ఇండియా-ఆస్ట్రేలియాల మధ్యన టెస్టు సీరిస్ మజా నేటి నుంచి మొదలవ్వబోతోంది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు నేడు మొదలుకానుంది. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం డే-నైట్ టెస్టుగా పింక్ బాల్ తో జరుగుతోంది. ఈ మ్యాచ్ కు సంబంధించి టీమిండియా ఒక రోజు ముందే ఫైనల్ ఎలెవన్ ను ప్రకటించింది.
పృథ్వీషా, మయాంక్ అగర్వాల్ వంటి యంగ్ క్రికెటర్లు టీమిండియా ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్నారు. కీపర్ గా వృద్ధిమాన్ సాహాకు అవకాశం లభించింది. బుమ్రా, షమీ, ఉమేష్ యాదవ్ లు పేస్ బలగంలో ఉన్నారు.
సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఈ మ్యాచ్ లో అవకాశం లభించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ఈ సీరిస్ లో ఈ మ్యాచ్ మాత్రమే ఆడతాడు. తదుపరి మ్యాచ్ లకు కొహ్లీ దూరం కానున్నాడు. తన భార్య ప్రసవం నేపథ్యంలో సెలవు తీసుకున్నాడు కొహ్లీ.
కొహ్లీ దూరం కావడంతో సీరిస్ మజా కొంత వరకూ తగ్గుతుందని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఆస్ట్రేలియా పిచ్ లపై ఇండియా, ఆసీస్ లు టెస్టుల్లో తలపడితే చూడటం సగటు క్రికెట్ అభిమానికి అదెంతో వినోదం. బలాబలాలను బట్టి చూస్తే.. ఆసీస్ తో భారత్ ధీటుగా తలపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఎన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ లు వచ్చినా టెస్టు క్రికెట్ మజా కోల్పోలేదంటే.. ఇలాంటి సీరిస్ లే అందుకు కారణం. గత పర్యాయం ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సీరిస్ ను గెలుచుకుని వచ్చిన టీమిండియా ఈ సారి ఎలాంటి సత్తా చూపిస్తుందో!