కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా థియేటర్లలోకి వచ్చింది, వెళ్లింది కూడా. ఆగస్ట్ 6న విడుదలైన దాని ఫైనల్ రన్ ముగిసింది. తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్ డీల్ క్లోజ్ అయింది. ఈ డీల్ తో ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు సంబంధించి టోటల్ బిజినెస్ క్లోజ్ అయింది. మొత్తంగా చూసుకుంటే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం ఆర్జించింది ఈ సినిమా.
అటుఇటుగా ఐదున్నర కోట్ల రూపాయల బడ్జెట్ లో తీశారు ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాని. నిజానికి కిరణ్ కు అది చాలా పెద్ద బడ్జెట్. కాకపోతే ఔట్ డోర్ షూటింగ్ చేయడం, సినిమా కోసం ఎక్కువమంది జూనియర్ ఆర్టిస్టుల్ని వాడడం, కథ ప్రకారం పెళ్లిళ్లు చేయడం, అందరికీ భోజనాలు పెట్టడం లాంటి కార్యక్రమాల వల్ల బడ్జెట్ పెరిగింది. మరోవైపు ప్రమోషన్ కు కూడా గట్టిగా ఖర్చు చేశారు.
అలా మంచి బజ్ తో రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 31 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది. ఇది కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే. ఆడియో రైట్స్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ కింద మరో 5 కోట్ల రూపాయలు వచ్చాయి.
మొత్తంగా చూసుకుంటే.. ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు 13 కోట్ల 31 లక్షల రూపాయలు వచ్చినట్టయింది. పెట్టిన బడ్జెట్ తో కంపేర్ చేస్తే.. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు వచ్చినట్టు స్పష్టమౌతోంది.