ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొత్త ఫీట్ నమోదైంది. శుక్రవారం రోజున దేశ వ్యాప్తంగా సుమారు కోటి డోసుల వ్యాక్సినేషన్ జరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల నుంచినే 45 యేళ్ల వయసు లోపు వారికి కూడా ప్రభుత్వం తరఫు నుంచి వ్యాక్సిన్ డోసులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో.. శుక్రవారం రోజున ఏకంగా కోటి డోసుల వ్యాక్సినేషన్ జరిగింది.
ఆగస్టు ఒకటి నుంచినే దేశంలో రోజుకు కోటి డోసుల వ్యాక్సినేషన్ జరుగుతుందని కేంద్రం ఇది వరకే ప్రకటించింది. అయితే.. అలాంటిదేమీ జరగలేదు. ఇప్పటి వరకూ ఆగస్టు 16న 92 లక్షల డోసుల వ్యాక్సినేషన్ చేయగా, అదే రికార్డుగా నిలిచింది. ఇప్పుడు ఆగస్టు నెలాఖరుకు ఒకే రోజు కోటి డోసుల వ్యాక్సినేషన్ సాధ్యం అయినట్టుగా ఉంది.
ఇలా భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ ద్వారా.. దేశ జనాభాలో 37శాతం మందికి కనీసం ఒక డోసు వ్యాక్సినేషన్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. అదే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వారి శాతం సుమారు పదిగా ఉంది. రెండో డోసు వేయించుకోవాల్సిన గడువు దాటిపోయినా కొందరు వ్యాక్సిన్ వేయించుకోలేదని కూడా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కోటిన్నర మంది రెండో డోసుకు మిస్ అయ్యారట.
ఇక ఏపీలో ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియను సాగిస్తున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు.. ప్రతి ఇంటికీ వెళ్లి వ్యాక్సిన్ ఇస్తున్నారు. 45 యేళ్ల లోపు వయసు వారిలో కొందరు అనాసక్తితో ఉన్నా.. వారికి ధైర్యం చెబుతూ.. వీరు వ్యాక్సిన్లను వేయిస్తున్నారు. అయితే.. ఇప్పటికీ కొందరు ఈ వ్యాక్సిన్ సూదిమందు పట్ల అనాసక్తితో, భయంతో కనిపిస్తున్నారు సెమీ అర్బన్, రూరల్ ఏరియాస్ లో.