‘వైసీపీ సర్కారును కూల్చడానికి బీజేపీ నాయకులు నాకు రోడ్ మ్యాప్ ఇస్తానన్నారు. దానికోసం చూస్తున్నాను’ అని ప్రకటించిన పవన్ కల్యాణ్.. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అనే ప్రతిజ్ఞ ద్వారా.. బీజేపీతో కలిసి తాను చంద్రబాబు చంకఎక్కి కూర్చుంటానని ధ్రువీకరించేశారు.
అయితే.. పవన్ ఎలా పోయినా పర్లేదు గానీ.. తమను కూడా జతకలిపి బాబుతో పొత్తు అన్న సంకేతాలు వచ్చేలా.. పవన్ ఏకపక్షంగా ప్రకటించేయడానికి కమలనాధులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనేక కారణాల వలన జగన్ కంటె ఎక్కువగా.. చంద్రబాబును ద్వేషిస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకులు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల గురించి అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సున్నితమైన అంశం కావడంతో.. ఈ వ్యాఖ్యలపై బాహాటంగా ఎవ్వరూ మాట్లాడడం లేదు. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజును అడిగినప్పుడు కూడా.. ఆయన నర్మగర్భంగా.. పవన్ మాటల గురించి సెటైర్లు వేసి తప్పించుకోవడం గమనార్హం.
ఈ విషయంపై సోమువీర్రాజును అడిగినప్పుడు.. తిరుపతిలో జరిగిన పార్టీ సమావేశంలోనే అమిత్ షా.. వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి, జనసేనతో కలిసి 2024లో అధికారంలోకి రావడానికి రోడ్ మ్యాప్ ఇచ్చేశారని చెప్పారు. పవన్ కల్యాణ్ బీజేపీకి చెందిన ఢిల్లీ పెద్దలతో తరచూ మాట్లాడుతూ ఉంటారని సోము అనడం కచ్చితంగా ఆయన మీద సెటైరే!
పవన్ కల్యాణ్.. రాష్ట్రంలోని బీజేపీ నాయకులతో ఎన్నడూ సఖ్యంగా ఉన్నది లేదు! వారితో కలిసి మంతనాలు సాగించింది గానీ.. సంప్రదింపులు చేసింది గానీ.. ప్రభుత్వవ్యతిరేక పోరాటాల్లో వారితో కలిసి అడుగులు వేసినది గానీ లేదు. కాగితాల మీద ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నదే తప్ప.. వారు స్నేహితుల్లాగా ఎన్నడూ వ్యవహరించలేదు.
సాధారణంగా పొత్తు పార్టీలు.. ఈ తరహా ఆవిర్భావ సభ జరిపితే తమ మిత్రపక్షానికి చెందిన కీలక నాయకుల్ని కూడా ఆహ్వానిస్తాయి. కానీ పవన్ వంటి మోనార్క్ నాయకుడి నుంచి అలాంటివి ఆశించలేం. రాష్ట్ర బీజేపీ నాయకులు ఎవ్వరూ తనతో మాట్లాడడానికి తగిన స్థాయి వారు కాదన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తుంటారు.
గతంలో వామపక్షాలతో పొత్తులు పెట్టుకున్నప్పుడు కూడా.. వారిని తన ఆఫీసు బయట సుదీర్ఘకాలం వేచి ఉండేలా నిలబెట్టిన చరిత్ర కూడా పవన్ కల్యాణ్ కు ఉంది. అలాంటి పవన్ కల్యాణ్ తమను మాటమాత్రంగానైనా సంప్రదించకుండానే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ బాబుతో బంధానికి సంకేతాలివ్వడం బీజేపీ వారికి మింగుడుపడడం లేదు.
అందుకే మింగలేక కక్కలేక.. పవన్ కల్యాణ్ మీద వారు లోలోన భగభగలాడిపోతున్నట్టుగా తెలుస్తోంది.