ఐలాపురం రాజాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమాచార హక్కు చట్టం కమిషనర్ గా నియమించారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాన హోదా కలిగి ఉండే సదరు పదవీ వైభవాన్ని ఆయన ఆరేళ్లపాటు అనుభవించగలరు. నిబంధనలకు వ్యతిరేకంగా ఈ నియామకం జరిగిందని ఇప్పుడు వివాదం రేగుతోంది. వివాదం సంగతి అటుంచితే… ఈ వ్యవహారంలో తెలుగు తమ్ముళ్లు నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఒకటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఐలాపురం రాజా అంటే కరడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తగా ముద్ర ఉంది. క్రియాశీలం కాకపోయినా.. తెలుగుదేశం కోసం తెరవెనుక పనిచేసే ప్రముఖుల్లో ఒకరుగా పలువురు చెప్పుకుంటూ ఉంటారు. మొత్తానికి చంద్రబాబునాయుడు.. తన పదవీకాలం చివరి సమయంలో.. అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఆయనకు సహచట్టం కమిషనర్ పదవి కట్టబెట్టారు. ఈ నియామకంపై వైఎస్సార్ కాంగ్రెస్ అనేక ఆరోపణలు గుప్పించింది.
రాజకీయ నియామకంలాగా ఉన్నదని దెప్పిపొడిచింది. దానితోపాటు కోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఈ నియామకానికి ఈసీ అనుమతి ఇచ్చిందంటూ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు చెప్పారు. వివాదం మాత్రం సజీవంగా ఉంది. ఇది చట్టబద్ధంగా జరిగినదేనా? కాదా? అనే సంగతి పక్కన పెడితే… ఈ వ్యవహారం నుంచి తెలుగు తమ్ముళ్లు నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. ఈ సహ చట్టం కమిషనర్ పదవి ఎన్నాళ్లుగా ఖాళీగా ఉంది.
ప్రభుత్వం సాధారణ స్థితిలో పరిపాలన సాగించవలసిన రోజులన్నీ గడచిపోయిన తర్వాత ఈసీ అనుమతి తీసుకుని మరీ నియామకం చేపట్టవలసిన అగత్యం ఏమొచ్చింది? పార్టీలోనే దీనిమీద విసుర్లు వినిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవులే అయినా.. వాటిని సకాలంలో పంచేసి… కార్యకర్తలు నాయకులు వాటిని అనుభవించేలా చూడడానికి చంద్రబాబుకు మనసొప్పదు అని కార్యకర్తలు అనుకుంటున్నారు. ఇవ్వవలసిన సమయంలో ఇచ్చేసి ఉంటే అసలు ఇంత తకరారు వచ్చేదే కాదు కదా అని వారు అంటున్నారు.
నామినేటెడ్ పదవుల్ని పంచకుండా నాన్చి నాన్చి.. అసలు ఎవ్వరూ ఏమీ అనుభవించకుండా చేయడం చంద్రబాబు అలవాటు అని… ఇప్పుడు ఒత్తిడి తాళలేక చివరి సమయంలో ఈ పదవిని కేటాయించి చిక్కులు తెచ్చిపెట్టుకున్నారని… విమర్శలు వస్తున్నాయి. తమ అధినాయకుడి శైలి గురించి ఇప్పటికైనా తమ్ముళ్లు తెలుసుకుంటే మంచిది.