నటుడు పవన్ కల్యాణ్ పై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నాడు కమెడియన్ కమ్ నిర్మాత బండ్ల గణేశ్. కేవలం పవన్ తో సినిమా చేసేందుకే ఆయనతో క్లోజ్ గా ఉంటున్నారనే విమర్శల్ని తిప్పికొట్టాడు బండ్ల.
“సినిమా తీసినా తీయకపోయినా పవన్ కల్యాణ్ వెంట తిరుగుతాను. పవన్ తో తిరగడానికి, సినిమా తీయడానికి సంబంధం లేదు. దేవుడు వరమిచ్చినా ఇవ్వకపోయినా గుడికి వెళ్తాం. నేను కూడా అంతే. పవన్ దగ్గరకు వెళ్తుంటాను. ఆయనతో సినిమా తీస్తానా తీయనా అనేది తర్వాత విషయం.”
మరోవైపు తన కరోనా కష్టాల్ని కూడా బయటపెట్టాడు బండ్ల. తనకు రెండోసారి కరోనా సోకిందని, ఆ టైమ్ లో ఎవ్వరూ తనను ఆదుకోలేకపోయారని, చిరంజీవి చొరవతో తను ప్రాణాలతో బయటపడ్డానని చెప్పుకొచ్చారు బండ్ల.
“నాకు రెండోసారి కరోనా వచ్చింది. లంగ్స్ 80శాతం దెబ్బతిన్నాయి. ఏ హాస్పిటల్ కు ఫోన్ చేసినా బెడ్స్ లేవన్నారు. మా హీరోకు ఫోన్ చేద్దాం అనుకుంటే, అప్పుడే ఆయన కరోనా బారిన పడ్డారు. ఏం చేయాలో తెలియక చిరంజీవి గారికి ఫోన్ చేశాను. ఒక్క నిమిషం అంటూ వెంటనే ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత నాకు వెంటనే హాస్పిటల్ బెడ్ ఎరేంజ్ చేశారు. ఒక్క రోజు ఆలస్యం చేసినా నేను చనిపోయేవాడినని డాక్టర్లు చెప్పారు. ఈరోజు నేను బతికున్నానంటే దానికి కారణం చిరంజీవి గారు.”
చిరంజీవి కుటుంబంలో అందరూ మంచోళ్లని, తను ఎప్పుడూ వాళ్లకు మద్దతుదారుగా ఉంటానని ప్రకటించాడు బండ్ల గణేశ్. త్వరలోనే తను హీరోగా ఓ సినిమా చేయబోతున్నానని, సెప్టెంబర్ నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా కోసమే ప్రస్తుతం గడ్డం పెంచే పనిలో ఉన్నాడు బండ్ల గణేశ్.