మూడు రాజధానులకు మద్దతుగా, ప్రస్తుత రాజధాని ప్రాంత వాసైన ఓ కానిస్టేబుల్ రాజీనామా చేయడం ఆశ్చర్యపరుస్తోంది. మంగళగిరి మండలం కురగల్లుకు చెందిన బసవరావ్ విశాల దృక్పథంతో ఆలోచించడం ప్రశంసలు అందుకుంటోంది. మూడు రాజధానుల వ్యవస్థతో అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ సాధ్యమవుతుందని, ఆ ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుత రాజధాని ప్రాంతానికి చెందిన వ్యక్తి మూడు రాజధానులకు మద్దతుగా…ఇంకా పదేళ్లు సర్వీస్ ఉండగానే ముందుకు రావడం ప్రాధాన్యం సంతరించుకొంది.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని హుమయున్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆయన కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అమరావతి పేరుతో నాటి సీఎం చంద్రబాబు భూములను బలవంతంగా లాక్కొన్నందుకు, అలాగే ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులకు మద్దతుగా చట్టాలు తేవడానికి మద్దతుగా తాను ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు.
కనీసం పోలీస్ కానిస్టేబుల్ త్యాగం చూసైనా చంద్రబాబులో రోషం పుట్టుకు రావాలని వైసీపీ శ్రేణులు హితవు చెబుతున్నారు. నిజంగా అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని చంద్రబాబు నమ్ముతుంటే తన పార్టీ ఎమ్మెల్యే లతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
అలాగే కానిస్టేబుల్‌ను చూసైనా చంద్రబాబు తనతో పాటు తన పార్టీ సభ్యులతో రాజీనామా చేసేందుకు ముందుకు రావాలని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. రాజధాని ప్రాంతవాసే పదేళ్ల సర్వీసును కాదనుకుని మూడు రాజధానులకు మద్దతు తెలి పారని, అలాంటిది మూడున్నరేళ్ల పదవి కోసం చంద్రబాబు అంతగా భయపడడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.