ఏడేళ్ల కిందట చనిపోయింది, ఇప్పుడు తిరిగొచ్చింది

“ఒక నిర్దోషిని అమాయకంగా కేసులో ఇరికిస్తారు. అతడికి జైలు శిక్ష కూడా వేస్తారు. కానీ హీరో మాత్రం ఒప్పుకోడు. పోలీస్ వ్యవస్థకు ఎదురెళ్లి తనే స్వయంగా ఎంక్వయిరీ మెదలుపెడతాడు. నిర్దోషిని జైలు నుంచి రిలీజ్…

“ఒక నిర్దోషిని అమాయకంగా కేసులో ఇరికిస్తారు. అతడికి జైలు శిక్ష కూడా వేస్తారు. కానీ హీరో మాత్రం ఒప్పుకోడు. పోలీస్ వ్యవస్థకు ఎదురెళ్లి తనే స్వయంగా ఎంక్వయిరీ మెదలుపెడతాడు. నిర్దోషిని జైలు నుంచి రిలీజ్ చేయిస్తాడు.” సినిమాల్లో మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. నిజజీవితంలో సామాన్యులు ఇలాంటి సాహసాలు చేయలేరు.

కానీ ఉత్తర ప్రదేశ్ కు చెందిన  ఓ మహిళ మాత్రం సినీ ఫక్కీలో సాహసం చేసింది. ఓ హత్య కేసుపై తనే స్వయంగా దర్యాప్తు చేసింది. అకారణంగా శిక్ష అనుభవిస్తున్న తన కొడుకును విడిపించుకుంటోంది.

ఇంతకీ ఏం జరిగింది..?

అలీగఢ్ కు చెందిన 15 ఏళ్ల బాలిక 2015లో కనిపించకుండాపోయింది. దీనిపై  బాలిక తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. విష్ణు అనే కుర్రాడిపై అనుమానంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కొన్నాళ్లకు ఆగ్రాలో ఓ బాలిక హత్యకు గురైంది. అది తన కూతురేనని అదృశ్యమైన బాలిక తల్లి స్టేట్ మెంట్ ఇచ్చింది. దీంతో కుర్రాడిపై హత్య కేసు నమోదైంది.

ఈ కేసులో విష్ణు పూర్తిగా కూరుపోయాడు. సాక్ష్యాలన్నీ అతడికి వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో కోర్టు అతడికి జైలుశిక్ష విధించింది. అయితే కోర్టు ప్రొసీడింగ్స్, కేసు విచారణపై మొదట్నుంచి అనుమానం వ్యక్తం చేస్తోంది విష్ణు తల్లి. నిజానిజాలు వెలికితీసేందుకు తనే స్వయంగా రంగంలోకి దిగింది. ఒక్కొక్కటిగా ఆధారాలు సేకరించే పనిలో పడింది.

ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో చనిపోయిందనుకున్న యువతి, విష్ణు తల్లి కంటపడింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసింది తల్లి. రంగంలోకి దిగిన పోలీసులు 22 ఏళ్ల యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును నిగ్గుతేల్చేందుకు యువతి, ఆమె తల్లిదండ్రులపై డీఎన్ఏ ప్రొఫైలింగ్ చేస్తున్నారు.

ఏడేళ్ల కిందట తప్పిపోయిన బాలికను తానేనని, తను చనిపోలేదని సదరు యువతి పోలీసులకు చెప్పింది. అయితే డీఎన్ఏ రిపోర్టు వచ్చిన తర్వాతే ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలని పోలీసులు నిర్దారించుకున్నారు.