టులో అందరితో పాటూ దీనినీ ప్రస్తావించినా నిజానికిది అనుకున్నంత నెగటివ్ పాయింట్ కాదు.
దాన్నలా ఉంచి ఇప్పుడు అసలు పాయింటుకొద్దాం.
“ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతోందా?” అని ఒకడు..
“కేరళ మరొక శ్రీలంక కావడానికి సిద్ధంగా ఉంది” అని ఇంకొకడు..
ఇలా ప్రతి రాష్ట్రం వాడు అక్కడి ప్రభుత్వవ్యతిరేకతని శ్రీలంకతో లింకు పెట్టి వీడియోలు చేసి వదులుతున్నారు.
మెదడు మోకాల్లో ఉంటే తప్ప ఇలాంటి వీడియోలు చేయరు…
మెదడు అరికాల్లో ఉంటే తప్ప ఆ వీడియోల్లో చెప్పింది నిజమని నమ్మరు..
ఎందుకంటే శ్రీలంక ఒక దేశం. తిప్పి కొడితే 2 కోట్ల జనాభా. ఆ దేశాన్ని ఆదుకోవడం కష్టసాధ్యమెమీ కాదు. ఇప్పుడేదో వార్త చలామణీలో ఉంది కాబట్టి అదేదో అంతర్జాతీయ సమస్యలా చూస్తున్నాం కానీ సొల్యూషన్ దొరికితే అంతా సర్దుకోవడానికి ఎంతో కాలం పట్టదు.
ఏటం బాంబులు పడ్డ హిరోషిమా, నాగసాకిలే అనుకున్న దానికంటే ముందే లేచికూర్చున్నాయి.
ఎల్.టీ.టీ.ఈ అంతమయిన కొన్నాళ్లకే శ్రీలంక ప్రపంచ టూరిస్టుల్ని ఆకట్టుకోవడం మొదలుపెట్టేసింది.
ఐసిస్ తో అట్టుడుకిన ఇరాక్, సిరియాలు కూడా మామూలు స్థితికి వచ్చేస్తున్నాయి.
ఉక్రైన్ కూడా చొస్తుండగానే సాధారణస్థితికి వచ్చేస్తుంది.
వీటితో పోలిస్తే శ్రీలంక ఆర్థిక సంక్షోభం బ్రహ్మరాక్షసేం కాదు.
శ్రీలంక దేశం కాబట్టి దానికి బయటనుంచి సాయం కావాలి. ఆంధ్రప్రదేశ్, కేరళలు భారతదేసంలో రెండు రాష్ట్రాలు. దేశజనాభాలో మహా అయితే 6%. ఇక్కడ ఏ ఆర్థిక లోటుపాట్లొచ్చినా కేంద్రమనేది ఒకటుంటుంది. అంతేగానీ శ్రీలంకలాగ ప్రపంచానికేసి చూసి గావుకేక పెట్టాల్సిన అవసరం లేదు.
కేరళ మీద జరుగుతున్న ప్రచారాన్ని పక్కనబెట్టి ఆంధ్రప్రదేశ్ మీద జరుగుతున్న ప్రచారం విషయానికొద్దాం.
నిజానికి శ్రీలంక ప్రభుత్వం చేసిన తప్పులు చంద్రబాబు తన పాలనలో చేసాడు. తెచ్చిన అప్పుతోటి, వచ్చిన ఆదాయం తోటి అభివృద్ధి పెరుతో కెవలం అమరావతిలో ఎక్కువ ఖర్చు చేసాడు. శ్రీలంకలో లాగానే ఆ ఒక్క ప్రాంతంలోనూ రోడ్లూ, కొన్ని భవనాలు కనిపించాయి. కానీ దానివల్ల శ్రీలంక మాదిరిగా టూరిజం అయితే పెరగలేదు అమరావతిలో. కొంతవరకు రియల్ దందా మాత్రం జరిగింది.
పేదవాడి జేబు మాత్రం ఖాళీగానే ఉండేది.
ఇప్పటికీ చంద్రబాబు సీయం గా ఉండుంటే ఈ పాటికి అమరావతిని సింగపూర్ చేస్తానని సింగపూర్ ఇంజనీర్స్ ని, ప్లానింగ్ నిపుణులని రప్పించి వాళ్ల ఖాతాల్లోకి కోట్లు పంపించేవాడు. ఆ రకంగా అప్పు చేసి తెచ్చిన సొమ్ము కాస్తా విదేశాలకు పోయేది. చంద్రబాబుకి సింగపూర్లో హోటల్ మొదలైన వ్యాపారాలు ఎలాగో ఉన్నాయి కాబట్టి ఆ సింగపూర్ కంపెనీలతో లోపాయికారీ ఒప్పందాలు కూడా స్వలాభం కోసం చేసుకునుండేవాడు.
ఆ విధంగా “రిచ్ బికం రిచర్ – పూర్ బికం పూరర్” అయ్యుండేది రాష్ట్రం.
కరోనా లాక్డౌన్ టైములో అసలు “నవరత్నాలు” పేరుతో పేదల ఖాతాల్లోకి డబ్బు వెళ్లుండకపోతే ఎన్ని ఆత్మహత్యలు చూడాల్సొచ్చేదో. ఎన్ని ఆకలి చావులు, దోపిడీలు వినాల్సొచ్చేదో.
పథకం పేరు ఏదైనా పేదవాడి ఎకౌంట్లో డబ్బులు పడడం వల్లనే బట్టల దుకాణాలు గానీ, నిత్యవసరాల షాపులు గానీ, సినిమా హాళ్లుగానీ దివాళా తీయకుండా కళకళలాడుతున్నాయి. పేదవాడికి డబ్బొస్తే ఖర్చుపెడతాడు. బాగా ఉన్నవాడికి డబ్బిస్తే విదేశీ బ్రాండ్ వస్తువులు కొని డబ్బుని విదేశాలకి తరలిస్తాడు.
పేదల మీద ప్రేమతో పెట్టాడనుకున్నా, ఓటు బ్యాంకు కోసం నెలకొల్పాడనుకున్నా నవరత్నాలు కరోనా కాలంలో పేదలకి ఊపిరందించాయి. అదే సొమ్ములో కొంత భాగం వెనక్కి పన్నుల రూపంలో ప్రభుత్వ ఖాతాల్లోకి చేరి బండి నడిపింది.
శ్రీలంకకి, భారత దేశంలోని ఒక రాష్ట్రానికి లింకు పెట్టి వాగే ముందు కాస్త ఆలోచించాలి.
36 మంది సంపాదించేవాళ్లున్న ఇంటికీ, ఒక్కడే సంపాదించే ఇంటికి తేడా ఉండదు?
36 మంది సంపాదించే కొంపలో కొన్ని నెలల పాటు ఒకరిద్దరు సంపాదించకపోయినా ఏమీ తేడా పడదు.
ఇక్కడ 36 మంది సంపాదించే ఇల్లంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలూ ఉన్న ఇండియా.
ఒక్కడే సంపాదించే ఇల్లంటే చిన్నదేశం శ్రీలంక.
రెండింటికీ అసలు పోలికే లేదు.
ఇది కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు.
శ్రీనివాసమూర్తి