ఎవరూ ఆపకున్నా, మనల్ని ఎవర్వా ఆపేది అంటూ హుంకరించే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు భలే కౌంటర్ అన్నట్లుగా సవాలు విసిరారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయండి అంటూ చంద్రబాబుకు, పవన్ కు జగన్ బహిరంగంగా సవాలు విసిరారు.
నిజానికి ఇలా సవాలు విసరడాన్ని మరోలా కూడా జనం కామెంట్ చేయవచ్చు. పవన్-బాబు కలిసి వస్తే తనకు ఇబ్బంది అని జగన్ ఇలా సవాలు చేస్తారు అని కూడా అనొచ్చు. కానీ ఇది ఒక విధంగా సైకలాజికల్ డీలింగ్ అనుకోవాలి.
జగన్ ను ఒంటరిగా ఢీకొనడానికి బాబు లేదా పవన్ కు సత్తా చాలడం లేదు అని భావనను బలంగా జనంలోకి పంపడం దీని వెనుక ఒక ఆలోచన. రెండవది ‘మనల్ని ఎవర్రా ఆపేది’ అని పదే పదే హుంకరించే పవన్ ను, ఆపడం కాదు, ముందుకు రాగలవా ఒంటరిగా అనే సవాలును విసిరినట్లు అవుతుంది.
జగన్ దగ్గర ఓ ప్లస్ పాయింట్ వుంది. జనం ముందుకు వస్తే వారికి గురి కుదిరేలా మాట్లాడడం వచ్చు. అవే జగన్ మాటలను అక్షరాల్లో రాస్తే వేరు. జగన్ నోట వింటే వేరుగా వుంటాయి. జనాల మీద దాని ప్రభావం గట్టిగానే వుంటుంది. 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అని అడిగాడు తప్ప పొత్తులేకుండా రండీ అని అనలేదు. 175 స్థానాల్లో పోటీ చేయగలిగే దమ్ముందా అని అనడంలోనే పొత్తు లేకుండా రాగలరా అనే సవాలు దాగి వుంది.
బాబు లాంటి అనుభవం పండిన రాజకీయ నాయకులు జగన్ సవాలును తేలికగా తీసుకుంటారు. కానీ పవన్ లాంటి వాళ్లు మాత్రం కాస్త ఫీల్ కావడం తథ్యం. పార్టీ పెట్టి, అభిమానులు అనేవారి అండ వుండి, ఒంటరిగా పోటీ చేయలేకపోతున్నాననే బాధ వెంటాడుతూ వుంటుంది ఇలాంటి మాటలు విన్నపుడల్లా. అక్కడ సైకలాజికల్ గా దెబ్బపడుతూ వుంటుంది.
ఇలా సవాలు విసరడం ద్వారా జగన్ తన సత్తాను తాను చెప్పకనే చెప్పుకుంటున్నారు. అది కూడా జనాలను ప్రభావితం చేయడంలో ఓ భాగమే.