జ‌గ‌న్ సొంత జిల్లాలో వజ్రాలు!

క‌డ‌ప అంటే బాంబుల జిల్లాగా పిలుస్తారు. కానీ అక్క‌డ అలాంటి ప‌రిస్థితి లేదు. రాజ‌కీయంగా వైఎస్ కుటుంబాన్ని బ‌ద్నాం చేయ‌డానికి ప్ర‌త్య‌ర్థులు ఒక ప‌థ‌కం ప్ర‌కారం ప‌న్నిన కుట్ర‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ‌తారు. అలాంటి…

క‌డ‌ప అంటే బాంబుల జిల్లాగా పిలుస్తారు. కానీ అక్క‌డ అలాంటి ప‌రిస్థితి లేదు. రాజ‌కీయంగా వైఎస్ కుటుంబాన్ని బ‌ద్నాం చేయ‌డానికి ప్ర‌త్య‌ర్థులు ఒక ప‌థ‌కం ప్ర‌కారం ప‌న్నిన కుట్ర‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ‌తారు. అలాంటి క‌డ‌ప భూగ‌ర్భం వ‌జ్రాల శిశువును మోస్తున్న‌ట్టు జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా తేల్చేసింది. ఇది సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

క‌డ‌ప జిల్లా (వైఎస్సార్‌)లో ప‌రిశ్ర‌మ‌ల‌కు కావాల్సిన అనేక ముడిస‌రుకులు ల‌భిస్తాయి. తాజాగా వ‌జ్రాలను కూడా క‌డ‌ప భూగ‌ర్భం క‌లిగి ఉంద‌నే స‌మాచారం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఐఎస్‌) నివేదిక ప్ర‌కారం వైఎస్సార్ జిల్లా ప‌రిధిలోని పెన్నా న‌దీ బేసిన్ ప‌రివాహ‌క ప్రాంత‌మైన ఉప్ప‌ర‌ప‌ల్లెలో వ‌జ్రాల ల‌భ్య‌త‌కు సంబంధించి ఆధారాల‌ను సేక‌రించింది. 

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మేన‌మామ పి.ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం లోని చెన్నూరు మండ‌లంలో ఉప్ప‌ర‌ప‌ల్లె ఉంది. ఇది పెన్నా న‌దీ ప‌రివాహ‌క గ్రామం. క‌డ‌ప న‌గ‌రానికి స‌మీపంలో ఉంటుంది.

జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఐఎస్‌) దేశ వ్యాప్తంగా ఖ‌నిజాన్వేష‌ణ స‌ర్వే నిర్వ‌హించింది. ఈ సంస్థ ప‌రిశోధ‌న అనంత‌రం అన్ని రాష్ట్రాల మైనింగ్‌శాఖ‌ల‌తో ఢిల్లీలో కేంద్ర‌గ‌నుల‌శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషితో స‌మావేశం నిర్వ‌హించింది. నివేదిక‌ల‌ను సంబంధిత రాష్ట్రాల అధికారుల‌కు అంద‌జేసింది. 

ఈ నివేదిక ప్ర‌కారం వైఎస్సార్ జిల్లా ఉప్ప‌ర‌ప‌ల్లె ప్రాంతంలో 37.65 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో వ‌జ్రాలు దొరికేందుకు అవ‌కాశం ఉంది.  ఇక్క‌డ తిరిగి జీ-3,2,1 స్థాయి స‌ర్వేలు నిర్వ‌హించాల్సి వుంటుంది. ఇందుకు రెండు నుంచి ఐదేళ్ల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. అప్పుడు మాత్ర‌మే వ‌జ్రాల ల‌భ్య‌త‌పై పూర్తి స్ప‌ష్ట‌త వ‌స్తుంది.