ప్రధాని రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు వస్తున్నారు. పదకొండో తేదీన ఏపీలోని విశాఖపట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.12 న తెలంగాణలోని రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. కానీ మోడీ పర్యటన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు భిన్న దృశ్యాలు కనబడుతున్నాయి.
రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీయేతర ప్రభుత్వాలే. కానీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మోడీకి వ్యతిరేకం. బీజేపీ మినహా మిగిలిన అపోజిషన్ పార్టీలు కూడా ఇదే టైపు. ప్రధాని రాకను ఈ పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్రాలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. అక్కడి జగన్ సర్కారు మోడీకి సానుకూలం. ప్రతిపక్షాలు కూడా మోడీ పర్యటనను పెద్దగా పట్టించుకోవడంలేదు.
మామూలుగానే ప్రతిపక్షాలను వేధించే జగన్ ప్రభుత్వం అపోజిషన్ పార్టీలకు ప్రధాని పర్యటనలో గొడవలు చేయవద్దని ముందే హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో కేసీఆర్ ప్రధానికి స్వాగతం చెప్పడానికే ఇష్టపడని పరిస్థితి ఉంటే ఏపీలో జగన్ ప్రభుత్వం మోడీకి సకల మర్యాదలు చేయబోతోంది. తెలంగాణా విషయానికొస్తే ….ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన కర్మగారాన్ని ఇప్పుడు ప్రధాని ప్రారంభించడం ఏమిటని టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీతో టీఆర్ఎస్ కొత్త మిత్రులు వామపక్షాలు, ఆ పార్టీల విద్యార్థి సంఘాలు గొంతు కలుపుతున్నాయి. రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకే 95% ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నదని టీఆర్ఎస్ విమర్శిస్తోంది. అప్పులు పుట్టనివ్వకుండా ఆంక్షలు విధించడమే కాకుండా, వడ్ల కొనుగోలు లో దోబూచులాడుతోందని మండిపడుతోంది. వివిధ పథకాల కింద రావాల్సిన నిధుల్లో కోతలు పెడుతున్నదని తప్పుపడుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరదీసి తమ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేసిందని మండిపడుతోంది. రామగుండం ఎరువుల కర్మాగారం ఇదివరకే ప్రారంభమైందని, ఉత్పత్తి కూడా మొదలైందని, అలాంటి కర్మగారాన్ని మళ్లీ ప్రారంభించడం ఏమిటని సిపిఎం ప్రశ్నిస్తోంది. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం, ఏఐఎస్ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ వంటి విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి.
ఉద్యోగాల సంగతిని తేల్చాకే ప్రధానమంత్రి ఇక్కడ అడుగు పెట్టాలని, లేకపోతే అడ్డుకుంటామని హెచ్చరించాయి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం యువతకు అన్యాయం చేస్తోందని, ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, రైల్వే శాఖలో లక్షల ఉద్యోగాలు పెండింగులో ఉన్నప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వడంలో అన్యాయం ఇస్తోందని ధ్వజమెత్తుతున్నారు. ప్రధాని రాష్ట్రంలో చేపట్టే అధికారిక పర్యటనకు కూడా ముఖ్యమంత్రి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. గతంలో ప్రధాని చేపట్టిన మూడు పర్యటనలకు గైర్హాజరైనట్టే ఇప్పుడు కూడా కేసీఆర్ వెళ్లడం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఆంధ్రా విషయానికొస్తే …. విశాఖలో జరిగే ప్రధాని మోడీ పర్యటనను రాజకీయంగా వాడుకోవాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది.
దీంతో ముందుగానే ఇది అధికారిక పర్యటన అని, రాజకీయం చేయొద్దంటూ విపక్షాలకు వార్నింగ్ ఇచ్చేసింది. ప్రధాని మోడీ రేపు సాయంత్రం విశాఖ రాబోతున్నారు. అనంతరం శోభాయాత్ర పేరుతో రోడ్ షో నిర్వహించి, అది పూర్తయ్యాక విశ్రాంతి తీసుకుని ఎల్లుండి విశాఖలో భారీ బహిరంగసభ నిర్వహణకు సిద్దమవుతున్నారు. దీనికి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో బీజేపీ విపక్ష పార్టీ అయినా కేంద్రంలో అధికారంలో ఉండటం, ప్రధాని మోడీతో సన్నిహిత సంబంధాలు నెరపాల్సిన పరిస్దితి వైసీపీకి ఈ పరిస్దితి కల్పిస్తోంది. దీంతో మోడీ టూర్ ను విజయవంతం చేయడం ఇప్పుడు వైసీపీకి తప్పనిసరిగా మారింది. ప్రధాని మోడీ విశాఖ టూర్ పూర్తి అధికారిక కార్యక్రమమే. అంటే ప్రోటోకాల్ లేనిదే ఈ టూర్ లో ఎవరూ పాల్గొనేందుకు అవకాశం ఉండదు.
ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విపక్షాలకు మరోసారి గుర్తుచేశారు. కాబట్టి దీనిపై రాజకీయాలు చేయొద్దంటూ ముందుగానే విపక్షాలకు బంధం వేసేశారు. దీనికి తగినట్లుగానే మోడీ విశాఖ టూర్ పై విపక్షాల్లో సైతం పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. మోడీ టూర్ తో ఏదో జరుగుతుందన్న భ్రమల్లో కూడా విపక్షాలు లేవు. దీంతో ఈ అధికారిక పర్యటనలో విపక్షాల గైర్హాజరీని పూర్తిగా వాడుకునేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ప్రధాని మోడీ విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సభకు రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది వరకూ జనసమీకరణ చేయాలని వైసీపీ భావిస్తోంది. అయితే ప్రధాని మోడీ సభ జరిగే మైదానం సామర్ధ్యం మాత్రం 1.3 లక్షలే. దీంతో ఎదురుగా ఉన్న మరో గ్రౌండ్ కూడా సిద్ధం చేస్తున్నారు.
ఉత్తరాంధ్రలోని ప్రతీ నియోజకవర్గం నుంచి భారీగా ఇక్కడికి జనాన్ని తరలించాలని సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం ఇన్ ఛార్జ్ లను కూడా నియమించింది. వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. భారీ ఎత్తున జనసమీకరణతో ప్రధానిని ప్రసన్నం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని ప్రతీ నియోజకవర్గం నుంచి భారీ జనసమీకరణ చేపట్టడం ద్వారా ప్రధాని సభను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణలో మాత్రం మోడీ రామగుండం పర్యటన నేపథ్యంలో ఆ సభకు 50 వేల మందిని తరలించాలని బిజెపి నాయకులు నిర్ణయించారు. మొదట ఈ సభకు లక్ష మందికి తరలించాలని అనుకున్నప్పటికీ స్థలా భావం వల్ల 50వేల మందికి కుదించారు.
స్టేడియంలో కుర్చీలు వేసినా 30 వేల మందికి మించి పట్టరు. ఎన్టిపిసి టౌన్షిప్ లోని మహాత్మా గాంధీ స్టేడియంలోనే సభను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రధాని పర్యటనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుండగా, సభకు ఎక్కువ మంది రైతులను తరలించేందుకు బిజెపి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాతో పాటు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల నుంచి రైతులను తరలించేందుకు బిజెపి నాయకులు సన్నద్ధమవుతున్నారు. 74 అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లోని ఫంక్షన్ హాల్ లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి రైతులను మోదీ పర్యటనను ఆద్యంతం తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవీ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన దృశ్యాలు.