అడిలైడ్ టెస్టు.. ప‌డ‌గొట్టి నిల‌బ‌డ్డ టీమిండియా!

అడిలైడ్ డే అండ్ నైట్ టెస్టులో.. తొలి రోజు భార‌త బ్యాట్స్ మె‌న్ గొప్ప‌గా రాణించ‌క‌పోయే స‌రికి.. రొటీన్ గానే బ్యాట్స్ మెన్ పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కొహ్లీ, ర‌హ‌నే, పూజారా మిన‌హా మిగ‌తా…

అడిలైడ్ డే అండ్ నైట్ టెస్టులో.. తొలి రోజు భార‌త బ్యాట్స్ మె‌న్ గొప్ప‌గా రాణించ‌క‌పోయే స‌రికి.. రొటీన్ గానే బ్యాట్స్ మెన్ పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కొహ్లీ, ర‌హ‌నే, పూజారా మిన‌హా మిగ‌తా వారెవ‌రూ గొప్ప ప్ర‌ద‌ర్శ‌న చూప‌లేదు. అయితే ఆస్ట్రేలియ‌న్ బ్యాట్స్ మెన్ ఆట తీరు చూశాకా.. టీమిండియా బ్యాట్స్ మెన్ ఎంత బాగా ఆడారో అర్థం అవుతుంది. 

బౌన్సీ వికెట్ మీద భార‌త బౌల‌ర్లు ఆసీస్ బ్యాట్స్ మెన్ ను ఆటాడుకున్నారు. ఆసీస్ టాప్ ఆర్డ‌ర్ భార‌త బౌలింగ్ ధాటికి బెంబేలెత్తింది. ప‌రుగులు చేయ‌డానికి అల్లాడింది. తొలి ఇన్నింగ్స్ లో ఖాతా తెర‌వ‌డానికి ఆస్ట్రేలియ‌న్ ఓపెన‌ర్లు ఐదు ఓవ‌ర్ల పాటు వేచి చూడాల్సి వ‌చ్చింది! తొలి నాలుగు ఓవ‌ర్ల‌నూ మెయిడిన్లుగా వేశారు భార‌త బౌల‌ర్లు.

ఆ త‌ర్వాత కూడా ఓవ‌ర్ కు ఒక‌టీ, రెండు ర‌న్నులు చేయ‌డానికి ఆస్ట్రేలియ‌న్ బ్యాట్స్ మెన్ తంటాలు ప‌డ్డారు. క్ర‌మం త‌ప్ప‌కుండా టీమిండియా బౌల‌ర్లు వికెట్ల వేట‌ను కూడా సాగించ‌డంతో.. తొలి ఇన్నింగ్స్ కు సంబంధించి కీల‌క‌మైన ఆధిక్యాన్ని సంపాదించింది టీమిండియా.

తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ 244 ప‌రుగులు చేయ‌గా, ఆస్ట్రేలియా 191 పరుగుల‌కు ఆలౌట్ అయ్యింది. కీల‌క‌మైన 53 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది టీమిండియా. అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భార‌త జ‌ట్టు.. ఆదిలోనే మ‌రోసారి పృథ్వీషా వికెట్ ను పోగొట్టుకుంది.

తొలి ఇన్నింగ్స్ లో రెండో బంతికే క్లీన్ బౌల్డ్ అయిన షా, రెండో ఇన్నింగ్స్ లో కూడా అచ్చం అలాంటి బంతినే డ్రైవ్ చేయ‌బోయి వికెట్ ను పారేసుకున్నాడు. స్థూలంగా ఇప్ప‌టి వ‌ర‌కూ తొలి 62 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది టీమిండియా.

ఆట మూడో రోజు కీల‌కంగా మార‌నుంది. తొలి ఇన్నింగ్స్ త‌ర‌హాలోనే పూజారా, కొహ్లీ, ర‌హ‌నేల మీదే పూర్తి భారం ప‌డ‌నుంది. బౌల‌ర్లు మంచి ఊపు మీద క‌నిపిస్తూ ఉండటంతో.. ఆస్ట్రేలియాకు టీమిండియా ఓ మోస్త‌రు ల‌క్ష్యాన్ని నిర్దేశించినా మిగ‌తా ప‌నిని బౌల‌ర్లు పూర్తి చేసే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం అయితే బోర్డ‌ర్- గ‌వాస్క‌ర్ ట్రోఫీలో తొలి టెస్టు మ్యాచ్ పై భార‌త జ‌ట్టు పై చేయి సాధించింది. ఇదే ప‌ట్టును కొన‌సాగిస్తే.. సీరిస్ లో టీమిండియా శుభారంభం సాధించడం ఖాయం.

తొలి ఇన్నింగ్స్ లో భార‌త బౌల‌ర్ల‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ నాలుగు వికెట్ల‌ను సాధించాడు. ఉమేష్ యాద‌వ్ మూడు, బుమ్రా రెండు వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. న‌లుగురు బౌల‌ర్ల‌తోనే ఆస్ట్రేలియాను టీమిండియా ఆలౌట్ చేయ‌గ‌ల‌గ‌డం గ‌మ‌నార్హం.

ఫెయిల్యూర్ సినిమా…ప్ర‌మోష‌న్ ఎపిసోడ్