ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ప్రత్యేక హోదా ఇవ్వడం ఎవరి చేతిలో ఉంది? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రమే అది సాధ్యం. ఒకవేళ స్పెషల్ స్టేటస్ ను గట్టిగా డిమాండ్ చేయాలంటే అది ఎవరితో సాధ్యం? రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకే అది సాధ్యం.
మరి ఇలాంటి టైమ్ లో హోదా అంశంతో టీడీపీ-కాంగ్రెస్ కలిస్తే ఏం జరుగుతుంది? బూడిదే మిగులుతుంది. అంతకుమించి ఏం జరగదు. కాంగ్రెస్ రాజకీయం మాత్రం బూడిద టైపులోనే సాగుతోంది. ఓవైపు చంద్రబాబు, బీజేపీ స్నేహం కోసం తహతహలాడుతున్నారు.
బీజేపీ కోరితే వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి కోరినన్ని ఎంపీ స్థానాలు కమలంకు కేటాయిస్తానని కూడా ఊరిస్తున్నారు. కానీ బీజేపీ కన్నెత్తి చూడడం లేదు. బాబుతో అంటకాగితే అసలుకే ఎసరు వస్తుందనేది బీజేపీ ఆలోచన. ఆలోచన కాదు అది నిజమే.
సున్నా కంటే ఒకటి బెటర్ కదా..
అయితే సున్నాలో ఉన్న కాంగ్రెస్ కి ఒకటి కలిసొచ్చినా గొప్పే కదా. అందుకే కాంగ్రెస్ ఇప్పుడు అదే ఆలోచన చేస్తోంది. సరికొత్త ప్రపోజల్ తో బాబును ఆశ్రయిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో పొత్తు కోసం సిద్ధపడుతోంది కాంగ్రెస్. అయితే ఒక కండిషన్.
ఏపీలో తమకు అసెంబ్లీ సీటు ఒక్కటికూడా వద్దు. కానీ ఎంపీ సీట్లు మాత్రం అడిగినన్ని ఇవ్వాలి. ఆ కండిషన్ కి బాబు ఒప్పుకుంటే కాంగ్రెస్ అధిష్టానం చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు రాయబారం పంపింది.
మోదీ హవా క్రమక్రమంగా తగ్గిపోతోందని, ఈ టైమ్ లో ప్రతిపక్షాల మద్దతుతో 2024లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, గతంలో తామిచ్చిన హామీయే కాబట్టి, ఏపీకి ప్రత్యేక హోదా కట్టబెడుతుందనేది ఈ పొత్తు చర్చల సారాంశం.
టీడీపీ, కాంగ్రెస్ కలిస్తే, ఏపీ నుంచి అత్యథిక స్థానాలు ఆ కూటమికి అప్పగిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమని ప్రచారం చేయబోతున్నారు. ఆలోచన బాగానే ఉంది కానీ, ఇది అమలయ్యే దారే ప్రస్తుతం ఏపీలో లేదు. వీరి పొత్తు చర్చలు ప్రస్తుతానికి గాలిమేడలు మాత్రమే.
జిత్తులమారి బాబుతో కలిస్తే ఏంటి ప్రయోజనం
ఒకవేళ నిజంగానే ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ కలిస్తే కాంగ్రెస్ కి వచ్చే సున్నా మార్కుల్లో పెద్ద మార్పేమీ ఉండదు కానీ, టీడీపీకి వచ్చిన 23 మార్కులు కూడా తగ్గిపోయే అవకాశముంది. కాంగ్రెస్, టీడీపీ అపవిత్ర పొత్తుని ఎవరూ నమ్మరు.
ముఖ్యంగా ఏపీ విభజనకు కారణం అయిందన్న కారణంతో కాంగ్రెస్ ని పాతాళానికి తొక్కేశారు ఏపీ ప్రజలు. అలాంటిది ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామన్నా.. అది కాంగ్రెస్ ద్వారా అవసరం లేదనేది ఏపీ ప్రజల ఆలోచన.
ఈ విషయాన్ని పక్కనపెడితే.. తెలంగాణ ఎన్నికల అనుభవాన్ని కాంగ్రెస్ అధిష్టానం మరచిపోయినట్టుంది. టీడీపీతో కలిస్తే ఏం జరుగుతుందో కాంగ్రెస్ కు తెలంగాణలో బాగా అనుభవంలోకి వచ్చింది. అయినప్పటికీ ఇప్పుడు ఏపీలో టీడీపీతో కలవాలని కోరుకుంటోంది. ఆ పార్టీకి అంతకుమించి ప్రత్యామ్నాయం కూడా లేదు ఏపీలో.