అధిష్టానం అసమర్ధతకు ఇదొక మచ్చుతునక!

కాంగ్రెస్ పార్టీ అంటేనే ముఠాలకు కేరాఫ్ అడ్రస్. రాష్ట్రాలలో గాని, జాతీయ స్థాయిలో గాని ఆ పార్టీలో పరిణామాలను ముఠాలే నిర్దేశిస్తుంటాయి. సాధారణంగా కాంగ్రెస్ అధిష్టానం ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ పేరుతో ముఠాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది.…

కాంగ్రెస్ పార్టీ అంటేనే ముఠాలకు కేరాఫ్ అడ్రస్. రాష్ట్రాలలో గాని, జాతీయ స్థాయిలో గాని ఆ పార్టీలో పరిణామాలను ముఠాలే నిర్దేశిస్తుంటాయి. సాధారణంగా కాంగ్రెస్ అధిష్టానం ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ పేరుతో ముఠాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. తద్వారా ఏ ఒక్క నాయకుడు కూడా అతిబలవంతుడిగా తయారు కాకుండా ఒక వ్యూహాన్ని అనుసరిస్తుంటుంది. అయితే ఇలాంటి వక్రవ్యూహాలు ఆ పార్టీకి చేటు చేసేలా అనేక పరిణామాలు  జరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ రాజకీయాలలో ముఠాలకు సర్ది చెప్పలేని కాంగ్రెస్ అధిష్టానం అసమర్ధత స్పష్టంగా బయటపడింది.

ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అశోక గహలోత్, మరో సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉన్నదనే సంగతి అందరికీ తెలిసిందే. గతంలో అశోక్ గహలోత్ కు వ్యతిరేకంగా తన వర్గం ఎమ్మెల్యేలతో రాజీనామాలకు కూడా సచిన్ పైలెట్ సిద్ధపడిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే జరిగితే ప్రభుత్వమే కుప్పకూలిపోతుంది కనుక అప్పట్లో అధిష్టానం కాస్త చొరవ చూపింది. తాజా పరిణామాలలో రాష్ట్ర ప్రభుత్వ తీరునకు వ్యతిరేకంగా సచిన్ పైలట్ ఒకరోజు దీక్షకు కూర్చుంటే దానిని అధిష్టానం అడ్డుకోలేకపోయింది.

గతంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిన అవినీతి పనుల మీద విచారణ జరిపించాలని డిమాండ్తో సచిన్ పైలెట్ నిరాహార దీక్ష చేశారు. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిణామం. సొంత ప్రభుత్వాన్ని ధిక్కరించి దీక్ష చేయవద్దు అని అధిష్టానం హితవు చెప్పే ప్రయత్నం చేసింది గాని పైలట్ ఖాతరు చేయలేదు.

అయితే పార్టీ మీద తిరుగుబాటు చేసిన సచిన్ పైలెట్ ను తెర వెనుక నుంచి భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా నడిపిస్తున్నదని ఆరోపించడానికి కూడా కాంగ్రెస్కు అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన గత బిజెపి సర్కారు అవినీతి మీదనే విచారణ కోరుతూ దీక్ష చేశారు. ఆయన దీక్ష సాధించగల ఫలితం ఏమిటి అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలోని లుకలుకలు., వాటిని కట్టడి చేయలేని అధిష్టానం అసమర్థత బయటపడుతున్నాయని పలువురు భావిస్తున్నారు.

మరో ఏడాదిలోనే రాజస్తాన్ లో కూడా ఎన్నికలు జరగబోతున్న తరుణంలో.. పార్టీలో దారుణంగా ఉన్న అనైక్యత రోడ్డున పడడం పార్టీకి మంచి సంకేతం కాదు.  మరి ఈ పరిస్థితుల్ని వారు ఎలా చక్కదిద్దుకుంటారో చూడాలి.