లీడ్స్ టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్ కాస్త నిలదొక్కుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 78 పరుగులకు ఆలౌట్ అయిన వారే, ప్రస్తుతం 215 పరుగులకు రెండు వికెట్లను కోల్పోయిన స్థితిలో ఉన్నారు. క్రీజ్ లో కెప్టెన్ కొహ్లీ, పుజారాలున్నారు. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు కనీసం ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలన్నా.. ఇంకా 139 పరుగులను చేయాల్సి ఉంది. ఆ మేరకు పరుగులు చేస్తే.. అవమానకరమైన ఇన్నింగ్స్ ఓటమి తప్పుతుంది.
అయితే రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా నుంచి ఈ ప్రతిఘటన కూడా గొప్పగానే ఉంది. తొలి ఇన్నింగ్స్ చేదు అనుభవంతో రెండో ఇన్నింగ్స్ లో కూడా ఒత్తిడికి గురై బ్యాట్స్ మెన్ చేతులెత్తేస్తారేమో అని ఫ్యాన్స్ భయపడ్డారు కూడా. అయితే నెమ్మదిగానే ప్రారంభం అయినా, రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కాస్త నిలదొక్కుకుంది. కొహ్లీ, పుజారాల జోడి కుదురుగా ఆడితే ఇన్నింగ్స్ ఓటమి ఈజీగా తప్పుతుంది. అయితే అనిశ్చితికి మారుపేరుగా మారుతోంది టీమిండియా ప్రదర్శన.
ఇలాంటి నేపథ్యంలో లీడ్స్ టెస్టులో కూడా ఏదైనా జరగొచ్చనే పరిస్థితి నెలకొంది. నాలుగో రోజు టీమిండియా కంప్లీట్ గా బ్యాటింగ్ చేయగలిగితే.. మ్యాచ్ ఫలితం మరోలా ఉండే అవకాశాలున్నాయి. నాలుగో రోజు పూర్తిగా బ్యాటింగ్ చేస్తే.. టీమిండియా పరుగుల ఆధిక్యతను కూడా సంపాదించుకోవడం ఖాయం.
తొలి ఇన్నింగ్స్ లో చిత్తుగా ఆలౌట్ అయిన తర్వాత… రెండో ఇన్నింగ్స్ లో ఆధిక్యాన్ని సంపాదిస్తే.. టీమిండియా తరఫున ఇదో అరుదైన ఫీటే అవుతుంది. ఈ మ్యాచ్ లో గనుక అద్భుతం జరిగి భారత్ విజయం సాధిస్తే.. ఫాలో ఆన్ ఆడి దశాబ్దాల కిందట టెస్టు గెలిచిన చరిత్రకు సమానమవుతుంది ఈ మ్యాచ్ కూడా. స్థూలంగా మొత్తం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ మీదే ఆధారపడి ఉంది.