అనగనగా అందాల పోటీలో నెగ్గిన ఒక సుందరి. అందానికి ఒక నిర్వచనంలా ఉంటుంది. చలాకీ పిల్ల కూడా. దీంతో నటన సాధ్యమైంది. బాలీవుడ్ వంటి బిగ్ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. పెద్దగా హిట్లు దక్కకపోయినా దేశ వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్న సినిమాల్లో అవకాశాలతో.. మంచి గుర్తింపు లభించింది.
భారీ పారితోషికాలు, మోడలింగ్, ఐటమ్ సాంగ్స్.. ఇలా చేతినిండా సంపాదననే కలిగి ఉంది. మరి ఇంత క్రేజ్ ఉన్న ఆమెకు మేల్ ఫ్యాన్స్ ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అలాంటి ఫ్యాన్స్ లో ఆమెను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించే వాళ్లూ ఉండకపోరు.
మరి ఆ ఇంప్రెస్ చేయడం ఒక్కోరి రేంజ్ ఒక్కోరిది. ఈ క్రమంలో ఒకడు ఆమెను గిఫ్ట్ లతో ఇంప్రెస్ చేయడం మొదలుపెట్టాడు. ఇది కూడా చాలా మంది మగాళ్లు చేసే పనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడదాన్ని ఆకట్టుకోవడానికి ఆమెకు బహుమతులతో ఎర వేయడం సృష్టి రహస్యం లాంటిది.
మరి ఈ బహుమతులకు పడని వారు ఉండరని అనలేం కానీ, పూరీజగన్నాథ్ సినిమా బిజినెస్ మ్యాన్ లో హీరో చెప్పే మాటనూ విస్మరించలేం! అత్యంత ఖరీదైన కారును తనకు నచ్చిన అమ్మాయికి గిఫ్ట్ గా ఇస్తాడు అందులో హీరో. వెంటనే ఆమె ఐలవ్యూ చెబుతుంది. అలాంటి కారు ఇస్తే.. ఎవత్తైనా ఆ మాట చెబుతుందని హీరో మొహం మీదే అంటాడు.
ఆ సంగతలా ఉంటే.. కాదనలేనంత స్థాయి పెద్ద గిఫ్ట్ వస్తే కాదనడం ఎవరికైనా కష్టమే! ఇలాంటి గిఫ్ట్ లు ఇచ్చే వాడికి జాక్వెలిన్ కూడా పడిపోయింది. అసలే తనది కాని దేశంలో ఉంటోంది. హీరోయిన్ కెరీర్ అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమే. ఆమెకు విలువలూ, నైతిక విలువలూ అంటూ క్లాసులు వద్దు. ఆమె ఇండియన్ కూడా కాదు. అంటే శ్రీలంకన్లకు విలువలుండవని కాదు కానీ, ఇక్కడ నైతిక విలువల ప్రస్తావన అనవసరం!
అతడితో ఆమె డేటింగ్ చేసిందా, ప్రేమించిందా, వారి బంధం మరోటా.. అనేది కూడా చర్చ కాదు. అతడు ఇచ్చాడు ఆమె తీసుకుంది. అభిమాని అంటూ ఇచ్చాడనే అనుకుందాం. మరి అతడు ఎలా సంపాదించాడు? అనేది ఆమెకు సంబంధం ఉన్న అంశమా? అతడు మోసగాడో, చీటరో, మనీ లాండరింగ్ చేశాడో.. మరోటి చేశాడో.. అవన్నీ ఆమెకు తెలిసే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు.
అయితే ఇప్పటికే జాక్వెలిన్ ఈడీ ఆఫీసు చుట్టూ తిరిగింది. అతడితో ఆమెకు ఉన్న బంధం ఏమిటనే అంశం గురించి కూడా ఈ కేసులో చర్చ జరుగుతూ ఉంది. ఈడీ చార్జిషీటును దాఖలు చేసిన తర్వాత ఆమె విదేశానికి వెళ్లాలని చూసినా అనుమతి లభించలేదు.
మరోసారి ఆమెకు ఈడీ సమ్మన్స్ జారీ చేయవచ్చని మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఈ మధ్య బాలీవుడ్ జనాల కేసుల్లో మీడియానే ముందుగా సమ్మన్లను జారీ చేసేస్తూ ఉంటుంది. విచారణ సంస్థల కన్నా.. హిందీ మీడియానే ఎక్కువగా తారలను ఇంటరాగేట్ చేస్తోంది.
మరి అలాంటి కేసుల్లో ఇదీ ఒకటిగా తేలిపోతుందా? లేక అతడి మోసంలో ఆమెకు కూడా వాటా ఉందని విచారణ సంస్థలు తేలుస్తాయా? ఇప్పుడప్పుడే తేలే అంశాలు కాకపోవచ్చు. ఆర్యన్ ఖాన్ కేసు తర్వాత.. హిందీ మీడియాకు మాత్రం మరో మసాలా లభించింది!