కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉన్నాయి. అలా పుకార్లు వచ్చిన ప్రతిసారి పార్టీ దాన్ని ఖండిస్తూనే ఉంది. ప్రెస్ నోట్స్ రిలీజ్ చేసి మరీ విజయ్ కాంత్ ఆరోగ్యంగా ఉన్నారని, సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం మాత్రమే హాస్పిటల్ కు వచ్చారని కవర్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి చేయిదాటినట్టు కనిపిస్తోంది.
విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించినట్టు తెలుస్తోంది. అత్యవసర చికిత్స కోసం ఆయన చెన్నై నుంచి దుబాయ్ వెళ్లారు. అవసరమైతే అట్నుంచి అటు ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసి పెట్టారు. ఇంత జరుగుతున్నా పార్టీ నుంచి మాత్రం ఎప్పట్లానే కవరింగ్ నోట్ లు వస్తున్నాయి.
గతేడాది కరోనా బారిన పడ్డారు విజయ్ కాంత్. వైరస్ సోకి ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆ టైమ్ లో కూడా ఆయన హెల్త్ కండిషన్ పై పార్టీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. హాస్పిటల్ లో జాయిన్ అయిన 2 రోజులకు కరోనా అనే విషయాన్ని ప్రకటించారు.
ఆయన కోలుకున్న తర్వాత కూడా మరోసారి హాస్పిటల్ లో జాయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తే, అప్పుడు కూడా రొటీన్ హెల్త్ చెకప్ అంటూ కవర్ చేశారు. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ఉదయం 3 గంటలకు హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం ఏముందని అప్పట్లోనే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత అవన్నీ సద్దుమణిగాయి.
కొన్నాళ్లుగా పబ్లిక్ మీటింగ్స్ లో కనిపించడం లేదు విజయ్ కాంత్. అడిగితే కరోనా వైరస్ కారణంగా బయటకు రాలేదని చెబుతున్నారు. కనీసం అంతర్గతంగా జరిగే పార్టీ మీటింగ్స్ లో కూడా విజయ్ కాంత్ పాల్గొనకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఈ క్రమంలో కరోనా సైడ్ ఎఫెక్టుల వల్ల విజయ్ కాంత్ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నట్టు కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా విజయ్ కాంత్ దుబాయ్ వెళ్లడంతో ఈ వార్తలకు మరింత ఊతం దొరికింది. ఇకనైనా అధినేత ఆరోగ్యం విషయంలో పార్టీ కాస్త పారదర్శకంగా ఉంటే మంచిది.