శ్రీశ్రీ కేవలం రెండక్షరాలు. అతని గీతాలు మాటలు కావు. నిత్యం జ్వలించే మంటలు. పదునెక్కిన కత్తులు, ఈటెలు. ఆ శబ్దాలు రణన్నినాదాలు. మరో ప్రపంచపు కంచునగారాను వినిపించిన శబ్దయోధుడు శ్రీశ్రీ. ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతించే వైతాళికుడు శ్రీశ్రీ. ఎర్రబావుటా నిగనిగలను కాంచగలిగిన దార్శనికుడు శ్రీశ్రీ. తన గీతాలతో ఒక తరాన్ని ఊగించి, శాసించి, ముందుకు నడిపించిన యుగకర్త శ్రీశ్రీ. మరో ప్రపంచాన్ని స్వప్నించిన మహాకవి శ్రీశ్రీ. అలాంటి శ్రీశ్రీ మహాప్రస్థానం గీతాలతో ప్రభావితమైన ఒక తరం క్రమంగా కనుమరుగవుతోంది.
ఆ గీతాలను తరువాతి తరానికి అందివ్వడానికి యువత జేబులో పట్టేలా ఇదిగో ఇలా మీముందుకు వస్తోంది. గురజాడ వర్ధంతి సందర్భంగా మంగళవారం తిరుపతిలో 'మానవ వికాస వేదిక ' పై నుంచి తెలుగు సాహితీ దిగ్గజం, తొంభై రెండేళ్ళ వేల్చేరు నారాయణ రావు చేతుల మీదుగా యువతరానికి మహాప్రస్థానం మావో రెడ్‌బుక్ సైజులో అందబోతోంది.
మహాప్రస్థానం ఒక తుఫాను. యువతను ఊగించే సునామీ. సుడిగాలిలా గిరాగిరా తిప్పేసే టోర్నడో. 70 ఏళ్ళ క్రితమే ఇది అచ్చయింది. లెక్కలేనన్ని సార్లు పునర్ముద్రణ పొందింది. నిన్న గాక మొన్న చేటంత (కాపీ టేబుల్ ) సైజులో వచ్చి అలరించింది.
మహాప్రస్థానానికి మళ్ళీ ఎంత మహర్దశ! తిరుపతిలోని కృష్ణాపురం ఠాణా నుంచి, అంబేద్కర్ విగ్రహం వరకు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఊరేగింపు. మంగళవారం ఉదయం తొమ్మిదిన్నరకు అంబేద్కర్ విగ్రహం నుంచి ఉదయీ ఇంటర్నేషనల్ వరకు పల్లకీలో మహాప్రస్థానం ఊరేగింపు. భూమన్ అధ్యక్షతన జరిగే ఈ ఆవిష్కరణ సభలో వేల్చేరు నారాయణ రావుతో పాటు ప్రముఖ కవి శివారెడ్డి , మానవ వికాస వేదిక గౌరవాధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి తదితరులు పాల్గొంటారు.
ఈ మొత్తం వెనుక సాకం నాగరాజ, శైలకుమార్‌ల కనపడని కృషి. మహాప్రస్థానం గీతాలు మార్క్స్, ఎంగెల్స్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక సారాంశానికి తెలుగు కవిత్వీకరణ లా అనిపిస్తుంది. కానీ, ఈ గీతాలు రాశాకనే శ్రీశ్రీ ఆ ప్రణాళికను చదివాడు. మహా ప్రస్థానం గీతాలను శ్రీశ్రీ 1933-47 మధ్యరాశాడు.
మహాప్రస్థానం 1950లో తొలిసారిగా అచ్చయింది. ప్రపంచంలో 1930-40 మధ్య కాలాన్ని 'హంగరీస్ థర్టీస్' అంటారు చరిత్ర కారులు. రష్యా తప్ప ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న రోజులు. రెండవ ప్రపంచ యుద్ధానికి రిహార్సల్స్‌గా సాగిన అంతర్ యుద్ధం. అప్పుడే ఇంగ్లాండులో ప్రోగ్రెసివ్ రైటర్స్ మానిఫెస్టో వచ్చింది. ఈ నేపథ్యంలోనే మహాప్రస్థానం గీతాలు శ్రీశ్రీ హృదయం నుంచి ప్రవాహంలా వచ్చిపడ్డాయి.
ఛందస్సులను ఛట్‌ఫట్ మని తెంచేశాడు. వ్యాకరణాల సంకెళ్ళను తెంచుకున్నాడు. నేను సైతం లో గణబద్ద ఛందస్సుకు స్వస్తి చెప్పి, గురజాడ అడుగు జాడను అనుసరించాడు. మహాప్రస్థానంతో సామాజిక రుగ్మతల వేగాన్ని శ్రీశ్రీ తగ్గించాడు. ఈ రుగ్మతలు పూర్తిగా పోవడానికి శస్త్ర చికిత్స అవసరమన్నాడు.
దానినే విప్లవం అన్నాడు శ్రీశ్రీ. నిన్న ఒదిలిన పోరాటం నేడు అందుకొనక తప్పదని యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పాడు. శ్రీశ్రీ ఎప్పుడూ తటస్థంగా లేడు. జీవిత ప్రవాహానికి దూరంగా గట్టున కూర్చో లేదు
కరడుగట్టిన సంప్రదాయవాది విశ్వనాథను సైతం ' కవితా ఓ కవితా ' కదిలించేసింది. మరే భాషలో నూ ఇంత గొప్ప కవిత రాలేదు. ఇది శ్రీశ్రీ సొంత గొంతుక, సొంత దస్తూరి. నిజానికి శ్రీశ్రీ గీతాలు ఒట్టి అక్షరాలు కావు. అవి బాధలు, ఉద్రేకాలు, యుద్ధాలు. మహాప్రస్థానం అంటే సామ్యవాద ప్రపంచం వైపు చేసే ప్రయాణం.
ఈ గీతాలలో శ్రీశ్రీ వాడిన అనేక పదాలకు అర్థాలు చాలా మందికి తెలియవు. ఆ ప్రవాహం వారిని లాక్కెళ్ళిపోతుంది. ఆ ఊపు అర్థం కాని పదాలను కూడా వారికి అర్థమయ్యేలా చేస్తుంది. ఈ చిన్న సైజు మహాప్రస్థానంలో చాలా పదాలకు అర్థాలిచ్చారు.
చెలం అన్నట్టు ఈ వృద్ధ ప్రపంచానికి శ్రీశ్రీ నెత్తురు, కన్నీళ్లు కలిపి తయారు చేసిన కొత్త టానిక్ మహాప్రస్థానం. కొత్త రక్తాన్ని కదను తొక్కించిన సంగీతం.
రాబంధుల రెక్కల చప్పుడు' పయోధర ప్రచండ ఘోషం' ఝంఝానిల షడ్జ ధ్వానం విని తట్టుకోగలిగే శక్తి, చావ ఉంటేనే ఈ పుస్తకాన్ని తెరవండి అంటాడు చెలం.
-రాఘవ శర్మ