సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జితో పాటు పలువురు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సుప్రీం చీఫ్ జస్టిస్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాయడం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.
జగన్ ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అత్యంత నీతిపరులైన రిటైర్డ్ జడ్జిలతో విచారణ జరిపించి , నిజానిజాలను నిగ్గు తేల్చాలని పలువురు న్యాయ కోవిదులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇదే సందర్భంలో న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు చేయడమే కాకుండా సంబంధిత వివరాలను మీడియాకు వెల్లడించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్యాసనానికి జస్టిస్ లలిత్‌కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే వాది, ప్రతివాదుల్లో ఒకరి తరపు గతంలో తాను వాదించినందున ప్రస్తుతం విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ లలిత్‌కుమార్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో మరో ధర్మాసనానికి దీనిని ప్రధాన న్యాయమూర్తి బదిలీ చేస్తారని జస్టిస్ లలిత్‌కుమార్ వెల్లడించారు. జగన్‌పై దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు వస్తున్న సమాచారం తెలియడంతో, ఏమవుతుందోననే ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్‌లో నెలకున్న సంగతి తెలిసిందే.
అయితే విచారణ నుంచి జస్టిస్ లలిత్ తప్పుకోవడం జగన్ కేసులో ట్విస్ట్‌గా చెప్పొచ్చు. జగన్ ఫిర్యాదు, వాటి వివరాల వెల్లడిపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు కోసం మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.