నివర్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జనసేనాని పవన్‌కల్యాణ్ ఎట్టకేలకు నడుం బిగించారు. ఈ మేరకు ఆయన బుధవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పంట పొలాలను పవన్ పరిశీలించారు.
నివర్ తుపాను దెబ్బకు పంటలు నష్టపోయిన రైతాంగం వెతలు విని పవన్ చలించిపోయారు. కర్షకుల కష్టనష్టాలను, కన్నీళ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల వచ్చిన తుపాను రైతులను నిలువునా ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉదారంగా సాయం అందించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. చేతికంది వచ్చిన పంట నీళ్లపాలు కావడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు.
అండగా ఉండేందుకే ఇక్కడికి వచ్చానని రైతులతో అన్నారు. అయితే ప్రకృతి వైపరీత్యాలను రాజకీయం చేసే ఉద్దేశం ఎంత మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నేతను కాదని ఆయన తెలిపారు.
ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పండించిన పంట మొత్తం దెబ్బతిందని, కావున ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల కన్నీళ్లు మన దేశానికి మంచిది కాదని పవన్ కల్యాణ్ అన్నారు.