వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్షుడవుతాడా?

రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయినట్టుగా భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్షుడవుతాడా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ.  Advertisement అమెరికాలో పరిస్థితి ఎలా ఉన్నా ఇండియాలో మాత్రం అగ్రరాజ్యంలో “రామ”రాజ్యం…

రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయినట్టుగా భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్షుడవుతాడా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ. 

అమెరికాలో పరిస్థితి ఎలా ఉన్నా ఇండియాలో మాత్రం అగ్రరాజ్యంలో “రామ”రాజ్యం రాబోతోందని రామస్వామి  గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేస్తూ పలు మీడియా కథనాలొస్తున్నాయి. గెలుపు సంగతి తర్వాత, ముందుగా ప్రెసిడెన్షియల్ కేండిడేట్ గా ఎంపిక కావాలికదా! 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం రామస్వామి స్థానమెక్కడుందో చూద్దాం. 

అమెరికాలో జరగనున్న 2024 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ఎవరు నిలబడబోతున్నారన్నది ప్రస్తుత చర్చ. 

డొనాల్డ్ ట్రంప్ కి తాను తప్ప మరొకరెవరూ నిలబడకూడదని ఉంది. కానీ ట్రంప్ పై కేసుల నేపథ్యంలో అతను ఆ సమయానికి జైల్లో గడపాల్సొస్తుందని ఎక్కువమంది అభిప్రాయం. 

అదే జరిగితే ఛాన్స్ నాక్కావాలంటే నాక్కావాలంటూ రిపబ్లికన్ పార్టీనుంచి పలువురు సీన్లోకొచ్చారు. 

వీరిలో మొదటిగా వినిపించిన పేరు ఫ్లోరిడా గవర్నర్ డిసాంటిస్. 

ఆ తర్వాత సిఖ్ కుటుంబానికి చెంది భారతీయ తల్లిదండ్రులకి జన్మించిన నిక్కి హేలీ రేసులో నిలబడింది. 

వీరితో పాటూ ట్రంప్ వద్ద ఉపాధ్యక్షుడిగా చేసిన మైక్ పెన్స్ కూడా బరిలో నిలబడ్డాడు. 

సౌత్ కేరోలినాకి చెందిన సెనేటర్ టిం స్కాట్ కూడా క్రమంగా ముందుకొచ్చాడు. 

వీరందరి మధ్యన తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన 38 ఏళ్ల వివేక్ గణపతి రామస్వామి కూడా రంగంలోకి దిగాడు. 

అయితే ఈ పేర్లు బయటికొచ్చిన వెంటనే రిపబ్లికన్ పార్టీకి చెందిన వారిలో ట్రంపే మళ్లీ నిలబడాలని కోరుకున్నవారు 52% ఉంటే, డిసాంటిస్ కి 18% మద్దతు తెలిపారు. మైక్ పెన్స్ కి 7%, నిక్కి హేలీకి 7%, వివేక్ రామస్వామికి కేవలం 6% మంది మాత్రమే మద్దతు తెలిపారు. 

అయితే రకరకాల ప్రసంగాల ద్వారా, డిబేట్స్ ద్వారా ఎంత ఆకట్టుకుంటున్నా నిజానికి రేసులో వెనకబడే ఉన్నాడు రామస్వామి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ (జీ.ఓ.పి) గా పిలవబడే రిపబ్లికన్ పార్టీ సభ్యులు తాజాగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ లిష్టులో ట్రంప్ కి మొదటి స్థానమిచ్చి, వివేక్ రామస్వామికి ఆఖరి స్థానమిచ్చారు. మిగిలిన అభ్యర్ధులు ఈ ఇద్దరి మధ్యలో ఉన్నారు. 

డిబేట్లు, స్పీచులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలు మారుతూ ఉంటాయి. అది వేరే విషయం. 

అయితే ఇక్కడ రామస్వామి మాట్లాడే మాటల్లో అతని ఉద్దేశ్యమేమిటో అర్ధమైన వాళ్లకి అర్ధమయింది. “ఎయిం ఎట్ స్కై..యూ రీచ్ ట్రీ టాప్” అంటారు. ఆకాశానికి ఎగరే ప్రయత్నం చేస్తే కనీసం చెట్టు మీదకన్నా చేరొచ్చు. ఇక్కడ రామస్వామి దృష్టి అధ్యక్ష పదవి మీదే అన్నట్టుగా ఉన్నా, అతని కనీస లక్ష్యం ఉపాధ్యక్షుడవడం. 

అధ్యక్ష బరిలో ఉన్నట్టే కనిపిస్తున్నాడు. కానీ మిగిలిన అభ్యర్థుల్లా కాకుండా తాను ట్రంపుని అస్సలు విమర్శించడం లేదు. పైగా తానంటూ ప్రెసిడెంటైతే ట్రంప్ మీద ఉన్న కేసులన్నీ తీసి అవతల పారేయిస్తానంటున్నాడు. ట్రంప్ మీద తనకున్న గౌరవాన్ని, ఇష్టాన్ని బహిరంగంగా చాలా ఎమోషనల్ గా చెబుతున్నాడు. 

దీనికి తోడు ట్రంప్ కూడా రామస్వామి టేలెంట్ ని, తెలివిని ఎనెర్జీ లెవిల్స్ ని, క్లారిటీని, నాయకత్వ లక్షణాల్ని కొనియాడుతున్నాడు. పార్టీలో ఇతర పోటీదారుల్ని చూస్తున్నట్టుగా వివేక్ ని ట్రంప్ చూడట్లేదు.

ఇక్కడ రామస్వామి తెలివితేటల్ని మెచ్చుకోవాలి. లీగల్ గొడవల్ని అధిగమించి ట్రంప్ నిలబడితే గెలుపు ఖాయం. రిపబ్లికన్ పార్టీ వేవ్ అలాగుంది ఇప్పుడు. అదే జరిగితే రామస్వామి కచ్చితంగా వైస్ ప్రెసిడెంట్ అయిపోయి ట్రంప్ పక్కన దేశంలో నెంబర్-2 స్థానంలో బతికేయొచ్చు. 

ఒకవేళ ఏ కారణం చేతనైనా ట్రంప్ నిలబడలేని పరిస్థితి వస్తే అప్పుడు కచ్చితంగా ట్రంప్ తన పూర్తి సపోర్ట్ ని వివేక్ రామస్వామికే ఇస్తాడు. ఎందుకంటే మిగిలిన కేండిడేట్స్ ట్రంప్ కుర్చీని లాక్కోవాలని చూస్తున్న వాళ్లు. డిసాంటిస్ ఎప్పుడూ ట్రంపుని విమర్శిస్తున్నాడు. మైక్ పెన్స్ అయితే ట్రంప్ కి బద్ధవిరోధి అయిపోయాడు. స్కాట్, హేలీలు కూడా ట్రంప్ వ్యతిరేకులే. కానీ రామస్వామి మాత్రం ట్రంప్ కి విధేయుడిగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. రిపబ్లికన్ పార్టీ సభ్యుల్లో అధిక శాతం మంది ట్రంప్ కి విధేయులుగా ఉన్నవారే అని లభిస్తున్న మద్దతు శాతాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి తోడు ఎలాన్ మస్క్ లాంటి కుబేరులు కూడా ట్రంప్ వైపే ఉన్నారు. 

ఆ రకంగా అందరికంటే వెనుక బడి ఉన్నా, లెక్కకి అందరికంటే ముందున్నట్టుగా కనిపిస్తున్నాడు వివేక్ రామస్వామి. ఈ సౌత్ ఇండియన్ తెలివితేటల్ని అర్ధం చేసుకున్నవాళ్లు రామస్వామిని శభాష్ అంటున్నారు. 

ఎన్నికలకి ఇంకా చాలా సమయముంది. ఈలోగా ఇంకెన్ని మార్పులొచ్చి వివేక్ రామస్వామి స్థానం ఎక్కడికెళ్తుందో చూడాలి. 

ప్రస్తుతానికి మాత్రం వినాయకచవితి కథలో వినాయకుడు శివానుగ్రహం సంపాదించి తనకంటే బలవంతుడైన కుమారస్వామికే టెన్షన్ పెట్టినట్టు, ఇక్కడ రామస్వామి ఏకంగా ట్రంప్ అనుగ్రహం సంపాదించి డిసాంటిస్ ని దెబ్బకొట్టే పనిలో ఉన్నాడు. 

శ్రీనివాసమూర్తి