కీచక ఉపాధ్యాయులకు ఇది గుణపాఠం కావాలి

చదువు పేరిట అభంశుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయులకు ఇది గట్టి హెచ్చరిక. ఓ కీచక ఉపాధ్యాయుడికి కోర్టు ఏకంగా 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. భద్రాద్రి కొత్తగూడెం…

చదువు పేరిట అభంశుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయులకు ఇది గట్టి హెచ్చరిక. ఓ కీచక ఉపాధ్యాయుడికి కోర్టు ఏకంగా 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది ఈ ఘటన.

లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్నాడు సునీల్ కుమార్. గతేడాది కరోనా వల్ల స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. అయినప్పటికీ సునీల్ కుమార్ వెనక్కి తగ్గలేదు. ఓవైపు కరోనా ఉన్నప్పటికీ, మరోవైపు కొంతమంది బాలికల్ని పాఠశాలకు రావాల్సిందిగా ఆదేశించాడు ఈ ఉపాధ్యాయుడు.

ఏమీ తెలియని చిన్నారులు కరోనా కాలంలో కూడా స్కూల్ కు వెళ్లారు. అలా వచ్చిన వాళ్లపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు సునీల్. తమపై లైంగిక దాడి జరిగినట్టు ఐదుగురు బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు సునీల్ కు దేహశుద్ధి చేశారు. ఆ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు ఎస్సై అంజయ్య, పోక్సో కేసు నమోదు చేసి సునీల్ ను అరెస్ట్ చేశారు. కొత్తగూడెంలోని పోక్సో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ కేసును విచారించింది. సునీల్ పై నమోదైన అభియోగాల్ని కోర్టు నిజమని నమ్మింది. సాక్ష్యాలన్నీ బలంగా ఉండడంతో నిందితుడికి 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 11వేల రూపాయల జరిమానా విధించింది కోర్టు.