ఏపీ సీఎం జగన్ ఎక్కడికి వచ్చినా కార్యక్రమం ముగించుకుని వెంటనే ప్రత్యేక విమానంలో తాడేపల్లి వెళ్ళిపోతారు. మూడున్నరేళ్ళ జగన్ ముఖ్యమంత్రిత్వంలో ఇదే జరుగుతూ వస్తోంది. ఎంత లేట్ అయినా నైట్ కి ఆయన ఎక్కడా ఉండేది లేదు. అలాంటి జగన్ విశాఖలో ఒక రాత్రి గడపబోతున్నారు.
అది కూడా ఫస్ట్ టైం విశాఖలో ఉంటున్నారు. ఈ నెల 11, 12 తేదీలలో ప్రధాని నరేంద్ర మోడీ వైజాగ్ పర్యటన ఉంది. దాంతో ముఖ్యమంత్రి షెడ్యూల్ కూడా ఖరారు అయింది. 11న సాయంత్రం అయిదు గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఆరుంపావు కల్లా విశాఖ చేరుకుంటారు.
అక్కడ ఆయన ప్రధాని మోడీకి ఐఎన్ఎస్ డేగా ఎయిర్ పోర్టుకు వస్తున్న ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతారు. ప్రధాని రోడ్ షోకి బీజేపీ వారు ప్లాన్ చేయడంతో జగన్ నేరుగా విశాఖ పోర్ట్ గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. 11వ తేదీ రాత్రి జగన్ విశాఖలోనే బస చేస్తారు.
ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ లో 12న జరిగే బహిరంగ సభలో ప్రధానితో పాటు జగన్ పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం ప్రధానికి వీడ్కోలు పలికి ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. ఈ మొత్తం టూర్ లో అందరినీ ఆకట్టుకునే అంశం ఏంటి అంటే జగన్ విశాఖలో ఒక రాత్రి బస చేయడం.
విశాఖ అంటే జగన్ కి ఎంతో మోజు ఉందని చెబుతారు. అలాగే ఆయన అనేక సార్లు సీఎం హోదాలో విశాఖ టూర్లకు వచ్చారు. కానీ ఆయన విశాఖలో ఎపుడూ రాత్రి బస చేసేవారు కాదు. ఇపుడు మొదటిసారి ఆయన విశాఖ నుంచి సూర్యోదయాన్ని చూడబోతున్నారు. మరి ఇది రేపటి జగన్ విశాఖ రాజధాని ఆశలకు నవోదయం అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. విశాఖ నుంచి పాలనకు ఇది శుభారంభంగానూ చెబుతున్న వారూ ఉన్నారు.