ట్రైన్ లేట్.. కోర్టుకెక్కిన ప్ర‌యాణికుడు, నెక్ట్స్ ఏమైందంటే?

మ‌నం ప్ర‌యాణించాల్సిన ట్రైన్ లేట్ అయితే..  చేరాల్సిన గ‌మ్యాన్ని లేట్ గా చేరుకుంటే?  దాని వ‌ల్ల అంత వ‌ర‌కూ ప్లాన్ చేసుకున్న ప‌నుల‌న్నీ త‌ల‌కిందులైతే?  దాని వ‌ల్ల ఆర్థికంగా కూడా భారం ప‌డితే? ఇలాంటి…

మ‌నం ప్ర‌యాణించాల్సిన ట్రైన్ లేట్ అయితే..  చేరాల్సిన గ‌మ్యాన్ని లేట్ గా చేరుకుంటే?  దాని వ‌ల్ల అంత వ‌ర‌కూ ప్లాన్ చేసుకున్న ప‌నుల‌న్నీ త‌ల‌కిందులైతే?  దాని వ‌ల్ల ఆర్థికంగా కూడా భారం ప‌డితే? ఇలాంటి అనుభ‌వాలు ఇండియ‌న్ రైల్వేస్ లో ప్రయాణించే చాలా మందికి క‌లిగి ఉండ‌వ‌చ్చు.

ఉద‌యానికి గ‌మ్యం చేరుకుంటుంద‌నుకున్న రైలు, ఒక ప‌న్నెండు గంట‌ల త‌ర్వాత ఆ ఊరు చేర‌వ‌చ్చు. ఏ ట్రైన్ అయినా షెడ్యూల్ ప్ర‌కారం న‌డుస్తుంద‌ని చెప్ప‌లేం. క‌నీసం రెండు మూడు గంట‌ల పాటు డిలే కావ‌డం ప‌ర‌మ‌రొటీన్. మ‌రి ఇలాంటి అనుభ‌వాన్నే ఎదుర్కొనే శ‌త‌కోటి ప్ర‌యాణికుల్లో ఓ ప్ర‌యాణికుడు ఈ విష‌యంలో రైల్వేను కోర్టుకు ఇచ్చాడు! 

ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే.. ఈ కేసుపై విచార‌ణ జ‌రిపిన సుప్రీం కోర్టు ఇండియ‌న్ రైల్వేస్ పై 30 వేల ఫైన్ ను విధించింది. ఆ సొమ్మును ఆ ప్ర‌యాణికుడికి చెల్లించాల‌ని, దానిపై 9శాతం వ‌డ్డీని కూడా క‌ట్టాల‌ని కోర్టు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

జ‌మ్మూ నుంచి శ్రీన‌గ‌ర్ కు విమానం టికెట్ ను బుక్ చేసుకున్నాడ‌ట ఆ ప్ర‌యాణికుడు. అక్క‌డ‌కు చేర‌డానికి ఆజ్మీర్ నుంచి జ‌మ్మూ వెళ్లే రైలు ఎక్క‌డ‌ట‌. అత‌డు బుక్ చేసుకున్న టైమ్ ప్ర‌కారం.. ఆ ట్రైన్ స‌కాలంలో జ‌మ్మూ చేరితే అక్క‌డ విమానం ఎక్కొచ్చు. అయితే.. నాలుగు గంట‌ల లేట్ గా న‌డిచింది ఆ రైలు. దీంతో అత‌డికి ఫ్లైట్ మిస్ అయ్యింది. అత‌డే కాదు.. అత‌డి కుటుంబీకులు కూడా వెంట ఉన్నారు. ఆ రాత్రి వారు అక్క‌డే బ‌స చేయాల్సి వ‌చ్చింద‌ట‌.

ముందుగా చెప్పిన ప్ర‌కారం స‌మ‌యానికి గ‌మ్యం చేర‌క‌పోవ‌డం వ‌ల్ల‌.. త‌న‌కు విమానం మిస్ అయ్యింద‌ని, దీని వ‌ల్ల టికెట్ ధ‌ర‌ల న‌ష్టంతో పాటు, రాత్రి పూట బ‌స‌కు కూడా ఖ‌ర్చు అయ్యింద‌ని ఆ వ్య‌క్తి కోర్టు ఎక్కాడు.

త‌నకు జ‌రిగిన న‌ష్టానికి ప‌రిహారం చెల్లించాల‌ని ఇండియ‌న్ రైల్వేస్ ను కోర్టుకు లాగాడు. చివ‌ర‌కు కేసు గెలిచాడు. ట్రైన్ నాలుగు గంటల లేట్ కావ‌డం ఆ వ్య‌క్తికి ప‌డ్డ అద‌న‌పు భారాన్నంతా ఇప్పుడు రైల్వేస్ చెల్లించే ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి ట్రైన్ లు నిదానం కావ‌డం వ‌ల్ల ఈ త‌ర‌హాలో ఇబ్బంది ప‌డే వాళ్లంతా.. కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తే.. అప్పుడు ఇండియ‌న్ రైల్వేస్ ప‌రిస్థితి ఏమిటి?