ప్రభాస్ మంచి భోజనప్రియుడనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి చాలాసార్లు చెప్పుకొచ్చాడు కూడా. ఒక్కోసారి 'ఛీట్ మీల్ ప్రొగ్రామ్'లో కూర్చుంటే.. 20-25 వెరైటీలు కూడా లాగించేస్తాడని రాజమౌళి గతంలో తెలిపాడు. మరి ఇన్ని వెరైటీలు తినే ప్రభాస్ కు ఇష్టమైన వంటకం ఏంటి? ఇప్పుడు దీనికి సమాధానం దొరికింది.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క ఓ చెఫ్ గా కనిపించనుంది. కాబట్టి ఈ సినిమా ప్రమోషన్ కోసం రెసిపీ ఛాలెంజ్ ప్రవేశపెట్టారు.
ముందుగా అనుష్క తనకు ఇష్టమైన వంటకాన్ని చెప్పి, దాన్ని ఎలా వండాలో వివరించింది. అదే టైమ్ లో ప్రభాస్ కు రెసిపీ ఛాలెంజ్ విసిరింది. ఈ సందర్భంగా తనకు ఎంతో ఇష్టమైన వంటకాన్ని బయటపెట్టాడు ప్రభాస్.
“స్వీటీ నాకు దశాబ్దాలుగా తెలిసినా, తనకు ఇష్టమైన రెసిపీ ఏంటో నాకు తెలియదు. ఇన్నాళ్లకు నాకు తెలిసింది. నాకు ఇష్టమైన రొయ్యల పులావ్ ను తయారుచేయడం ఎలాగో ఇప్పుడు మీరు తెలుసుకోండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు రెసిపీ ఛాలెంజ్ విసురుతున్నాను. నా అభిమానులంతా తమకు ఇష్టమైన వంటకాల్ని నాతో పంచుకోండి.”
ఇలా తనకు రొయ్యల పులావ్ ఇష్టమనే విషయాన్ని బయటపెట్టాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ రెసిపీ ఛాలెంజ్ కాన్సెప్ట్ బాగానే వర్కవుట్ అవుతోంది. అందరు హీరోల ఫ్యాన్స్ ను కనెక్ట్ చేస్తూ, సినిమాకు ప్రచారం కల్పించడం మంచి ఎత్తుగడ. అయితే కాస్త ముందుగా స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పటికే లేట్ అయింది.